అడవికి అక్షరాలు నేర్పుతున్న యువకులు

అదొక అడవి. మధ్యలో చిన్న చిన్న గూడేలు. ఒక తొవ్వ ఉండదు.. తోడు ఉండదు. యేండ్ల తరబడి అవే కష్టాలు.. అవే వెతలు. చిరిగిపోయిన బట్టలు.. చింపిరి జుట్లు.. ఆ చిన్నారి పిల్లలకు గుడుంబా తాగించి పనులకు పోయే పెద్దలు..
    చదువంటే ఏమిటో కూడా తెలియదు. అలాంటి అడవి బిడ్డల జీవితాల్లో అక్షర కాంతులు నింపుతున్నారు కొందరు యువకులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ తొమ్మిది గ్రామాలను నేడు ప్రపంచం గమనిస్తున్నది. ఏండ్ల తరబడి చదువుకు దూరంగా ఉన్న ఆ పల్లెలు ఇప్పుడు విద్యా పరిమళాలు వెదజల్లుతున్నాయి. చదువంటే అవగాహన కల్పిస్తూ ఇప్పపూల వనాలను విద్యా వనాలుగా మారుస్తున్నారు ఈ యువకులు.

విద్యతోనే జీవితాల్లో మార్పు
విద్యతోనే జీవితాలు మారతాయి. ఎక్కడో అడవిలో ఉండే గూడేల్లో చదువు ఇప్పటికీ అందని ద్రాక్షే. మాలా ఇబ్బందులు పడకూడదని, ఆదివాసీ గొత్తికోయ పిల్లలకు గూడేల్లో విద్య నేర్పించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం. తొలుత ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలోని గొత్తికోయగూడేల్ని సందర్శించి అధ్యయనం చేశాం. మొదట్లో ఒకటి, రెండు పాఠశాలలను నడిపించాం. ప్రస్తుతం తొమ్మిది గూడేల్లో నడుపుతున్నాం. మారుతున్న సమాజంలో పోటీ ఇవ్వాలంటే చదువుతోనే సాధ్యమతుంది. టీచర్ల బౄందం సమన్వయంతో పాఠశాలలను నడిపిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని పాఠశాలలతో మరింత మంది గొత్తికోయ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం.
కరోనా కాలంలో ఎలా?
కరోనా వల్ల లాక్‌డౌన్‌విధించింది ప్రభుత్వం. మరి అలాంటి టైంలో స్కూల్‌ నడిపితే కరోనా సోకే ప్రమాదం ఉండదా? అని చాలామందికి అనుమానాలు వచ్చాయి. అవి కేవలం అనుమానాలుగానే మిగిలిపోయాయి. కానీ, ఈ స్కూల్‌ వల్ల కరోనా వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ స్కూల్‌లోకి బయటి వాళ్లకు అనుమతి ఉండదు. ఆ ఊళ్లో, ఆ పిల్లలతో కలిసి ఉండే వలంటీర్‌మాత్రమే స్కూల్‌కి వెళ్తారు. ఇక సంతోష్‌ టీం అక్కడికి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్లు కట్టుకుని, ఫిజికల్‌ డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చేస్తూ పిల్లలతో మాట్లాడేవారు. అడవి మీద ఆధారపడి, వాళ్లకు కావాల్సిన తిండి వాళ్లే సంపాదించుకుంటారు. ఎవరి దగ్గరైనా తిండి లేకపోతే, ఉన్నవాళ్లు పెడతారు. ప్రపంచమంతా కరోనాకు భయపడి బడి బంద్‌ పెడితే.. ఈ అడవిలో అప్పుడే అక్షరం పురుడుపోసుకుంది.
