Sunday, September 20, 2026
E-PAPER
Homeసోపతిఎం.ఎల్. వసంతకుమారి ఒక విషాద స్వర విపంచి గానం

ఎం.ఎల్. వసంతకుమారి ఒక విషాద స్వర విపంచి గానం

- Advertisement -

1941. బెంగళూరులో ఒక ‘సోలో’ కచేరీ చేయాల్సిన గాయనికి హఠాత్తుగా అనారోగ్యం కలగడంతో నిర్వాహకులు ఆమె స్థానంలో మరొకరిని ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఒక 13 ఏళ్ల బాలికను వేదిక పైకి తీసుకువెళ్లారు.‌ నిర్వాహకులు అంతకముందు తమ ప్రకటనలో ఆ అమ్మాయి పేరుకు ముందు ‘మద్రాసు లలితాంగి వసంతకుమారి’ అంటూ పలకడంతో ఎవరో పెద్ద పేరున్న గాయనిగా భావించారు. ఐతే ఆ బాలిక కచేరి చేయబోతున్నది తన తల్లి స్థానంలో. కానీ నిర్వాహకుల దృష్టిలో ఆమె కేవలం ఒక ‘ప్రత్యామ్నాయం’. కానీ తర్వాత కాలంలో ఎంతో గొప్పగా రాణించింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ తర్వాత భారతదేశంలో కర్ణాటక సంగీత త్రయంగా పేర్కొనబడే విధ్వన్మణులలో ఒకరైన ఎం.ఎల్.వసంతకుమారి. ఆమె తల్లి దేవదాసి సమాజానికి చెందిన లలితాంగి.‌

1928 జూలై 3 మద్రాసులో పుట్టిన ఎం.ఎల్. వసంతకుమారి కర్ణాటక సంగీత ప్రదర్శన శైలిని పునర్నిర్వచించింది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్‌లతో కలిసి ఎం.ఎల్.వి. కర్ణాటక సంగీత త్రయంగా తనదైన ఒక శకాన్ని కొనసాగించింది. వీరిలో ఎం.ఎస్‌, ఎం.ఎల్‌.వి ఇద్దరూ దేవదాసి సమాజానికి చెందగా, డీకేపీ సంప్రదాయ కుటుంబం నుండి వచ్చింది. అయితే ఎం.ఎస్‌ కొన్ని సినిమాలలోనే నటించిగా, ఎం.ఎల్‌.వి మాత్రం సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతాన్ని సమపాళ్లలో పాడటం గమనార్హం.
నూతన ఆవిష్కరణల పట్ల ఎం.ఎల్.వి.కి ఉన్న మక్కువ ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి చేర్చింది. జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం శిష్యురాలైన ఆమె ఆయన వేగవంతమైన గాన శైలిని అనుసరించినప్పటికీ దానికి తనదైన ఆకర్షణను, వ్యక్తిత్వాన్ని జోడించి ఒక సరికొత్త బాణీని సృష్టించింది. తన తల్లి లలితాంగి వద్ద శిక్షణ పొందిన వసంత 11 ఏటనే తన తల్లితో కలిసి కచేరీలలో పాల్గొంది. తండ్రి కూతనూరు అయ్యస్వామి అయ్యర్ కూడా సంగీత విద్వాంసుడే.
ఎం.ఎల్.వి. కచేరీలను అరుదైన రాగాల రూపకల్పనలోకి తీసుకువెళ్ళింది. ఆమె దేవర్ నామాలు, దాసర్ కీర్తనలు వినడానికి ప్రేక్షకులు పోటెత్తారు. అరియక్కుడి రామానుజ అయ్యంగార్ స్వరపరిచిన మార్గశిర మాసం నుండి తిరుప్పావై వరకు ఆమె గానం ప్రతి ఇంట్లో వినిపించేది. ఉస్తాదులతో సహా దిగ్గజాలు ఆమె ప్రతిభకు కొనియాడారు. పురందరదాసు కీర్తనలు, సంగీత త్రిమూర్తుల కృతులు, అలాగే అక్కడికి వచ్చే హిందుస్థానీ సంగీతకారులు ఆలపించే ఖయాల్, ఠుమ్రీ ధున్‌ల స్వరాలతో ఆమె ఇల్లు నిరంతరం ప్రతిధ్వనించేది. అంతేకాదు ఆమె తన శ్రోతలందరి మనసులపై చెరగని ముద్ర వేసింది. గురువు జి.ఎం. తన సంగీతంలోని అంశాలను గ్రహిస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవాలని ఆమెకు సూచించారు. ఆమె సరిగ్గా అదే చేశింది.
మద్రాసులోని సంగీత అకాడమీ నుండి 49 ఏళ్ల వయసులో సంగీత కళానిధి పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కురాలైన మహిళగా నిలిచిన ఎం.ఎల్.వి.ని పలు సంస్థలు ఘనంగా సత్కరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆమెను గౌరవించగా, మైసూరు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇక వీటన్నింటికీ మకుటాయమానంగా పద్మభూషణ్ కూడా లభించింది. ఆమె వారసత్వం ఎందరో శిష్యుల చేతుల్లో సురక్షితంగా నిలిచింది. వారిలో సుధా రఘునాథన్, చారుమతి రామచంద్రన్, ఎ. కన్యాకుమారి వంటి వారు కొందరు. ఎం.ఎల్‌.వి ఉదారత కేవలం తన శిష్యులకే పరిమితం కాలేదు. అనేక సేవా కార్యక్రమాల కోసం కచేరీలు చేశింది. జిఎం బాలసుబ్రహ్మణ్యంకి నిజమైన శిష్యురాలిగా నిలిచిన ఆమె చివరి రోజు వరకు ఆయనతో గాఢమైన అనుబంధాన్ని కొనసాగించింది.

