మస్త్ మాస్ట కిక్ ఇచ్చే మస్తీ గోలీ సోడా

మార్కెట్లోకి ఎన్ని కూల్‌ డ్రింక్స్‌ వచ్చినా గోలీసోడా తాగితే వచ్చే కిక్కే వేరు.. మేడిన్‌ లోకల్‌ బ్రాండ్‌ అయిన గోలీసోడాలకు మంచి డిమాండ్‌ ఉండేది. కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు.. పొట్టషేర్లు పట్టేసినట్లు.. అన్నం అరగనట్టు.. తేన్పు రాలేనట్టు.. ఇలా ఏ ఫీలింగ్‌ అనిపించినా ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నంటికీ సమాధానం చెప్పేది! ఇప్పుడా గోళీ సోడా ఖాళీ అయ్యింది. వేసవికాలం వచ్చిందంటే చాలు తోపుడు బండ్లలో పెట్టి గల్లీగల్లీ తిరుగుతూ సోడాలు అమ్మేవారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సోడాలు తాగి వేసవి తాపాన్ని తగ్గించుకున్నాం అంటూ సేదతీరేవారు. జాతర్లు, వేడుకల్లో అయితే వీటికి ఫుల్‌ డిమాండ్‌ ఉండేది. తెలుగు సినిమాల్లోనూ గోలీసోడాల మీద డైలాగ్‌లు, ఫైట్లు పుష్కలం. అలాగే ఒంటిచేత్తో సోడా కొట్టడాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని యూత్‌ పోటీపడేవారు. అప్పట్లో ఇవి అంత ఫేమస్‌ మరీ. కానీ, ప్రస్తుతం కార్పొరేట్‌ కూల్‌ డ్రింక్స్‌ ముందు గల్లీ గోలీసోడా చినబోయింది. అడపాదడపా ఎక్కడో ఒకచోట మాత్రమే ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోజుకో రకం సోడా మెషీన్లు అందుబాటులోకి రావడంతో గోళీ సోడాలు కనుమరుగయ్యాయి. కానీ, అదే సోడా కొత్తదనంతో పునర్దర్శమిచ్చింది! దాహం తీర్చు కునేందుకు కొన్ని పట్టణాల్లో స్థానికంగా దొరికే వివిధ ఫ్లేవర్ల గోలీ సోడా యువతకు క్రేజీగా మారింది. దీన్ని గమనించే కరీంనగర్‌ కుర్రాడు తుల రఘునాథ్‌ గోలీ సోడా తయారుచేస్తూ తెలంగాణ వ్యాప్తంగా తనదైనా ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఎంతో మంది స్థానికులకు ఉపాధి మార్గమైనాడు.
v   కరీంనగర్లోని ఆరెపల్లి గ్రామానికి చెందిన కార్పొరేటర్‌ తులు రాజేశ్వరి, బాలయ్య కుమారుడు తుల రఘునాథ్‌ ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్‌ లో రాణించాలనుకున్నాడు. కానీ ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొద్దినెలల పాటు ఉద్యోగం చేశాడు. అక్కడ ఒక్కరి కనుసన్నల్లో పని చేయడం కష్టంగా అనిపించింది. ఆ బాబ్‌ వర్క్‌ లో భాగంగానే ఒకసారి కోయంబత్తూరు వెళ్లినప్పుడు దాహంగా ఉందని రోడ్డు పక్కన దుకాణానికి వెళ్లి సోడా తాగాడు. ఆ గోలీ సోడా అతడిని ఆకర్షించింది. ఆ క్షణమే గోలీ సోడా ఫ్యాక్టరీని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. తిరిగి రాగానే సోడా తయారీకి సంబంధించిన అన్ని విషయాలను ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తన దష్టంతా సోడా తయారీపైనే పెట్టాడు. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఏమిటంటే… ఉద్యోగానికి రాజీనామా చేయడం. అంతకంటే ముందు తల్లిదండ్రులతో చర్చించాడు. వాళ్లు కుమారుడికి సపోర్టు చేశారు.
ఉద్యోగం వదిలేసి.. ఉపాధి కల్పిస్తూ..
నెలకు రూ.70 వేల శాలరీ వచ్చే సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం మానేశాడు. ఫ్యాక్టరీ పెట్టాలని నిశ్చయించుకున్నాడు. కానీ, బంధువులు,మిత్రులు సహజంగానే ‘రిస్క్‌ చేయడం. అవసరమా?’ అనే అన్నారు. కానీ తల్లిదండ్రులను ఒప్పించి, కరీంనగర్‌ కు మకాం మార్చాడు. 3.5 కోట్ల రూపాయలతో రేకుర్తిలోని 16 గుంటలు స్థలంలో ‘మస్తీ’ అనే పేరుతో గోలీ సోడా ఫ్యాక్టరీని డిసెంబర్‌ 2020లో ప్రారంభించాడు. ‘మస్తే సోడా’ పేరుతో నాలుగు రకాల ప్లేవర్స్‌ తో గోలీ సోడాను మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు.
సొంతగా మార్కెటింగ్‌….
ఎంబీఏ చదివిన అనుభవంతో రఘనాథ్‌ కరీంనగర్‌ జిల్లాలో తనదైన శైలిలో మార్కెటింగ్‌ చేశాడు. దాంతో మస్తీ గోలీసోడా ప్రజలకు చేరువైంది. లెమన్‌, ఆరెంజ్‌, జింజర్‌, బ్లూబెర్రీ, ఫ్లేవర్స తో 200 మిల్లీలీటర్ల గ్లాస్‌ బాటిల్స్‌, 250 మిల్లీలీటర్ల ప్లాస్టిక్‌ బాటిల్స్‌ తయారు చేస్తున్న మస్తీ గోలీ సోడాకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఒక్కో సోడా బాటిల్‌ ను 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. మస్తీ గోలీ సోడాను ఫ్యాక్టరీలో తయారు చేసి కిరాణా దుకాణాలు, బేకరీలు, టీస్టాల్స్‌, హౌటల్స్‌ వంటి చిన్న చిన్న దుకాణాలకు సైతం చేరవేశారు. ఈ సోడాలు నాణ్యతతో, వివిధ ఫ్లేవర్లతో కూల్డ్రింకులకు. పోటీగా నిలిచి యువత మనసు గెలుచుకుంటున్నాయి. దాంతో ఈ ఏడాది డిమాండ్‌ బాగా పెరిగింది. మస్తీ గోలీ సోడా గురించి చుట్టు పక్కల జిల్లాలకు కూడా తెలిసింది. దాంతో మార్కెట్‌ విస్తరించాడు రఘునాథ్‌. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతోపాటు ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నాడు. ప్రతిరోజు ఐదు వేలకు పైగా మస్తీ సోడాలు తయారుచేసి విక్రయిస్తున్నారంటే వీటికున్న క్రేజ్‌ ను అర్థం చేసుకోవచ్చు.
రంగు రంగుల సోడాలు..
గోలీసోడా ఒక్కటే అయినా.. అందులో ఉండే ఫ్లేవర్లు అనేకంగా ఉండేవి. రకరకాల రంగుల్లో, రుచుల్లో లభించేవి. పిల్లలైతే స్వీట్‌ సోడా, ఆరెంజ్‌ ఫ్లేవర్స్‌ బాగా ఇష్టపడేవారు. ఇక పెద్దలు ఎక్కువగా మసాలా సోడకు మొగ్గుచూపేవారు. కాస్త ఆయాసంగా ఉన్నా.. అరుగుదల లేదని అనిపించినా లెమన్‌ సోడా ఎక్కడుందా అని వెతుక్కునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఈ సోడాల్లో కూడా చాలా రకాల ఫ్లేవర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్లెయిన్‌ సోడా, ఆరెంజ్‌ సోడా, గ్రేప్స్‌ సోడా, కలర్‌ సోడా, లెమన్‌, లెమన్‌ స్వీట్‌, మసాలా, మసాలా సాల్ట్‌, సుగంధీ సోడా, స్ట్రా బెర్రీ, అంజీర్‌, ఫ్రూట్‌ సోడా అంటూ ఎన్నో ఫ్లేవర్స్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
గోలీసోడా ప్రత్యేకమే..
గోలీసోడా అంటేనే అదో స్పెషల్‌. చిన్నపాటి సీసాలో సోడాను నింపి అందులోని గ్యాస్‌ బయటకు లీక్‌ అవకుండా చిన్నపిల్లలు ఆడుకునే గోలీని అడ్డంగా ఉండేలా ఏర్పాటు చేస్తారు. అందులో నీరు, గ్యాస్‌ నింపగానే అది రంధ్రానికి అడ్డుగా వచ్చి ఆగుతుంది. దాంతో సోడా బయటకు వెల్లదు. వేలితో ఆగోలీని అడ్డుతొలగిస్తే ఒకరకమైన శబ్దంతో కొద్దిపాటి గ్యాస్‌ బయటకు వచ్చి తాగేందుకు వీలు ఏర్పడుతుంది. దాన్ని కూడా ఎంత త్వరగా తాగితే అంత బాగుంటుందని చెబుతారు గోలీసోడా ప్రియులు.
– జోష్‌ టీం
ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పడంతో స్థానికులకు ఉపాధి లభిస్తోంది. మస్తీ గోలి సోడాను నాణ్యతా ప్రమాణాలతో రుచి, శుచిగా తయారు చేస్తున్నాను. ప్రస్తుతం సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం కంటే ఎక్కువగానే ఆదాయం వస్తోంది. రానున్న కాలంలో మరిన్ని ఫ్లేవర్స్‌ తో మరింతగా విస్తరించేందుకు కషి చేస్తా. ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉద్యోగాల కోసం కషి చేయడం తప్పుకాదు. కానీ ఉద్యోగాలు రాని వారు నిరాశకు లోనుకాకుండా మనకు నచ్చిన వాటిలో స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి. కొత్తరకం ఆలోచనలకు చిత్తశుద్ధిని జోడిస్తే తప్పకుండా విజయం దక్కుతుంది. రానున్న కాలంలో తన గోలీ ‘సోడాను మరిన్ని జిల్లాలకు, వీలైతే రాష్ట్రాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
– తుల రఘునాథ్‌

Spread the love