77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించి గొప్పగా మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న యువతులు అసలు స్వేచ్ఛ అంటే ఏమిటో మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ అంటే వలసవాదం నుండి స్వాతంత్య్రం కాదని… దీని అర్థం అంతకు మించి ఉందంటున్నారు. వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాల్లో సొంత ఎంపికే స్వేచ్ఛ అంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్ల తర్వాత మనల్ని మనం వేసుకుంటున్న ప్రశ్న ఏమిటంటే ‘మనం నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా?’… దేశంలోని యువ జనాభాలో భాగమైన లక్షలాది యువతుల దృష్టిలో అసలు స్వేచ్ఛ అంటే ఏమిటో… దీని గురించి వాళ్ళేం చెబుతున్నారో తెలుసుకుందాం…
జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకునే స్వేచ్ఛ ఉందా? వేధింపులకు గురికాకుండా వీధుల్లో నడిచే స్వాతంత్య్రం ఉందా? తమ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందా? ఇష్టం లేని పెండ్లిని నిరాకరించే స్వేచ్ఛ ఉందా? స్త్రీలు విధేయతతో సౌమ్యంగా ఉండాలి అని చెప్పేవారికి భయపడకుండా, బిగ్గరగా, స్పష్టంగా సమాధానం చెప్పే స్వేచ్ఛ ఉందా? ఒక అమ్మాయి ఏమి చేయగలదో, ఏమి చేయలేదో నోరు విప్పి చెప్పే స్వేచ్ఛ ఉందా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
పితృస్వామ్య సమాజం నుండి విముక్తి
నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏండ్ల రితికా చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తుంది. ఆమె స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం వచ్చి చాలా ఏండ్ల తర్వాత కూడా మనం నిజంగా స్వేచ్ఛగా ఉన్నామని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే నేను చేయాలనుకున్నది చేయడం, నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే భయం లేకుండా ఉండడం. మన దేశంలో మహిళలు ప్రశ్నించేందుకు కారణాలు చాలా ఉన్నాయి. స్త్రీలకు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి, వారి భావాలను వ్యక్తీకరించడానికి, ఎంపిక చేసుకోవడానికి, వారి జీవితాలను తమకు నచ్చినట్లు జీవించడానికి స్వేచ్ఛ లేదు. తమ తండ్రులు, సోదరులు, భర్తలు ఇలా ఎప్పుడూ మగవారిపై ఆధారపడి బతకాలి. వీరి చేత మహిళలు నియంత్రించబడతారు. మనకు నిజంగా కావలసింది ఈ పితృస్వామ్య సమాజం నుండి స్వేచ్ఛ’ అంటుంది.
కాలం మారుతోంది
ఇరవై ఒక్క ఏండ్ల ఆయేషా షేక్ ఈమె ముంబయిలో నివసిస్తుంది. విద్యార్థిగా ఉన్న ఈమె మాట్లడుతూ ‘నా దృష్టిలో స్వేచ్ఛ అంటే పరిణామాల గురించి ఆలోచించకుండా ఒక వ్యక్తిగా నేను కోరుకునే పనులు చేయడం. అమ్మాయి అడుగు బయట పెడితే చాలా సవాలక్ష ప్రశ్నలు అడుగుతుంటారు. ఎక్కడికి వెళుతున్నావు, ఎప్పుడు వస్తావు, ఎవరితో పోతున్నావు, ఎక్కడ ఉంటావు అంటూ వేధిస్తుంటారు. అంతే కాదు వేసుకునే దుస్తుల గురించి కూడా ఆంక్షలు పెడుతుంటారు. వృత్తిపరంగా చూస్తే నిర్మాణ సైట్లలో పని చేసే వారు మగవారితో ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లతో ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. మహిళలు ఇలాంటి పనులు చేయలేరు అనే భావన సమాజంలో బలంగా ఉంది. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ మనస్తత్వం కూడా మారుతోంది. స్త్రీలు ప్రతి రంగంలో తమ సత్తా చాటుకుంటున్నారు. పురుషులతో సమానంగా, అంతకంటే ఎక్కువగానే తమ సొంత గుర్తింపును సృష్టిస్తున్నారు’ అన్నారు.