కచేరీల్లో పరిచయమైన కృష్ణమూర్తిని తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్ళాడింది. ఆ రోజుల్లో సంగీత కారులకు సినిమా రంగం తలుపులు తెరిచి ఉండేవి. అందం, గాత్రంగల ఎమ్.ఎల్.వి 20 ఏళ్ళ పాటు సినిమాలో పాడింది. 1950ల నుండి ఆమె పాడిన అనేక సినీ గీతాలు సంగీత పరంగా అద్భుతమైనవి. ఆయా సినిమాలకే అవి ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. త్యాగరాజ భాగవతార్ ‘రాజముక్తి’లో ఆమె తొలుత పాడింది. ఆ తర్వాత ‘సుదర్శన్’ చిత్రంలో పాడటంతో పాటు నృత్యం కూడా చేసింది. నృత్యం నేర్చుకోవడానికి దండాయుధపాణి పిళ్ళై వద్దకు వెళ్లింది. కానీ నృత్యం వల్ల తన గాత్రం దెబ్బతింటుందని గాత్రానికే పరిమితమైంది.
సి.ఆర్. సుబ్బరామన్ సంగీతంలో ‘మన్ మగళ్’ (51) చిత్రం ఆమెకి మొదటి పెద్ద విజయం. కళ్యాణి రాగంలో రూపొంది, మోహనం, హిందోళం , దర్బారీల రాగమాలికలో ‘ఎల్లం ఇంబమయం’ అనే గీతాన్ని పి.లీలతో కలిసి పాడగా పద్మిని, లలితలపై చిత్రీకరించారు. ఆ పాటలోని మోహన రాగ విన్యాసం ఒక్కటి చాలు ఆమె గాన కౌశల్యానికి. అదే చిత్రంలో ‘చిన్నంచిరు కిలియే’ అనే మరో పాట ఉంది. తన శాస్త్రీయ సంగీత కచేరీల చివరలో పాడే ‘తుక్కడా’ల (చిన్నపాటి వినోదభరితమైన పాటల) జాబితాలో ఆమె చాలా కాలం పాటు ఈ పాటను పాడేది. నేడు వాయిద్య విద్వాంసులు కూడా తమ ప్రదర్శనలలో ఈ పాటను పాడుతున్నారు.

