12 అంశాల్లో ఇప్పటికే రెండింటిపై జీవోలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ధ్రువపత్రాల అందజేత
నవతెలంగాణ -ఎల్బీనగర్
రాష్ట్రంలో 22`ఏతో పాటు ఇతర భూ సమస్యలకు త్వరలో పరిష్కారం చూపి ప్రజలకు తీపికబురు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించిన 12 అంశాలపై దశలవారీగా చర్యలు చేపడుతున్నామని, ఇందులో కాలనీల సమస్యకు జీవో 118, సింగరేణి ప్రాంతంలోని ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 76 జారీ చేసినట్టు వెల్లడించారు. మరో 45 రోజుల్లో భూ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల్లో ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ధ్రువపత్రాలను శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల భూ సమస్యల పరిష్కారానికి ఆధార్ తరహాలో భూదార్ కార్డులు అందించనున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 64 కాలనీలకు 44 కాలనీల సమస్యలను పరిష్కరిం చామని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి నిషేధిత ఉత్తర్వులు ఉన్నప్పటికీ నెల రోజుల్లోగా సమస్యలను పరిష్కరించి ఇండ్లను క్రమబద్ధీకరిస్తామని, ఎవరూ ఇండ్లు కూల్చాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. జీవో 118 ద్వారా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని మరికొంత మంది సమస్యలను కూడా నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించి భూముల సరిహద్దులను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా నమోదు చేసి ప్రతి భూమికీ భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.22ఏ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే ఉందని, దానిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని లేఅవుట్లలోని కొన్ని ప్లాట్లు కూడా 22ఏ జాబితాలో చేరాయని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని ప్రకటించారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీవో 118 జారీ చేయలేదని, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ప్లాట్ యజమానికీ పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలోని చిక్కులను తొలగించేందుకు 44 కాలనీల కోసం జీవో 118 తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో భూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. కాలనీల్లో బస్సు సౌకర్యం అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైన చోట ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని అన్నారు.
సమావేశంలో తోపులాట
స్టేడియంలో సభ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు వేదికపైకి రావడంతో బీఆర్ఎస్ నాయకులను కూడా వేదికపైకి అనుమతించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పట్టుబట్టినట్టు తెలిసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింపజేశారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యేలు సుధీర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ బుగ్గ రపు దయానంద్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ మలక్‌పేట్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అక్బర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్మో హన్‌గౌడ్, దేప భాస్కర్‌రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్ శ్రీనివాస్‌గుప్తా, ఈశ్వరమ్మ యాదవ్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



