ఒంటరి నక్షత్రం

ఒక్కోసారి నాకు నేనే ఉంటా
ఒంటరి నక్షత్రం లా
చుట్టు వెలుగు ఇచ్చే ఏ వెన్నెల
కనపడదు.

నిశ్శబ్ద దారులలో నడుస్తూ
కాలం వైపు పరుగులు
పెడుతుంటా.

కాని ఆ కాలం నాకంటే ఓ
మెట్టు ముందుగానే ఉంటాది.

కొన్ని గులక రాళ్ళ సమూహాన్ని
నా మనసుపై విసిరి
వెళ్ళిపోతుంటారు మీరంతా.

ఆ తర్వాత గాయాల్ని ఎవ్వరు
పట్టించుకోరు.

కటువుగా మీతో
మాట్లాడలేను నేను.
నవ్వుతూనే నా నాలుకను
నోట్లోకి మడుచుకొని నాకు
నేనే నొప్పి పెట్టుకుంటాను.

అప్పటికి ఆగని నా కొండనాలుక
గొంతుని మందలిస్తుంది
కాబోలు గంభీరమైన దుఃఖం
కళ్ళలో తేలుతుంది.

యం. అనాంబిక

Spread the love