ఆ తర్వాత ఎం.ఎల్‌.వి, కమల, పద్మినిల చిత్రాల కోసం ముఖ్యంగా నృత్య సన్నివేశాల కోసం ఎక్కువ పాటలు పాడింది. ‘పార్తిబన్ కనవు’ చిత్రంలో కమల కోసం మూడు పాటలు పడటం గమనార్హం. రాజా దేశింగు (60) చిత్రం విడుదలైన తర్వాత రాగమాలికలో ‘పర్కడల్ అలైమాలే’ కంపోజ్ చేసి ప్రత్యేకంగా పద్మినిపై చిత్రీకరించారు. ఈ పాట కూడా చాలా భరతనాట్య ప్రదర్శనలలో భాగంగా మారింది. ‘తాయుళ్ళం’ (52) చిత్రంలోని ‘కొంజమ్ పురవే’ పాట హిందీ పాట ‘ఠండీ హవాయెన్’ ఆధారంగా స్వరపరచబడింది. ‘ఓర్ ఇరవు’ (51)లో లక్ష్మీకాంతంపై చిత్రీకరించిన ‘అయ్య సామి’ పాట, ‘సమాధి’ చిత్రంలోని ‘గోరే గోరే’ ( సి.రామచంద్ర) ఆధారంగా తయారైంది. ఇక కళ్యాణి రాగంలో ఆమె పాడిన ప్రతి సినిమా పాటా గొప్పదే.
ఎం.ఎల్‌.వి తెలుగు, మలయాళం, కొన్ని కన్నడ ప్రాంతీయ చిత్రాలలో కూడా పాటలు పాడింది. ‘మనమగళ్’కి తెలుగు రీమేక్ ‘పెళ్లి కూతురు’లో, సి.ఆర్.సుబ్బరామన్‌తో కలిసి ఆమె పాడిన ‘వీరజాజులు వలపే’ అనే యుగళగీతం అద్భుతంగా ఉంటుంది. తెలుగు భూకైలాస్‌‌లో ఆమె పాడిన ‘‘మున్నిట పవళించు నాగశయనా’’ పాట చాలా పాపులర్. ఇంకా ‘మాయా బజార్‌, జయభేరి’ చిత్రాలలో పాడింది. ఆమె చివరిగా కన్నడ చిత్రం హంస గీతేలో దర్బారీ కానడ రాగంలో ‘నిందతి చందన’ పాట పాడింది. సినిమా గానానికి దోషరహితమైన ఉచ్చారణ అవసరం. సినిమాల కోసం ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఎం.ఎల్.వి. కర్ణాటక సంగీతాన్ని ఉచ్చరించే విధానం మెరుగ్గా ఉండేదని చాలామంది అంటారు. సినిమాలలోనైనా, సాంప్రదాయ కర్ణాటక సంగీతంలోనైనా ఈ లయే ఎం.ఎల్.వీని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది.
వసంతకుమారి ఎక్కువగా ఏ.ఎం. రాజా, ఎం.కె. త్యాగరాజ భాగవతార్, టి.ఆర్. మహాలింగం, ఘంటసాల, జి.కె. వెంకటేష్, పి.బి. శ్రీనివాస్, యేసుదాస్ వంటి గాయకులతో యుగళగీతాలు పాడింది. పి.లీల, ఎ.పి. కోమల, సూలమంగళం రాజలక్ష్మి, జిక్కి, రాధా జయలక్ష్మి, పెరియనాయకి, భానుమతి వంటి గాయనులతో కలిసి పాడింది. అలాగే సి.ఆర్. సుబ్బరామన్, ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు, కె.వి.మహదేవన్, నాగయ్య, పెండ్యాల, టి. చలపతిరావు, విశ్వనాథన్- రామమూర్తి, ఎస్.రాజేశ్వరరావు, ఆర్. సుదర్శనం – గోవర్ధనం, శంకర్-జైకిషన్, దక్షిణామూర్తిల సంగీతంలో పాడింది.

