వర్షపు చినుకై తాకి పో ??

కాశ్మీరు అందాలన్నీ కండ్లల్లో పెట్టుకొని
సీమ్లా సొగసులన్నీ చెక్కిల్ల పై అద్దుకొని
నయాగార వంపులన్నీ నడుములో ఒంపుకొని
కొప్పులో సన్నజాజి మల్లెలను తురుముకొని
నల్లని త్రాసు లాంటి పొడవైన వాల్జడతో
పట్టు పరికిణిలో ఏంజెల్‌ లా ఎదురొచ్చి
నా మనసునంతా పొక్కిలి చేసింది

తన చురుకైన చూపులను విసిరేసి
నా కాళ్ళను కదలకుండా ఖైదీలను చేసింది
తన పలచని చిరనవ్వులను నా వైపు రువ్వి
నా కనురెప్పలకు సంకెళ్ళను వేసింది
మా రెండు పెదవులు కదలకుండానే
మనసులు రెండు మౌనంగా మాట్లాడుకున్నాయి
చూపులు రెండు కలిసిపోయిఊసులాడుకున్నాయి

కాలమెంత కఠినమైనదో కనికరం లేకుండా
మధుర క్షణాలకు ఇనుప తెర వేసింది
నిండు జాబిలికి మబ్బులడ్డం వచ్చినట్లు
మా ఇద్దరి మధ్య జన కడలి అడ్డొచ్చి
కవ్వించిన నెరజాణ కనుమరుగైంది
కలల పుప్పొడిని వెదజల్లిన కన్యకోసం
అవనిపై నేను బొంగరంలా తిరుగుతున్నాను

మనసు గది తలుపులను తెరుచుకొని స్వప్నాల
కుసుమాలను పరుచుకున్నాను
ఆశల అగరవత్తులను వెలిగించుకొని
ఊహల వంతెన పై నడుస్తున్నాను
మదినిండా ఉప్పెనలా ఉప్పొంగిన భావాలను
కమ్మనైన కవితలుగా రాస్తున్నాను
అందమైన గుర్తులను నెమరేసుకుంటూ
అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని లిఖిస్తున్నాను

నైరాష్యపు ఉక్కపోతలో నేనుంటే
చిరు గాలిలా వచ్చి పలకరించు
ఊపిరాడని బతుకులో నేనుంటే
ప్రాణవాయువు లా వచ్చి శ్వాసించు
ఎండిన ఎడారి లా నేనుంటే
నువ్వు వర్షపు చినుకై తాకిపో

– తాటిపాముల రమేశ్‌ (తార)
శివనగర్‌, వరంగల్‌
7981566031

Spread the love