శ్వాస ఉన్నంత వరకు చదువు చెప్తా…

ప్రొ.శాంతమ్మ…
ప్రపంచంలోనే పెద్ద వయసున్న ప్రొఫెసర్‌. దేశంలోనే ‘డాక్టరేట్‌ఆఫ్‌ సైన్స్‌’ పట్టాఅందుకున్న మొదటిమహిళామణి. భౌతిక, రసాయన శాస్త్రాలలోఅత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు రాజావిక్రమ్‌ దేవ్‌ వర్మ స్మారక స్వర్ణ పతక విజేత. జీవిత సాఫల్యంతో పాటు లెక్కకు మిక్కిలిగా పురస్కారాలు అందుకునున్నారు. తొంభైఏండ్లు దాటినా అలుపెరుగక విద్యాబోధకురాలు. ఇటీవలె తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్‌ నుండి ఆమె కోసం వారి ఇంటికే తరలి వెళ్ళింది. మాతృ వందనంతో అభినందించి వచ్చింది. ఈసందర్భంగా ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం శాంతమ్మ సొంతూరు. తండ్రి వంగల సీతారామయ్య, న్యాయవాదిగా పని చేసేవారు. అయితే ఆమె ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మరణించారు. తర్వాత తల్లి పోషణలో పెరిగిన ఆమె చదువు రాజమండ్రి, మదనపల్లి, విశాఖలో సాగింది. శాంతమ్మ తమ జీవితభాగస్వామి, తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు దివంగత సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రస్తావన లేకుండా మాట ముందుకు సాగనివ్వలేరు. సంతానంలేని ఆ దంపతులకు విద్యార్థులే పిల్లలు.
ఊతకర్ర సాయంతో…
వయసు శరీరానికే కానీ మనసుకు కాదంటారామె. నిత్యం రానూపోనూ సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తూ పాఠాలు చెబుతున్నారు. వేకువజామున నాలుగు గంటలకు నిద్రలేచి పనులు చక్కపెట్టుకొని, విశాఖ నుంచి విజయనగరంలోని విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పడానికి వెళతారు. ‘శ్వాస ఉన్నంత వరకు చదువు చెప్పాలి. చదువు చెప్పగలిగేంత వరకూ జీవించాలి’ అనే దృఢ సంకల్పంతో, ఊతకర్రల సాయంతో తిరుగుతూ పాఠాలు చెబుతూ అధ్యాపక వర్గానికే స్ఫూర్తి ప్రదాత ఆమె.
బోధనంటే ప్రాణం
”జ్ఞానం పంచేకొద్దీ పెరుగుతుంది. ఒకరి నుంచి మరొకరికి విశ్వవ్యాప్త మవుతుంది. కొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుంది. ఆఖరి శ్వాస వరకు చదువు చెప్పాలన్నదే నా సంకల్పం. ఇరవై ఏండ్ల కిందట రెండు మోకాళ్ల చిప్పలకు శస్త్రచికిత్స జరిగింది. వయసుతో వస్తున్న సమస్యలు నా మనోధైర్యాన్ని, స్థయిర్యాన్ని ఏమీ చేయలేకపోయాయి. వృత్తిని గౌరవించాలి. మన అనుభవాలు, జ్ఞానం భావితరానికి ఉపకరించగలగాలి. అందులోనే ఎనలేని సంతృప్తి దాగి ఉంటాయి. పనిలోనే విశ్రాంతి అనే భావన అలవరచుకుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు” అంటారు ఆమె.
స్వర్ణపతకాన్ని అందుకున్నారు
”శక్తి సామర్ధ్యాలు అందరికీ ఉంటాయి. దానిని వినియోగించు కోవడంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి” అంటున్న శాంతమ్మ ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ హయాంలో విశాఖ ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో స్నాతకోత్తర విద్య, ‘మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపి’కి సంబంధించి పీహెచ్‌డీతో సమానమైన డీఎస్సీ పరిశోధన పూర్తి చేశారు. అక్కడే 1956లో భౌతిక శాస్త్ర విభాగంలో ఉపన్యాసకురాలిగా చేరారు. భౌతిక, రసాయన శాస్త్రాలలో ప్రతిభకు రాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ స్మారక స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. రీడర్‌, ప్రొఫెసర్‌, ఇన్వెస్టిగేటర్‌ లాంటి బాధ్యతలు నిర్వహించారు. ఆమె పర్యవేక్షణలో 17 మంది పీహెచ్‌డీ, నలుగురు ఎం.ఫిల్‌. పట్టాలు అందుకున్నారు. అనేక విశ్వ విద్యాలయాల డి.ఎస్సీ., పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
లెక్కకు మించి పురస్కారాలు…
శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి, యూజీసీ, శాస్త్ర సాంకేతిక విభాగం వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనలకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ‘అటామిక్‌ స్పెక్ట్రోస్కోపి మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపి’కి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణలకు ప్రఖ్యాత శాస్త్రవేత్తల విభాగంలో బంగారు పతకంతో పాటు అనేక పురస్కారాలు లభించాయి. వృత్తిలో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌, స్పెయిన్‌, కొరియా, శ్రీలంక తదితర దేశాలలో అనేక సైన్స్‌ సదస్సులకు హాజరయ్యారు. బోర్డు ఆఫ్‌ స్టడీస్‌, ఏపీ తెలుగు అకాడమీ పాలకమండలి చైర్‌ పర్సన్‌గా కూడా వ్యవహరించారు.
పరస్పర గౌరవంతో…
”భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పుడే కుటుంబాలు, తద్వారా సమాజం చక్కగా సాగుతాయి. నాకు బోధనంటే చాలా ఇష్టం. నా భర్తకు తెలుగు సాహిత్యం అంటే అమితమైన ప్రేమ. పెద్దల అనుమతితో మేమిద్దరమే తిరుమలకు వెళ్లి పెండ్లి చేసుకున్నాం. కొండ దిగి వస్తుం డగా ‘బాగా చదువుకున్నావు. చాలా విష యాలు బాగా తెలిసిన దానివి. స్వతం త్రంగా నిర్ణయాలు తీసుకో’ అన్నారు. మా మధ్య అత్యాశలు, ఆత్మన్యూనత భావాలు లాంటివి లేవు. పరస్పర అభిప్రాయా లను గౌరవించుకున్నాం. ఆలుమగల బంధం పటిష్టతకు అదే మూలం అనుకుంటా. నా ఉన్నతిలో శాస్త్రి గారి పాత్రే ఎక్కువ. ఆయన ప్రోత్సాహంతోనే ప్రొఫెసర్‌గా అంత ర్జాతీయ స్థాయికి ఎదగ గలిగాను. మా అమ్మ వనజాక్షమ్మ 104 ఏండ్లు జీవించి ఆరేండ్ల కిందట మరణించారు. అప్పటివరకు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు.
ఇల్లు విరాణంగా ఇచ్చేశారు
‘ఒకసారి తీసుకున్న నిర్ణయాలను పునరాలోచించు కుంటూ బాధపడకూడదు’ అన్న మాటలే ఆమెకు స్ఫూర్తి. దానినే నమ్మిన ఆమెకు ఆస్తిపాస్తులపై మమకారం లేదు. అందుకే దశాబ్దాల కిందట కష్టించి కట్టుకున్న ఇంటిని ‘మానవసేవే మాధవసేవ’ అన్నట్లు వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చిన గొప్ప వ్యక్తిత్వం ఆమెది.
ఉద్యోగ విరమణ తర్వాత
1989లో పదవీ విరమణ తర్వాత కూడా ఆరేండ్లపాటు ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లోనే గౌరవ అధ్యాపకురాలిగా సేవలు అందించారు. ప్రస్తుతం తన దగ్గర విద్యా బుద్ధులు నేర్చిన ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు ఉపకులపతిగా వ్యవహరిస్తున్న విశ్వ విద్యాలయంలోనే విద్యాబోధన చేస్తున్నారామె. రోజుకు కనీసం ఆరు తరగతులు తీసుకుంటున్నారు. ”విద్యార్థులే నా పిల్లలు, వారి భవిష్యత్‌ నాకు ముఖ్యం. అందుకే అవసరమైతే సెలవు రోజుల్లోనూ తరగతులు తీసుకుంటుంటాను” అంటున్నారు ఆమె.

Spread the love