ఆమె కూతురు శ్రీవిద్య తెలుగు, తమిళ సినిమాలలో నాయికగా తళుక్కు మన్నది. భర్త కృష్ణమూర్తి సినీరంగంలో నిర్మాతగా విజయవంతం అయ్యాడు. అయితే తన సంగీత కచేరీలు, ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించే తల్లి లలితాంగి అకస్మాత్తుగా మరణించటంతో బాధ్యతలన్నీ తానే చూసుకోవలసి వచ్చింది. ఆమెకు నిర్వహణా సామర్థ్యం అంతగా లేదు. పారితోషకాలను ఎలా నిర్ణయించాలో ఆమెకు తెలిసేది కాదు. ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేది. ఆపదలో ఉన్నవారు అడిగితే లేదు అనకుండా ఇచ్చేమనస్తత్వం ఆమెను పేదరికంలోకి నెట్టివేసింది. కచేరిలు చేస్తున్నా, డబ్బులు వస్తున్నా అవి ఎటు పోతున్నాయో తనకు తెలిసేది కాదు. ఈ పరిస్థితులలో ఆమె 1960లో అడయారులో ఉన్న తన ఇల్లును అమ్ముకుంది.
సినీరంగంలో ఉన్నప్పటికీ ఆ రంగం మీద ఆమెకు సదభిప్రాయం లేదు. మరోవైపు శ్రీవిద్య సినిమా రంగాన్ని ఎంచుకోవడం, ప్రేమ వివాహం చేసుకొని దూరం కావడం వెనువెంటనే జరిగిపోయాయి. అయితే శ్రీవిద్య వివాహం విఫలమై తిరిగి తల్లి చెంతకు చేరడం ఆమెకు మరింత బాధ కలిగించింది. ఆ ప్రభావం ఆమె గొంతు మీద పడింది. ఇంతకు ముందులా కచేరీలలో పాడి మెప్పించేందుకు గొంతు సహకరించలేదు. ఈ సమయంలో ఆమెని సంగీత టీచర్‌గా తత్వవేత్త ‘జిడ్డు కృష్ణమూర్తి’ మదనపల్లిలో తన ‘రిషీవ్యాలి’ స్కూల్‌కి ఆహ్వానించాడు. అది మొదలు 20 సంవత్సరాల పాటు తెలుగు నేలపై ఆమె సంగీత బోధన చేసింది. రిషివ్యాలీలో పదవీ విరమణ చేసి తిరిగి మద్రాసు చేరిన ఎమ్.ఎల్. వసంతకుమారికి వెన్ను నొప్పి వచ్చింది. వైద్యులు అది ‘డిస్క్’ సమస్యగా తేల్చి ఆసుపత్రిలో చేర్చారు.

అప్పటికి ప్రతి ఏటా క్రిస్మస్ నాడు మద్రాసు కృష్ణ గానసభలో ఎమ్.ఎల్. కచేరీ చేయటం ఆనవాయితీ. 1988లో ఆమె అనారోగ్యం గురించి తెలియని ఎమ్.ఎల్.వి. అభిమానులు కచేరీకోసం హాలునిండా కూర్చుని ఎదురుచూస్తున్నారు. కచేరికి 10 నిమిషాల ముందు ఆసుపత్రి నుండి అంబులెన్స్‌లో వచ్చి వేదిక దగ్గరకు వచ్చిన ఎమ్.ఎల్.వి. ఓపిక కూడగట్టుకుని కచేరీ చేసి అందరికి కంటనీరు తెప్పించి. వారి కరతాళ ధ్వనుల మధ్యే భారంగా లేచి వెళ్ళి అంబులెన్స్‌లో పడుకుని ఆసుపత్రికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో కూతురు శ్రీవిద్య అనారోగ్యంతో వున్న తల్లి దగ్గరికి వచ్చింది. కానీ అప్పటికే తల్లీకూతుళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారు. ఇంతలో ఎమ్.ఎల్.వీది వెన్నునొప్పి కాదనీ ఆమె శరీరంలోని ‘క్యాన్సర్’ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించటంవల్ల కలిగిన ఇబ్బంది అని వైద్యులు గుర్తించారు. దాంతో ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండాల్సివచ్చింది. అక్కడి వైద్యుడు ఆమె అభిమాని కావటంతో ఆసుపత్రి బిల్లు తానే చెల్లించాడు. అభిమానులు ఆసుపత్రికి వచ్చి ఆమెకు వంతులు వారీగా సేవలు చేశారు. 1988 అక్టోబర్ 31న ఆమె తన స్వరయాత్రను ముగించింది.
‘సంగీతమొక్కటే సర్వమానవ సామాన్య భాష’ అన్న ఖలీల్ జీబ్రాన్ మాటలను అక్షర సత్యాలు చేసి సంగీతాన్ని పండిత పామరులకు చేరువ చేసిన ఎం.ఎల్‌.వి జీవితకాలం కర్ణాటక సంగీత ప్రపంచంలో వసంతం వెల్లివిరిసిన మహత్తర శకం అంటే అతిశయం కాదు.

హెచ్‌.రమేష్‌‌బాబు,
93916 34727

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -