ఇందిరమ్మ ఇంటి నమూనా ఇదే..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు భద్రాచలంలో ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల కట్టుకునేందుకు రూ. 5 లక్షలు సాయం అందిస్తారు. స్థలం లేని వారికి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు. ఏడాది 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వం పలు నమూనాలు సిద్ధం చేసింది. ప్రతి డిజైన్‌లోనూ కిచెన్, టాయిలెట్ ఉండేలా తీర్చిదిద్దారు. తొలి నమూనాలో సింగిల్ బెడ్రూం, కిచెన్, అటాచ్డ్ వాష్‌రూం, హాల్, కామన్ బాత్రూం, ఇంటిపైకి వెళ్లేందుకు మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు కొంత స్థలం, బాల్కనీ, బైక్ పార్కింగ్ కోసం స్థలం, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం 4,16,500 ఇళ్లు మంజూరు చేసింది. మిగతా 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద అట్టేపెట్టింది. ఈ పథకం అమలు కోసం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులతో 95 వేల ఇళ్లు నిర్మించనుంది. గ్రామాల్లో 57 వేలు, పట్టణ ప్రాంతాల్లో 38 వేల ఇళ్లను నిర్మిస్తారు.

Spread the love