భద్రత, మాట్లాడే హక్కు
‘నాకు స్వేచ్ఛ అంటే భద్రత అలాగే స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే హక్కు. కానీ మహిళలకు ఇది వివిధ దేశాలలో వేర్వేరుగా ఉంది. మాట్లాడటానికి, వినడానికి పరిమిత హక్కు ఉన్న కుటుంబ బాధ్యతను మన దేశంలో మహిళలు భరిస్తున్నారు. వారి భౌతికత్వం, వైవాహిక స్థితి సమాజంలో వారు ఎవరో నిర్వచిస్తుంది. వారిలో చాలా మందికి స్వతంత్ర జీవితాలను జీవించే హక్కు లేదు. వారి భవిష్యత్తు తీర్పు పితృస్వామ్య సమాజం ద్వారా రూపొందించబడింది’ అంటుంది అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన విద్యార్థి వాంగ్‌చెన్ త్సోము.
కోరుకున్న పనులను చేసే స్వేచ్ఛ
పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏండ్ల నర్సింగ్ విద్యార్థిని ప్రీతి పాల్ మాట్లాడుతూ ‘స్వేచ్ఛ అంటే నాతో నేను శాంతిగా ఉండటమే. మనం స్వేచ్ఛగా తీసుకొనే కొన్ని నిర్ణయాలు ఇప్పుడున్న మన సామాజిక నిబంధనలకు సరిపోవు. అలాంటప్పుడు మనమేదో అపరాధం చేసినట్టు అవమానంగా భావించకూడదు. ఇందులో చదువుకునే స్వేచ్ఛతో పాటు కళలను నేర్చుకోవడం, కెరీర్‌ని ఎంచుకునే స్వేచ్ఛ, అవసరమైనప్పుడు మరొకటి మార్చుకునే స్వేచ్ఛ మనకు ఉండాలి. నాకు 18 ఏండ్లు నిండిన తర్వాత నా సొంత నిర్ణయాల ప్రకారం స్వేచ్ఛగా జీవించే స్వేచ్ఛ, కొత్త విషయాలను నేర్చుకునే స్వేచ్ఛ నాకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బయటకు వెళ్ళినపుడు వేధింపులకు గురికాకుండా ఉండటానికి నేను ఇష్టపడతాను. అలాగే కొన్ని విషయాలపై అభిప్రాయాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, నా రూపాన్ని బట్టి నన్ను అంచనా వేయని స్వేచ్ఛ నాకు కావాలి. ఇంకా నా సమస్యలపై పోరాడే స్వేచ్ఛ కూడా నాకు కావాలి’ అంటుంది.
స్వేచ్ఛ అనేక దొంతరల నుండి వస్తుంది
‘ఒక యువతిగా నా దృష్టిలో స్వేచ్ఛ అంటే లింగ నిబంధనల నుండి విముక్తి పొందడం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయం లోనైనా బయటికి వెళ్లిన ప్రతిసారీ నాకు భద్రతాపరమైన సమస్యలు ఉంటాయి. నేను చాలా ప్రత్యేకాధికారాలతో కూడిన సామాజిక స్థితిలో ఉన్నానని నాకు తెలుసు. కానీ అదే సమయంలో నా సోదరుడికి ఉన్నంత స్వేచ్ఛ నాకు లేదని నాకు తెలుసు. మనం స్వేచ్ఛగా ఉన్నామని నేను నమ్మడం లేదు. స్వేచ్ఛ అనేది అనేక దొంతరల నుండి వస్తుందని నేను భావిస్తున్నాను. ఇది కేవలం వలసవాదం నుండి స్వేచ్ఛను సాధించడం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేశం స్వేచ్ఛగా ఎలా ఉంటుందో అనే అనుమానలు వస్తున్నాయి. మనం వర్గవాదం, కులతత్వం, జాత్యహంకారం, లింగవివక్ష, మతతత్వం నుండి విముక్తి పొందకపోతే మనం స్వాతంత్య్రం పొందలేము’ అంటుంది బెంగళూరుకు చెందిన విద్యార్థి అపూర్వ చోప్రా.