ఎండమావిగా ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు
వలస బాటలో పాలమూరు రైతులు
ప్రశ్నార్థకమైన ఆయకట్టు భవితవ్యం
నత్తనడకన రిజర్వాయర్ల భూసేకరణ
ఎండుతున్న పంటలను కాపాడాలి:సీపీఐ(ఎం)
నవతెలంగాణ -మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
తుంగభద్ర నదీ జలాల వివాదాల నడుమ.. రాయచూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ’ (ఆర్టీఎస్) రైతుల పాలిట గుదిబండలా మారింది. దశాబ్దాలుగా నలిగిపోతున్న రైతాంగం వేదనకు, పాలకుల నిర్లక్ష్యానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాల్వలు.. నేడు నీటి జాడ లేక వెలవెలబోతున్నాయి. ఎగువన అక్రమ కట్టడాలు, కర్నాటక సరిహద్దుల్లో జరుగుతున్న నీటి మళ్లింపులతో దిగువన ఉన్న తెలంగాణ చివరి ఆయకట్టు రైతుల హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి. ఒప్పందం ప్రకారం అందాల్సిన వాటా నీరు రాక వేలాది ఎకరాల భూమి ఎడారిగా మారుతోంది. దశాబ్దాలుగా వినిపిస్తున్న ఆధునికీకరణ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. సాగునీటి కోసం ఎదురుచూసి అలసిపోయిన రైతులు, చివరకు బతుకుదెరువు కోసం కూలీలుగా వలసెళ్లే దుస్థితి దాపురించింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వేల ఎకరాల సాగుకు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కీలక ఆధారం. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది. కర్నాటకలోని రాయచూర్‌లో హెడ్ వర్క్స్ ఉన్నప్పటికీ.. దీని కింద రాయచూర్‌తో పాటు తెలంగాణలోని జోగులాంబగద్వాల, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సింది. నడిగడ్డ ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అయిన ఆర్డీఎస్.. నేడు ఆధునీకరణ పనులు, రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది.
15 టీఎంసీల్లో 5 టీఎంసీలే..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీఎస్ ఆయకట్టును కాపాడటంలో రెండు ప్రధాన పనులు జరిగాయి. అందులో ఒకటి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణం కాగా, రెండోది ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు ప్రయత్నం. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు కేటాయించిన 15.9 టీఎంసీల నీటిలో వాస్తవంగా 5-6 టీఎంసీలు మాత్రమే అందేవి. కర్నాటకలోని సుంకేసుల బ్యారేజీ ఆనకట్ట ఎత్తు, కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, ఇతర రాష్ట్రాల అడ్డంకుల కారణంగా ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడేది. దీనికి పరిష్కారంగా తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి నేరుగా నీటిని ఎత్తిపోసి, ఆర్డీఎస్ కాలువలోకి వదిలేలా ప్రాజెక్టును రూపొందించారు. దీనిద్వారా గద్వాల, అలంపూర్ నియోజక వర్గాల్లోని సుమారు 87,500 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు 10 నెలల కాలంలో పూర్తయి నీటి విడుదల జరిగింది. ఆర్డీఎస్ కాలువల ఆధునికీకరణ పూర్తి కాకపోవడం వల్ల గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదు.
మల్లమ్మ కుంట పరిస్థితి ఇలా..
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ కీలకం. తుమ్మిళ్ల పథకం ద్వారా సాగునీటిని అందించే లక్ష్యంతో రాజోలి మండలంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రిజర్వాయర్ పూర్తయితే నదిలో వరదలు ఉన్నప్పుడు నీటిని తీసుకోవడంతో పాటు, వర్షపు నీటిని కూడా నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మల్లమ్మ కుంట ద్వారా ఆర్డీఎస్ కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందించ వచ్చని అధికారులు ముందు నుంచే భావిస్తున్నారు. మొదటి విడత పనులు పూర్తయినప్పుడే మల్లమ్మ కుంట నిర్మాణాన్ని చేపట్టి ఉంటే, ఈపాటికి పనులు పూర్తయ్యేవి. కానీ, పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మల్లమ్మ కుంట నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రిజర్వాయర్‌కు సంబంధించి పెగ్ మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.
వివాదాలు, చిక్కుముళ్లు..
తుంగభద్ర నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ.. కర్నాటక పరిధిలోని హెడ్ వర్క్స్ వివాదాలు, గద్వాల జిల్లా పరిధిలోని రిజర్వాయర్ల భూసేకరణ జాప్యం కారణంగా రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఆర్డీఎస్ నీటిని నిల్వ చేసుకుని ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఫేస్ 2 లో భాగంగా,మల్లమ్మ కుంట రిజర్వాయర్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. భూసేకరణ ప్రక్రియ మూడేండ్లుగా ముందుకు సాగడం లేదు. రైతులకు సరైన పరిహారం పంపిణీ చేయకపోవడం, పరిపాలనాపరమైన జాప్యం దీనికి ప్రధాన అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసి, యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేస్తేనే ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
రాజోలిబండ.. మళ్లీ కావొద్దు గుదిబండ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


