హైదరాబాదుకు చెందిన యువ నటుడు జి.రోహిత్ నటన, దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాడు. రోహిత్ కి చిన్నప్పటి నుండీ నటనపై ఆసక్తి ఎక్కువ. అదే ఆయనను 2021లో ప్రగతినగర్, హైదరాబాద్ నుండి న్యూయార్క్‌కు నడిపించింది. హైదరాబాద్, గచ్చిబౌలి లోని ”దాదాసాహేబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్” నుండి నటనలో పట్టభద్రుడైన జి.రోహిత్‌పై ప్రఖ్యాత అమెరికన్ డైరక్టర్, నటుడు, నటనా ఉపాధ్యాయుడు లీ స్ట్రాస్ బెర్గ్ ప్రభావం ఎక్కువ. అదే, అమెరికాలోని ”ది లీ స్ట్రాస్ బెర్గ్ ధియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్” లో చేరి, యాక్టింగ్ కోర్సులు పూర్తి చేసేందుకు కారణమయ్యింది.
మా అబ్బాయి రోహిత్ అంతర్జాతీయ స్థాయిలో నటన, దర్శకత్వంలో ప్రతిభ కనబరిచి ప్రపంచస్థాయి అవార్డ్స్ అందుకోవడం తల్లిదండ్రులుగా మేమెంతో గర్వ పడుతున్నాం. మా రోహిత్ నటనలో మరింత ఎత్తుకు ఎదగాలని, మంచి సందేశాత్మక చిత్రాలు, నాటకాలు ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోహిత్‌కు నటనపై ఉన్న అభిమానం న్యూయార్క్‌కి నడిపించింది. చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పించిన ప్రగతి విద్యాలయం, దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ వారికి ధన్యవాదాలు.
– రాజామణి, విఠల్
చిన్నప్పటి నుండే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ ను అమ్మానాన్నా కూడా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. వారి ప్రోత్సాహంతోనే చదువుతో పాటు, యాక్టింగ్‌పై కూడా ఇష్టం పెరుగుతూ వచ్చింది. అది గమనించిన నాన్న నా ఇంజనీరింగ్ పూర్తి కాగానే గచ్చిబౌలిలోని ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. అక్కడ కోర్సు పూర్తి చేసి, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తితో అమెరికా వెళ్లాను. అక్కడ కూడా ప్రఖ్యాత నటుడు, డైరెక్టర్ ‘లీ స్ట్రాస్ బెర్గ్’ నడుపుతున్న ‘ది లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’ లో కోర్స్ పూర్తి చేశాను. అక్కడే ప్రముఖ నటులు, రచయితలతో కలిసి ‘ది చెకోవియన్స్’ అనే థియేటర్ సంస్థను ప్రారంభించాను. దీనితో పాటు నా సజనాత్మకతను వెలికి తీసే ఏ చిన్న అవకాశాన్నీ నేను వదులుకోలేదు. ఎక్కడ హైదరాబాద్.. ఎక్కడ అమెరికా… ఇక్కడకు వచ్చి ఒక సినిమా తీయడం, దానికి 4 అంతర్జాతీయ అవార్డులు రావడం నాకు గొప్ప ప్రేరణ. నా ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– జి.రోహిత్
అతనిలోని కళా ప్రతిభ అమెరికాలో వివిధ కళా వేదికలపై నటన, దర్శకత్వం రూపంలో వ్యక్తమవుతోంది. రోహిత్ ఇన్స్టిట్యూట్‌లో ఉండగానే ఎమెలీ డి పైవా ఎర్మెటె డి బోని తో కలిసి ”ది చెకోవియన్స్” అనే ప్రఖ్యాత థియేటర్ సంస్థను నెలకొల్పారు. తమకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ డైనమిక్ త్రయం ”ది చెకోవియన్స్” వేదికపై, వేదిక వెనుక దర్శకత్వంలో తమ అత్యుత్తమ నైపుణ్యంతో ప్రదర్శన లిస్తున్నారు. అంటోన్ చెకోవ్ ”యాన్ ఆఫ్టర్నూన్ విత్ యాంటోన్” మొదటిసారి నిర్మించిన ”ది యానివర్సరీ” ”ఎ స్వాన్ సాంగ్”లను న్యూయార్క్‌లోని ”ది ప్లేయర్స్ థియేటర్” అనే రెండు చిన్న నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకొన్నారు. మొదటి విజయంతో అవధులు దాటిన ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఈ బందం యూరప్ కు వెళ్ళింది. ఇటలీలో కూడా ఈ త్రయం అదే ప్రదర్శనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ”ది చెకోవియన్స్”, చెకోవ్( రచనలను
కొత్తదనంతో, తాజాగా, ఉల్లాసంగా, సరదాగా ప్రదర్శించి, నాటకాల హాస్య అంశాలను రక్తి కట్టించారు. వారి నాటకీయ చతురత, హావభావాలు హాస్యాన్ని పండిచాయి.
