ట్రంప్ సుంకాలను వ్యతిరేకించాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రచయితలు, గాయకుల వర్క్‌షాప్
నవతెలంగాణ – ముషీరాబాద్
ట్రంప్ సుంకాల విధానాలు, కార్పొరేట్ అనుకూల ఒప్పందాలను తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన రచయితలు, గాయకుల వర్క్‌షాప్‌ను జూలకంటి ప్రారంభించి మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరిట సామ్రాజ్యవాద, విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలు రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలపై సాగిస్తున్న దాడులను తిప్పికొట్టాలని అన్నారు. సీలింగ్ దాటిన భూములు, భూదాన్, పోరంబోకు భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని పేదలకు స్థలాలతోపాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. దళితులు, గిరిజనులు, డీనోటిఫైడ్ తెగలు, ఎంబీసీ, బీసీ, పేద ఓబీసీలకు భూమి, ఇండ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలను అధికారికంగా రైతులుగా గుర్తించాలని అన్నారు. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న అటవీ సంరక్షణ చట్టంలోని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అటవీ, దేవాలయ, ట్రస్టు, ఇనాం, పచ్చిక బయళ్ల భూములను సాగుచేస్తున్న రైతుల పేర్లను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. జాతీయ రైతు కమిషన్ సిఫార్సుల ప్రకారం సి2+50 శాతం పద్ధతిలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంటల కొనుగోలుకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు, విద్యుత్ రంగాల ప్రయివేటీకరణను నిలిపివేసి ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని, విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవడంతోపాటు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలని, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కోరారు. రైతాంగ హక్కుల పరిరక్షణకు రచయితలు తమ సాహిత్యం, గాయకులు తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందచారి, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర మాజీ కార్యదర్శి కె.శాంతారావు, రచయిత బండి సత్తన్న, రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జే. వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోహన్‌కృష్ణ, పీఎన్‌ఎం రాష్ట్ర నాయకులు ఆనంద్, కె.భాస్కర్, ఆశన్న, ముత్యాలు, శారద, గాయకులు పాటల వెంకట్‌రెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ అనుకూల ఒప్పందాలను తిప్పికొట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