ములుగు జిల్లాలోని అడవుల్లో ఒక చిన్న గ్రామం నీలంతోగు. పిల్లా జెల్లా కలిసి ఊళ్లో 150 మంది దాకా ఉంటారు. ఊరికి ఇప్పటి వరకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. సన్నటి పిల్లదారి గుండా నడుస్తూ వెళ్లాలి. గంట సేపు వర్షం కురిస్తే చాలు వాగు పొంగుతుంది. నడుములోతు నీటిలో నడుస్తూ వాగు దాటాలి. సరుకులు కొనాలన్నా, చదువుకోవాలన్నా ఆ ఊరు దాటాల్సిందే. ఊరు దాటాలంటే వాగు దాటాలి. అందుకే వాళ్ల కష్టాలు తీరాలని, తరువాతి తరమైనా మారాలనే తపనతో అక్కడ ‘భీమ్‌ హ్యాపీనెస్‌ సెంటర్‌’ పేరుతో ఒక బడి మొదలుపెట్టాడు ఇస్రం సంతోష్‌. ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేసి, ప్రస్తుతం జర్నలిజంలో పిజి చూస్తున్నాడు. సొంతూరు ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌. టైం దొరికినప్పుడల్లా గిరిజనులు ఉండే ప్రాంతాలకు వెళ్లి, వాళ్ల జీవన విధానంపై అధ్యయనం చేశాడు. ఫొటోలు తీయడం అతని హాబీ. అందుకు తన చూట్టూ ఉన్న ఈ ప్రాంతాలన్ని తిరిగేవాడు. వేరు వేరు ప్రాంతాల్లోని గిరిజన పిల్లల వేష, భాషలో మార్పులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు చాలా వెనుకబడినట్టు అనిపించింది. దానికి కారణం.. చదువు లేకపోవడమే అని అర్థమైంది. ఈ పిల్లలకు చదువు అందేలా తనవంతుగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు సంతోష్‌.
2000 సం.లో వరదలు
2000సం.లో వచ్చిన వరదలు వారి బతుకులను చిందరవందర చేశాయి. ఆ సమయంలో మా ఊళ్లన్ని కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. దీంతో అందరూ అడవిలో చెట్లు కొట్టుకొని ఆ అడవిలోనే ఇండ్లు కట్టుకున్నారు. అప్పటి నుంచి అదే వారి నివాసమైంది. అలా అడవుల్లోనే చిన్న చిన్న పల్లెలు వెలిశాయి. అలా ఊరికి దూరమై అడవికి దగ్గరైన వాళ్ల జీవితాలు ఏండ్లు గడుస్తున్నా ఏలాంటి పురోగతి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ, వీరి గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. చిన్నప్పటి నుంచే గిరిజనుల జీవితాలను అధ్యయనం చేయాలన్న ఆసక్తితో సంతోష్‌ కెమెరా పట్టుకొని గిరిజన ప్రాంతాలన్నీ తిరిగాడు. ముఖ్యంగా ములుగు జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని గ్రహించాడు. వారి జీవితాలను మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు చదువే మార్గమని గుర్తించి అడుగులు ముందుకు వేశాడు. తన తోపాటు మరో మూడు జతల కాళ్లు అటువైపు నడిచాయి.

నీలంతోగుతో మొదలు..
కరోనా విజృభిస్తున్న సమయంలో ఎలాంటి ముందుచూపు లేకుండా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బడులు మూతపడ్డాయి. దీంతో యూనివర్సిటీ నుంచి ఇంటికెళ్లాడు సంతోష్‌. లాక్‌డౌన్‌.. గిరిజన కుటుంబాలపై చాలా ప్రభావం చూపించింది. చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండటం ఇష్టంలేని సంతోష్‌ .. ఈ సమయాన్ని తన లక్ష్యసాధనకు ఉపయోగించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కరోనాను కూడా లెక్క చేయకుండా (జాగ్రత్తలు పాటిస్తూనే) తన చుట్టుపక్కల గిరిజన గూడెలు తిరిగాడు.
అందులో భాగంగానే నీలంతోగుకు వెళ్లాడు. అక్కడి పరిస్థితులు చూసి కడుపుతర్కుపోయింది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్లంతా చాలా బలహీనంగా ఉన్నారు. ఒక అబ్బాయికైతే కాళ్లు, చేతులు సన్నగా ఉండి, పొట్ట మాత్రం పెద్దగా ఉంది. దానికి సరైన తిండి లేకపోవడం ఒక కారణం అయితే.. ఆ పిల్లలకు ప్రతి రోజూ పనికి పోయే తల్లిదండ్రులే పిల్లలకు గుడుంబా తాపి పనికి పోతారని తెలసుకొని చలించిపోయాడు. అక్కడ పిల్లలంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అక్కడి ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఇప్పటికీ ఆ ఊళ్లో పదో తరగతి వరకు చదివినవాళ్లు ఒక్కరు కూడా లేరు. ఊళ్లో స్కూల్‌ లేదు. పిల్లలకు చదువు లేదు. అందుకే తను అక్కడి పిల్లలకు చదువు చెప్పాలని ఫిక్స్‌ అయ్యాడు. కానీ, అంతకంటే ముందు పిల్లలకు దగ్గర కావాడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే ఊళ్లో 7వ తరగతి వరకు చదువుకున్న పరమేశ్‌ సాయంతో ప్రతిరోజు వాళ్లకు గుడ్లు అందించడం ప్రారంభించాడు. అలా దాదాపు రెండు నెలలు కష్టపడ్డాడు. చిన్నగా తన మీద నమ్మకాన్ని కల్గించుకున్నాడు. పిల్లల నమ్మకాన్ని అయితే పొందాడు కానీ, పెద్దలను ఎలా ఆకట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. వాళ్లతో మాట్లాడితే మాకు ఈ కష్టకాలంలో పనులు లేవు. కనీసం తిన్నడానికి కూరగాయలు కూడా దొరకడం లేదని వాపోయారు. అది ఒక్కడితో అయ్యేపని కాదు. అందుకే అప్పటికే ఎన్జీవోల్లో పని చేస్తూ, గిరిజన పిల్లలకు చదువు చెప్తున్న ఇద్దరు ఫ్రెండ్స్‌ వీరెల్లి శశిధర్‌రెడ్డి, గున్మంతరావు, దుడపాక నరేష్‌ లతో కలిసి బడి మొదలుపెట్టాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి చుట్టు పక్కల ప్రాంతాల్లో గిరిజనులకు నిత్యావసరాలు ఇచ్చేందుకు ఊరూరూ తిరిగారు.
ఐదు కిలోమీటర్లు నడవాలి
స్కూల్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. కానీ, దాన్ని అమల్లో పెట్టేందుకు సుమారు నెల రోజులు పట్టింది. సంతోష్‌ సొంతూరి నుంచి నీలంతోగుకు 16 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 11 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లొచ్చు. కానీ.. ఐదు కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే వెళ్లాలి. ముందుగా నెలరోజులు, సంతోష్‌ తన ఫ్రెండ్స్‌తోపాటు వారానికోసారి నీలంతోగు వెళ్లాడు. రోజంతా వాళ్లతోనే ఉండి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. వెళ్లిన ప్రతిసారి పిల్లల కోసం వారికి వారానికి సరిపడే గుడ్లు తీసుకెళ్లేవాళ్లు. వాళ్లతో ఆడి, పాడి, చదువు గురించి చెప్పి అవేర్‌నెస్‌ కల్పించేవారు. అలా పిల్లల్లో కొంత మార్పు వచ్చాక, ఊరివాళ్లకు స్కూల్‌ అవసరాన్ని , ఆవశ్యకతను తెలిపాడు. దానికి వాళ్లు కూడా సరేనన్నారు. అందుకు ఒక పెద్దాయన ఇచ్చిన గుడిసెలో ‘భీమ్‌ చిల్డ్రన్‌ హ్యాపీనెస్‌ సెంటర్‌’ అనే పేరుతో 2020 జూన్‌ 24న తొలి బడిని ప్రారభించారు. ఆ స్కూల్‌కు టైమింగ్స్‌ లేవు. పిల్లలు ఎప్పుడైనా రావొచ్చు. ఎప్పుడైనా వెళ్లొచ్చు. అలా అయితేనే.. పిల్లలు స్కూల్‌కి రావడానికి ఇష్టపడతారని, ఇలా చేశారు. అదే ఊళ్లో ఉంటున్న పరమేశ్‌ పిల్లలను రోజూ బడికి తీసుకువచ్చే బాధ్యత చూసుకున్నాడు.
