నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో పాటు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 70,000 మంది నిరాశ్రయులయ్యారు. 21 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశాధికారులు ఆదివారం వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం నుంచి పడాంగ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 200 ఇళ్లు నేల మట్టమయ్యాయి. పలు చోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు కూలడంతో చాలా మార్గాలు మూసుకుపోయాయి.