వరుస విజయాలు సాధించిన చెకోవియన్లు ప్రస్తుతం తమ తదుపరి నిర్మాణంలో, క్లాసిక్ నాటకాన్ని పునః రూపకల్పన చేసేందుకు తీవ్రంగా కషి చేస్తున్నారు. చెకోవియన్స్ ఆగస్ట్‌లో విడుదల చేయనున్న ”ది చెర్రీ ఆర్చర్డ్” ప్రత్యేకమైన విధానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది.
నాటక రచయిత దర్శకుడు ఫ్రాంక్.ఇ. రాబిన్సన్ రూపొందించిన ”వై?” (Why?)లో ప్రధాన పాత్ర పోషించిన రోహిత్ అందరి దష్టిని ఆకర్షించడం అతనిలోని ప్రతిభకు నిదర్శనం. ఈ ఆకర్షణీయమైన నాటకం గణనీయమైన సంచలనాన్ని సష్టి స్తోంది. భవిష్యత్తులో మంచి విజయాన్ని స్తుందని విమర్శకులు అంటున్నారు.
సినిమాపై తన అభిరుచిని కొనసాగిస్తూనే, రోహిత్ గత కొన్ని నెలలుగా వివిధ ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొంటున్నాడు. అటువంటి ప్రయత్నాలలో ఒకటి ”ది మౌంటైన్స్ వురు లెఫ్ట్ బిహైండ్” ఇది ఒక సుందరమైన పర్వత గ్రామం నేపథ్యంలో సాగే చిత్రమైన చిత్రం. కథానాయకుడు తన దినచర్యలోని మార్పుల నుండి విముక్తి పొందాలనే కోరికతో బాధపడుతుంటాడు, పర్వతాలు దాటి తన కోసం ఒక గొప్ప ప్రపంచం వేచి ఉందని నమ్ముతాడు. కథ సాగుతున్నప్పుడు, ఆకర్షణీయమైన ప్రకతి దశ్యాలను, కథానాయకుడి అంతర్గత పోరాటాలను జత చేసారు. మనం ఎక్కడికి వెళ్లినా మన నిజస్వరూపాన్ని ఎంతవరకు తీసుకువెళతామో అనే ఆలోచనను రేకెత్తించే ప్రశ్నలను లేవనెత్తుతుంది ఈ చిత్రం.
మరొక థ్రిల్లింగ్ వెంచర్, ”ఇన్ ది స్టిల్ ఆఫ్ ది నైట్” లో రోహిత్ ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతని సజనాత్మక భాగస్వామి ఎమెలీ డి పైవా రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక గోథమైట్ మంత్లీ ఫిల్మ్ అవార్డ్స్ లో ప్రశంసను పొందింది. దాని కథనం ఆకర్షణీయమైన దశ్యాలతో హదయాలను గెలుచుకుంది.
రచయితగా, దర్శకుడిగా, నటుడుగా పాత్రలను పోషిస్తున్న రోహిత్ స్వియ దర్శకత్వంలో ”వన్ లాస్ట్ సన్‌రైజ్” లో తెరపైకి రానేవచ్చాడు. దీనిలో రేపిస్ట్‌ను ఎదుర్కోవడానికి ఒక మిషన్‌ను ప్రారంభించిన హెడ్‌హంటర్ చుట్టూ కథ తిరుగుతుంది. అతను తనను వేధించే వాడిని ఎదుర్కొన్నప్పుడు, ఒక శత్రువు సన్నివేశంలోకి ప్రవేశించడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. ”వన్ లాస్ట్ సన్‌రైజ్” (One Last Sunrise) అనేక అవార్డులను పొందింది. ఫెస్టివల్ సర్క్యూట్ (festival circuit)లో విజయకేతనాలను ఎగురవేస్తూనే ఉంది. దానిలో భాగమే ”ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్” (Indo French International Film Festival) లో ఉత్తమ మౌన లఘు చిత్రాల ((Best Silent Short Film)) విభాగంలో విజేతగా నిలవడం.
ప్రగతినగర్ హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్రొగ్రెస్ ట్రస్ట్ (Peoples Progress Trust) హాస్టల్‌లో ఉండి ప్రాథమికోన్నత విద్యను అభ్యసించి బి.ఏ. డిగ్రీ పట్టా, నటనలో పట్టా పొంది., విదేశాల్లో విజయకేతనం ఎగురవేస్తున్న గుట్టమీది రోహిత్ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తి. రోహిత్ ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, సాధించిన విజయాలకు పునాదులుగా నిలిచాయి. అందుకే హైదరాబాద్ నుండి న్యూయార్క్ నగరానికి పయనమైన రోహిత్ .గుట్టమీది, థియేటర్, చలనచిత్ర ప్రపంచాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడానికి, భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నాడు. అతని అపారమైన ప్రతిభ, అచంచలమైన అంకితభావం, అతని సజనాత్మకత సహ కళాకారుల మద్దతుతో మున్ముందుకు దూసుకు పోవడం తథ్యం. రోహిత్ తన నటనాప్రపంచంలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని. అతని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
– ఎం.కె.