Sunday, September 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకోదాడలో త్వరలో టాస్క్ కేంద్రం

కోదాడలో త్వరలో టాస్క్ కేంద్రం

- Advertisement -

కోదాడలో మెగా జాబ్‌‌మేళా ప్రారంభం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
​350 కంపెనీల ద్వారా 5,725 మంది 
అభ్యర్థుల ఎంపిక
​దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటాం: మంత్రి ఉత్తమ్‌


​నవతెలంగాణ- కోదాడ టౌన్

​కోదాడలో త్వరలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌‘టాస్క్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్‌మేళాను ఆయన మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌‌బాబు మాట్లాడుతూ.. స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కేంద్రం లక్ష్యమని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ​జాబ్‌మేళాలో పాల్గొన్న 350కి పైగా కంపెనీలు దాదాపు 5,725 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేయడం గొప్ప విషయమని చెప్పారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి వారం రోజులుగా నిరంతరం శ్రమించిన అధికారులు, కంపెనీల ప్రతినిధులు, సుమారు 700 మంది వాలంటీర్ల సేవలను ప్రశంసించారు. ప్రభుత్వం ఒక్కటే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రయివేటు రంగం కూడా ముందుకొచ్చి ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, డిప్లొమా, ఐటీఐ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువతకు పరిశ్రమలు విస్తృత అవకాశాలు కల్పించాలన్నారు.​ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి విజ్ఞప్తి మేరకు కోదాడలో వీలైనంత త్వరగా ‘టాస్క్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

జాబ్‌‌మేళాకు కంపెనీల స్పందన : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి
మెగా జాబ్‌మేళాకు దాదాపు 365 కంపెనీలను ఆహ్వానించగా, సుమారు 350 కంపెనీలు స్పందించి కోదాడకు వచ్చాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందుబాటులోకి తీసుకురావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ వంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అయితే కోదాడ, హుజూర్‌నగర్‌, నడిగూడెం, మునగాల వంటి ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఆ సంస్థలను నేరుగా సంప్రదించే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ​తాను, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతిరెడ్డి దశాబ్దాలుగా ఏర్పరచుకున్న పరిచయాలను ఉపయోగించి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామని చెప్పారు. పరిశ్రమల శాఖ, సింగరేణి కాలరీస్‌తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా కంపెనీలను కోదాడకు తీసుకురావడంలో సహకరించాయని వివరించారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించారు. శాసనసభా పతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ తదితరులు పాల్గొన్నా రు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -