Sunday, September 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్ఎస్ఎస్ డైరెక్షన్ తోనే అంబేద్కర్ పై ముప్పేట దాడి

ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ తోనే అంబేద్కర్ పై ముప్పేట దాడి

- Advertisement -

మనువాద ప్రమాదాన్ని ఐక్యంగా ప్రతిఘటించాలి : టీ స్కైలాబ్ బాబు, ఆర్ వెంకట్రాములు
అట్టడుగు పేదల ఐక్యతకు బీజేపీనే ఆటంకం : వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ ‌బీఆర్ అంబేద్కర్ పై ఆర్ ఎస్ ఎస్ డైరెక్షన్, బీజేపీ ప్రోద్బలంతో జరుగుతున్న ముప్పేట దాడి, విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానిస్తే సహించేది లేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదనీ, కోట్లాది మంది అణగారిన ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం అందించిన మహనీయుడని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన చారిత్రక పాత్రను వక్రీకరించి, ఆయనను కల్పిత నాయకుడిగా చిత్రీకరించడం రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు. కుల వివక్ష, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా అంబేద్కర్ సాగించిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పేదల ఐక్యతకు బీజేపీనే ప్రధాన ఆటంకంగా నిలుస్తుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జన్‌‌జీ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు ఒకవైపు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఫొటోలు చేత పట్టుకొని ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా యువతరం అంబేద్కర్ ప్రేరణగా సాగుతున్న ఉద్యమాలను అట్టడుగు పేదలను అణిచివేయడానికి బీజేపీ ప్రోత్బలంతో జరుగుతున్న కుట్రలు తిప్పి కొట్టాలన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, ఆర్‌ ‌వెంకట్రాములు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలాన్ని తిప్పికొట్టాలన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా, కుల వివక్షను సమర్థించే మనువాద భావజాలాన్ని ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. రాజ్యాంగం రద్దు చేయాలని రిజర్వేషన్ హఠావో అంబేద్కర్ కల్పిత నాయకుడు అంటూ ముప్పేట దాడి ప్రారంభించి అట్టడుగు వర్గాల రోల్ మోడల్ గా ఉన్న అంబేద్కర్ పై విష ప్రచారం ప్రారంభించారని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం కల్పించిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రాలు, రాజ్యాంగ ప్రతుల అవమానానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అంబేద్కర్ జీవితం, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటా రమేష్ అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రజనీకాంత్ టి నాగరాజు, ఎన్పీఆర్‌‌డీ రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పని పద్మ, ఆర్ ఆంజనేయులు కేవీపీఎస్‌ స్ నగర కార్యదర్శి బి సుబ్బారావు ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -