మనసులోని భావాలు

ప్రియమైన మాధవికి,
నీ వాట్సాప్‌ మెసేజ్‌ చూసి కొంచం ఆశ్చర్య పోయాను. ”చిన్న చిన్న మెసేజ్‌లతో విసిగిపోయాను. కొంచం ఎక్కువ విషయాలతో ఉత్తరం రాయండి” అన్నావు. ఈ రోజుల్లో ఇంకా ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. డెలివరీ అయ్యేదాకా మనకి ఇంకా అయిదారు నెలలు విరహం తప్పదు కనుక ఉత్తరాలు మంచి ఆలోచనే కదా! ఈ స్మార్ట్‌ ఫోన్‌ కల్చర్‌ వచ్చిన తరువాత, మనసులోని భావాలు వివరంగా చెప్పుకునే అవకాశం మిస్‌ అవుతున్నామేమో! ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నీతో పరిచయానికి ముందు, దూరంగా ఉండడం వల్ల, అమ్మ, నాన్న అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి, వాళ్ళ మీదికి ఆలోచనలు పోయేవి. కానీ, నీతో పరిచయం ప్రారంభమయ్యాక, ప్రతి క్షణం నీ ఆలోచనలే. ఒక వ్యక్తి సహచర్యంలో ఇంత మాధుర్యం ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. ప్రేమికులు అందరూ రుణపడి ఉండాలేమో. ఏ పని చేస్తున్నా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావన్న ఆలోచనే.. మనిషి ఎదురుగా ఉన్నా చెప్పలేని కొన్ని భావాలు ఉత్తరాల ద్వారానే సాధ్యం అవుతుందేమో కదా? నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు చెప్పని విషయాలు ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. నువ్వు ఎదురుగా ఉంటే చేతలే కానీ మాటలు కష్టం కదా? పెద్ద ఉత్తరం రాయమన్నావు కాబట్టి, ఎప్పటినుంచో నీకు చెబుదామనుకున్న అనేక విషయాలు ఇప్పుడు చెబుతాను. మన పెళ్లి అయిన తరువాత, మనం మొదటిసారి కలవడం గురించి మాట్లాడుకున్నాం. గుర్తు ఉందా ? అప్పుడు చెప్పలేని ఎన్నో విషయాలు ఇప్పుడు చెబుతాను. నేను మీ కాలేజీకి గెస్ట్‌ లెక్చరర్‌ ఇవ్వడానికి వచ్చినపుడే నువ్వు నన్ను మొదటిసారి చూశావు. కానీ నేను నిన్ను అంతకు ముందే చూశాను. యూనివర్సిటీలో నా కొలీగ్‌ నారాయణ, నేను, ఒకసారి మీ కాలేజ్‌ ఇంగ్లీష్‌ లెక్చరర్‌ మధుసూదన్‌ను కలవడానికి మీ స్టాఫ్‌ రూమ్‌ కి వచ్చాం. మేము అతనితో మాట్లాడుతూ ఉండగా నువ్వూ, నీ క్లాస్‌మేట్‌ జలజ మధుసూదన్‌ని కలవడానికి వచ్చారు. ఆమె చాలా అందంగా ఉందన్న విషయం గుర్తించినా, నాకు వెంటనే చిరాకు కలిగింది. ఆమె తన అందాన్ని అందరూ చూస్తున్నారా లేదా అనే భావన, బాడీ లాంగ్వేజ్‌లోనూ, చూపులలోనూ స్పష్ట పరచడం నాకు నచ్చలేదు. దీంతో నా చూపు పక్కన ఉన్న నీపై పడింది. ఎర్రటి గులాబీ పక్కన, బుట్ట సంపెంగ సువాసనలా అనిపించావు. బెదురు చూపులు చూస్తున్న నువ్వూ, నీ సహజమైన ముగ్ధత్వం నన్ను వెంటనే ఆకట్టుకున్నాయి. ఆ వేళ నువ్వు లేత ఆకుపచ్చ రంగు వోణీ వేసుకున్నావు. చిన్న గులాబీ, జడలో ఓ పక్కన పెట్టుకున్నావు. జలజ మధుసూదన్‌తో ఏదో మాట్లాడిన తర్వాత మీరు ఇద్దరూ వెళ్లిపోయారు. మరి కొన్ని విషయాలు మరో ఉత్తరంలో రాస్తాను. అన్ని విషయాలు ఇప్పుడే చెప్పేస్తే ఎలా? అందుకే మరి కొన్ని ముచ్చట్లతో మరో లేఖతో కలుస్తా.. నీ ఆరోగ్యం జాగ్రత్త.
నా మాధవికి బోలేడు ముద్దులతో…
నీ
రాజశేఖర్‌

Spread the love