ఇది గాలి వాటంగా
వచ్చిన గెలుపు కాదు
అధికార దుర్వినియోగంతో
అర్థబలం అంగబలంతో
సాధించింది కానే కాదు
సమ్మిళిత సంస్కృతిపై
విభజన భావజాలంతో
పాలకవర్గం ప్రత్యర్ధులపై చేసిన
దాడులపై దమన కాండపై
కన్నడిగులు ఇచ్చిన
చారిత్రాత్మక తీర్పు
మతాన్ని రాజకీయాల్లోకి లాగి
వివాదాస్పద అంశాలతో
మతోన్మాద ప్రసంగాలతో
భావోద్వేగాల రెచ్చగొట్టి
మెజారిటీ వాదంతో
మైనారిటీలను భయపెట్టి
వస్త్రధారణపై ఆహారంపై
జీవన విధానంపై
స్వేచ్ఛ స్వాతంత్య్రాలపై
చేసిన దాడులకు నిరసన ఇది
చరిత్రను
అవమానించి తలకిందుల ఆలోచనలతో
తప్పుదారి పట్టించబూని
మూఢనమ్మకాలను పెంచే
ఆశాస్త్రీయ ఆలోచనలతో
ప్రశ్నించిన మేధావులను
నిర్బంధాలకు గురిచేసి
ప్రభుత్వ రంగ సంస్థలను
నిర్వీర్యం చేస్తూ
దేశ ఆర్థిక స్థితిని దిగజారుస్తూ
రిజర్వేషన్ల రగడ రాజేసి
వైషమ్యాలను రగిలించి
పెరుగుతున్న ధరలను
అదుపు చేయలేక
సామాన్యుని బాధలు పట్టక
నిరుద్యోగాన్ని పేదరికాన్ని
నిర్మూలించే ప్రయత్నం చేయక
ఓట్ల కోసమే రాజకీయాలు చేసే
ప్రజా ప్రయోజనాలను విస్మరించే
పార్టీలకు పాలకులకు
కన్నడిగుల ఆలోచనలు
శాస్త్రీయ దృక్పథం
దేశ పౌరులందరికీ
కలిగించాలి కనువిప్పు
– పి. రామనాధం
9989969331