కదలవేంది!!

కరగలేదా హృదయం
కలత చెందలేదా నీ మనసు
నీ కాళ్ళకి కట్టిన
సంకెళ్ళని ఇకనైనా తెంచు
ఇంకెన్ని దేహాలు నలగాలి
నీలో చలనం రావాలంటే
ఇంకెన్ని పీకలు కోయబడాలి
నీ గొంతు పెకలాలంటే
ఇంకెంతా మంది వివస్త్రలు కావాలి
నువ్వొక అస్త్రంగా మారాలంటే
భరించడమేనా!!
బెదిరించడం రాదా?
కన్నీళ్లు కార్చడమేనా!!
కదం తొక్కడం రాదా?
ఏడవడమేనా!!
ఎదిరించడం రాదా?
విలపించడమేనా!!
రాళ్లు విసరడం రాదా?
నిన్ను కదలకుండా ఆపింది ఏమిటి?
పరువా!! హు !!
దేహం కూడా పూర్తిగా
తయారు కాకముందే
ఎందరి దాహానికో
బలైన భారతికే లేని పరువు
నీకెందుకు అమ్మ!
కొమ్ములొచ్చినవాడు
నచ్చిన భాగాన్ని పీక్కు తింటుంటే
జీవచ్ఛవంలా పడి ఉన్న
మన మాతృదేశానికే లేని పరువు
నీకెందుకు అమ్మ!!
లే! నువ్వు లే! నువ్వే లే !
వేలెత్తి చూపు
గొంతెత్తి అరువు
రాగమెత్తిపాడు
కొడతారా!
నీ పురిటి నొప్పుల కన్నా
ఏ కొరడా దెబ్బలు నిన్ను భయపెట్టేది?
నీ పొత్తి కడుపు నొప్పి కన్నా
ఏ కత్తిపోటు నిన్ను బాధ పెట్టేది
సంపుతారా!!
చావు పుట్టుకలను నిర్ణయించేదే నువ్వు
నీకు చావంటే భయం ఏందీ?
ఇప్పటికైనా కదులు
ఇంకో చెల్లి చావుని కథలుగా చెప్పక ముందే
కదులు, కదులు.
కదల వేంది!!
– కీర్తి ఇనుగుర్తి

Spread the love