ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేయాలి

అనన్య శర్మకు నటనంటే అమితమైన ఆసక్తి. కానీ ఆ రంగంతో అసలు పరిచయం లేదు. పైగా నటనంటూ వెళితే తమ ఒక్కగానొక్క కూతురు భవిష్యత్‌ ఏమవుతుందో అని తల్లిదండ్రుల ఆందోళన. చివరకు బిడ్డ కోర్కెను కాదనలేకపోయారు. అయిష్టంగానే అంగీకరించారు. ఏమీ లేని దగ్గర నుండి నటనా రంగంలో స్వశక్తితో ఎదుగుతున్న కూతుర్ని చూసి ఇప్పుడు గర్వపడుతున్నారు. ప్రస్తుతం ‘ఆహా’ ద్వారా ‘అర్థమయిందా అరుణ్‌ కుమార్‌’ వెబ్‌ సీరిస్‌తో ప్రేక్షకుల ముందు వచ్చిన ఆమె పరిచయం నేటి మానవిలో…

నేను పుట్టింది వరంగల్‌లో. అమ్మ ప్రగతి, నాన్న రమేష్‌ శర్మ. ఇద్దరూ ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్స్‌. అమ్మ జువాలజీ, నాన్న కెమిస్ట్రీ చెప్తారు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడకు వెళ్ళేవారు. దాంతో నేను కూడా చాలా ప్రాంతాల్లో పెరిగాను. ఎక్కువగా హైదరాబాద్‌, బెంగుళూరులో చదువుకున్నాను. చిన్నప్పటి నుండి సినిమాలు బాగా చూసేదాన్ని. అలా నటనపై ఇష్టం పెరిగింది.
డ్రామా క్లబ్‌ ద్వారా…
పదిహేన్నేండ్లు వచ్చేసరికి ఆ ఇష్టం మరింత పెరిగింది. అప్పుడే ఇంట్లో నాకు నటనంటే ఇష్టమని చెప్పాను. కానీ అస్సలు ఒప్పుకోలేదు. ముందు చదువు పూర్తి చేయమన్నారు. నాకూ అప్పట్లో అవకాశాల కోసం ఎలా ప్రయత్నించాలో తెలియదు. దాంతో చదువుపై దృష్టి పెట్టి ఇంటర్‌ పూర్తి చేసి ఇంజీనింగ్‌లో చేరాను. అక్కడ మాకు ఓ డ్రామా క్లబ్‌ ఉండేది. దాంతో నాకు మంచి అవకాశం దొరికింది. నటనలో ప్రాథమిక విషయాలన్నీ అక్కడే నేర్చుకున్నాను. ఆ క్లబ్‌ కూడా కాలేజీ తరపునే ఉండేది కాబట్టి నేర్చుకోవడానికి ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు.
సీనియర్‌ సహకారంతో..
ఇంజనీరింగ్‌ పూర్తయ్యే సరికి నటన పట్ల అవగాహన పెరిగింది. యాక్టర్‌ హర్షిత్‌ రెడ్డి ఇంటర్‌లో నా సీనియర్‌. నటన పట్ల నాకున్న ఇష్టాన్ని గమ నించాడు. కోవిడ్‌ సమయం లో ఓ యూటూబ్‌ ఛానల్‌ కు ఆడిషన్స్‌ జరుగు తున్నాయని చెప్పి అందులో పాల్గొనే అవకాశం నాకు కల్పించాడు. ఈ విషయంలో నాకు అతను చాలా హెల్ప్‌ చేశాడు. ఆ యూటూబ్‌ ఛానల్‌ పేరు చారు బిస్కెట్‌. కరోనా టైం కావడంతో ఆడిషన్స్‌ కూడా ఆన్‌లైన్‌లోనే జరిపారు. ఓ వీడియో తీసి పంపించడమంటే పంపాను. అది చూసి వాళ్ళు అవకాశం ఇచ్చారు. అలా మొదటి సారి ఆ ఛానల్‌లో ఓ స్కెచ్‌ వీడియో కోసం నన్ను తీసుకున్నారు. ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా అవకాశాలు మొదలయ్యాయి.
మంచి అవకాశాలు వచ్చాయి
స్కెచ్‌ వీడియో చూసిన తర్వాత ’30 వెడ్స్‌ 21′ అనే వెబ్‌ సీరిస్‌కి అవకాశం వచ్చింది. ఇది కూడా చారు బిస్కెట్‌ యూటూబ్‌ ఛానల్‌ వాళ్ళు తీసిందే. అందులో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అది చూసే ఇప్పుడు ఆహా వాళ్ళు ‘అర్థమయిందా అరుణ్‌ కుమార్‌’ వెబ్‌ సీరిస్‌కు అవకాశం ఇచ్చారు. ఇది ఆహాలో జూన్‌ 30 నుండి ప్రారంభమయింది.
నేర్చుకోవడమే ఇష్టం
యాక్టింగ్‌ నేను కొత్తగా మొదలుపెట్టాను కాబట్టి ఎప్పుడూ నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఈ ఫీల్డ్‌ గురించి ఏమీ తెలియకుండా వచ్చాను. అలాంటి నేను ఇప్పుడు ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాననే చెప్పాలి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రంగంలో చాలా మంది సపోర్ట్‌ చేశారు. ఇంకా చేయాల్సింది, చేరుకోవల్సింది చాలా ఉంది. డిజిటల్‌, ఓటీటీ, యూటూబ్‌ వల్ల నాలాంటి కొత్త వాళ్ళకు అవకాశాలు బాగా వస్తున్నాయి. టాలెంట్‌కి అనుగుణంగా తమని తాము నిరూపించుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతకు ముందు నటించాలంటే తెల్లగా వుండాలి, పొడుగ్గా వుండాలి అనే ఫీలింగ్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా మారిపోయింది. నటనంటే ఆసక్తి, చేయాలనే తపన, టాలెంట్‌ ఉంటే చాలు. దీని వల్ల చాలా మంది తమ కలలను నిజం చేసుకోగలుగుతున్నారు.
యాక్షన్‌ మూవీలో నటించాలి
డ్రీమ్‌ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. సమంతలా యాక్షన్‌ మూవీ చేయాలనే కోరిక ఉంది. అలాంవి చేస్తే నా నటనా జీవితంలో ఒక బెంచ్‌ బార్క్‌ అవుతుంది. దీని కంటే కూడా ముందు జీవితాంతం యాక్టింగ్‌ చేయాలని నా కోరిక. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాత్ర నాకు బాగా నచ్చినవే. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ప్రాధాన్యత ఉంది. ఖాళీ సమయంలో బుక్స్‌ బాగా చదువుతాను. అలాగే మూవీస్‌, వెబ్‌ సీరిస్‌ చూస్తుంటాను. ఇంకా కొత్త కొత్తవి చేయడం అంటే ఇష్టం. పెయింటింగ్‌ కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల యాక్టింగ్‌ నాకు బాగా నచ్చుతుంది.
కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు
అమ్మాయిలకు ఏ ఫీల్డ్‌లో అయినా జాగ్రత్త అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులను కంట్రోల్‌ చేయడం మన వల్ల కాదు. ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మలేం. అలా అని ఫీల్డ్‌లోకి రావడానికి భయపడాల్సిన పని కూడా లేదు. కాస్త జాగ్రత్తగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనే నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్న ‘అర్థమయిందా అరుణ్‌ కుమార్‌’ సీరిస్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యే స్టోరీ. ఒక అబ్బాయి అమలాపురం నుండి బతకడానికి మొదటిసారి హైదరాబాద్‌ వస్తాడు. నగరంలో జీవితం ఎలా గడపాలో అర్థం కాక గందరగోళ స్థితిలో ఉంటాడు. ఇది కొత్తగా సిటీకి వచ్చిన యువతకు చాలా దగ్గరగా వుండే స్టోరి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఇలాంటి ఫీల్‌ను కచ్చితంగా అనుభవిస్తారు. కాబట్టి అందరికీ ఇది బాగా నచ్చుతుంది.
ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు
ఇంజనీరింగ్‌ తర్వాత కూడా నటన పట్ల నా ఆసక్తి, నా ప్రయత్నాలు గమనించిన అమ్మానాన్న కూడా చివరకు ఒప్పుకున్నారు. కానీ మొదట అయిష్టంగానే ఒప్పుకున్నారు. తర్వాత నా వర్క్‌, షోలు చూసి వాళ్ళకు కాస్త నమ్మకం వచ్చింది. ‘మేము అనుకున్నట్టు ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు’ అనే అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవ్వరూ ఈ ఫీల్డ్‌లో లేరు. పైగా ఈ ఫీల్డ్‌ గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. చూసిన దాని కంటే విన్న వాటికే ఎక్కువ భయపడ్డారు. కానీ ఇప్పుడు అమ్మానాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఆడపిల్లను కాబట్టి ఇప్పటికీ జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు.

Spread the love