ఆ బడి ఊరందరిది
    కొన్నాళ్లు అదే గుడిసెలో బడి నడిపారు. కానీ, పిల్లల సంఖ్య పెరగడంతో అందులో నడపడం అసాధ్యమైంది. దానితో ఊరందరిని సమావేశ పరిచి బడి కట్టుకుందాం అని తన ఆలోచన చెప్పాడు. కానీ, మీరే చేయండి. మా వల్ల కాదని చెప్పింది ఊరు. నిదానంగా వారికి అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పడంతో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందంటే అందుకోసం ఎలాంటి సాయమైనా చేస్తామన్నారు. ఊరి జనం వాళ్లంతట వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఊళ్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి గుడిసెను నిర్మించారు. ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురిస్తే.. సెంటర్‌లో పిల్లలకు ఇబ్బంది కలగకుండా బడి నిర్మించారు. కేవలం రెండువేల రూపాయలతో ఇది మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్జీవోలు, ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తరుణ్‌, అతని స్నేహితులు ప్రతి నెలా సాయం అందిస్తున్నారు. బీమ్‌ హ్యాపీనెస్‌ సెంటర్‌లో వందశాతం హాజరు ఉంటోంది. వాలంటీర్‌ రాకముందే, పిల్లలందరూ బడికొస్తున్నారు. అలా ఊరందరూ కలిసి పని చేసి తమ ఊరికి బడిని నిర్మించుకున్నారు. అందుకే ఆ బడి ఆ ఊరందరిది.
తొమ్మిది పాఠశాలలు
ఇదే విధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చేస్తే బాగుంటుదని భావించాడు. అలా మరో ఎనిమిది గ్రామాల్లో బడి ప్రారంభించాడు. మరి వారి చదువు చెప్పడం ఎలా అనే ప్రశ్న తలెత్తింది. దానికి కూడా మంచి పరిష్కారాన్నే కనుకున్నాడు సంతోష్‌. ములుగు జిల్లాలోనే డిగ్రి వరకు చదువుకొని, ఇంటి దగ్గరే ఏదైనా పని చేసుకుని బతికే వాళ్లు ఉంటారు. వారిలో చదువుపై శ్రద్ద, పిల్లలకు పాఠాలు చెప్పాలన్న ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారికి ఆ బడులు నడిపే బాధ్యత ఇచ్చాడు. ఆ టిచర్లలకు నెలకు రెండురోజులు ట్రైగింగ్‌ ఇస్తున్నారు. భీమ్‌ హ్యాపీనెస్‌ సెంటర్‌లో స్టూడెంట్స్‌కి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గిఫ్ట్‌ ఇవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అది బాగా చదివే పిల్లలకు ఇచ్చే గిఫ్ట్‌ కాదు. బాగా ఆనందంగా ఉండి, పరిశుభ్రంగా, మంచి నడవడికతో మెదిలే పిల్లలకు ఇస్తారు. అలా పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాడానికి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత వాళ్లకు చదువు గొప్పతనంపై అవగాహన కల్పించి, వాళ్లలో చదువుపై ఇష్టాన్ని పెంచి, స్కూల్‌కి వెళ్లేట్టుగా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్కూల్‌లో ఇంగ్లీష్‌, తెలుగు వర్ణమాలలు, గుణింతాలు నేర్పిస్తున్నారు. ముందుగా పిల్లలకు వాళ్ల మాతభాషలో పాఠాల ద్వారా నేర్పిస్తున్నారు. గతంలో ఏడు, ఎనిమిది తరగతుల వరకు చదువుకుని, బడికెళ్లడం ఆపేసిన పిల్లలు కూడా ముగ్గురు ఉన్నారు. వాళ్లను కూడా పదో తరగతి చదివించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు వంద మంది పిల్లలను ప్రభుత్వ హాస్టల్స్‌లో చేర్పించారు. ఇంకా వీరి వద్ద 300 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు.
ఏమిస్తున్నారు?
ప్రస్తుతం పిల్లలకు ప్రతి రోజు ఒక గుడ్డుతో పాటు స్నానం చేయడానికి సబ్బులు, తలకు రాసుకోవడానికి నూనె, బట్టలు ఇస్తున్నారు. స్కూలుకు స్టేషనరీ, ఆట వస్తువులు, పిల్లలు చదువుకోవడానికి చార్ట్స్‌ ఇస్తున్నారు. అందుకోసం సంతోష్‌ తన ఫ్రెండ్స్‌, ఎన్జీవోల సాయం తీసుకుంటున్నారు.
– అనంతోజు మోహన్‌ కృష్ణ

Spread the love