తెలంగాణలో భానుడి భగభగలు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సూర్యుడి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం పూట భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయట అడుగుపెట్టాలంటే నిప్పుల కొలిమిలో కాలు పెట్టినట్టుగా ఉంటోంది. ఇక పలు జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఇప్పుడే ఇలా ఉంటే మేలో పరిస్థితులను తలుచుకుంటేనే వణుకు పుడుతోందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో శనివారం రోజున నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలో 45.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2, ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉందని వెల్లడించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో 44.5 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని మూసాపేటలో గరిష్ఠంగా 43 డిగ్రీల ఎండ కాసింది. 21 సర్కిళ్లలో 42.1 నుంచి 42.9 డిగ్రీల మధ్య నమోదైనట్లు చెప్పారు. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Spread the love