నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా రాజధాని మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించింది. దాని పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లతో ఉక్రెయిన్ రెచ్చిపోయింది. దాడిలో కనీసం ఇద్దరు మరణించారని, ఒక ప్రధాన రిఫైనరీ దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. రాజధాని మేయర్ సెర్గీ సోబ్యానీన్ మాట్లాడుతూ, 1,600కు పైగా డ్రోన్లను అడ్డుకుని కూల్చివేశామని, వాటిలో 450 మాస్కోను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. పలు డ్రోన్లు మాస్కోలోని కీలక ఆయిల్ రిఫైనరీలు సహా నాలుగు భవనాలను తాకినట్లు అధికారులు పేర్కొన్నారు.రష్యాలో త్వరలో పార్లమెంటరీ ఎన్నికలు (Parliamentary Elections) నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ మాస్కోపై దాడులు తీవ్రం చేయడం గమనార్హం.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడులను ప్రశంసిస్తూ, “నిన్న రాత్రి మాస్కో ప్రాంతంలో మా దాడులు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి” అని అన్నారు. “రష్యా యొక్క కీలక చమురు పరిశ్రమ సౌకర్యాలలో ఒకటి మరియు దురాక్రమణదారుడి లాజిస్టిక్స్ సౌకర్యం దెబ్బతిన్నాయి. ఇవి యుద్ధ యంత్రాంగాన్ని నిలబెట్టే బిలియన్ల డాలర్ల విలువైనవి,” అని ఆయన Xలో పోస్ట్ చేశారు.



