కన్నీటిని రాల్చకు

నాకోసం కన్నీటిని రాల్చకండి
వీలైతే
కొన్ని అక్షరాల ఆమ్లాన్ని జల్లండి
దీనంగా చూస్తున్న
ఈ నాలుగు దిక్కులు అంతమవ్వని..

నా మీద జాలి చూపకండి
కొన్ని
పల్లేరు కాయల్ని నాటండి
రెపొద్దున ఆ దారి గుండా నడిచే
మత రాజకీయాల కాళ్ళను చీల్చని..

నాపై అమాయక స్త్రీ అని
ముద్ర వేయకండి
ఈ నీచ సంస్కతి, సంప్రదాయాలను
బోధించిన
మత గ్రంథాల, కుల గొంతుకలకు
నిప్పేట్టండి
కాలి బూడిదవ్వని..

నన్ను ఇలానే నడిపించండి
కశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాక
21 వ శతాబ్దపు దేశ నగ చరిత్రను
పుటలుపుటలుగా చదివి
కాండ్రించి ఉమ్మనివ్వని..

నా తరపున
న్యాయ దేవతతో మాట్లాడండి
క్రూరత్వం, అనాగరికం, వివక్ష వైపు
గుడ్డిగా వుండొద్దని
కళ్లకున్న గంతలు విప్పండని
ఈ నగ దేహం మీది గాట్లను చూడండని..

నాకోసం మరో చిప్కో ఉద్యమానికి
ఊపిరి పోయండి
పచ్చని చెట్లలాంటి మమ్ము హత్తుకోండి
ఏ కాషాయ వస్త్రం కప్పకండని
ఏ కాషాయ సారం గుప్పించొద్దని…
– మహేష్‌ వేల్పుల

Spread the love