ఒక్క అడుగు ముందుకేయి పది అడుగులు నీతో కలిసి నడుస్తాయి… పది అడుగులు నిన్ను అనుసరిస్తాయి… కదలని అడుగులకై ఆలోచించి నీ అడుగును ఆపకు… అడుగు భవిష్యత్ అయ్యి అభివృద్ధి పథంవైపు నడవాలి. అడుగేయడం అంటే మాటలు కాదు. దానికి మనోబలం కావాలి. ఒకరి అడుగుల్లో అడిగేసి నడవడం సులభమే. కానీ తానే ఓ కొత్త అడుగై నడవడం, ఆ అడుగు సమాజ హితానికై వేయడం, ఆలోచించదగిన విషయం. నేను నా కుటుంబం అన్న స్వార్థపూరిత ఆలోచనలు వదులుకొని నేను నా సమాజం అనే ఆదర్శవంతమైన ఆలోచనలతో అడిగేయడం కొందరికే సాధ్యమవుతుంది. అందులో సమాజహితైషిగా అడుగులు వేస్తున్న లొల్ల పావని ఒకరు.
సాధారణంగా ఉదయాన్నే లేచి ఇల్లంతా అద్దంలా శుభ్రం చేసుకుంటే తప్ప మనకు ప్రశాంతత ఉండదు. కానీ పావనికి భారతదేశమంతా పడి ఉన్న చెత్తను శుభ్రం చేసి, పచ్చిని దేశంగా మార్చాలని కల. కాలుష్య రహిత దేశమే తన లక్ష్యంగా పెట్టుకుంది. ”కలలు కనడమే కాదు కలను విశ్వసించాలి. కల కోసం పనిచేయాలి” అంటారు ఆమె. పర్యావరణ పరిరక్షణకై విద్యార్థి దశ నుంచే ఆలోచన మొదలుపెట్టిన ప్రకృతి ప్రేమికురాలు పావని. చిన్నప్పటినుండి ప్రకృతన్నా, పర్యావరణమన్నా ఎంతో ఇష్టం. టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతుందని తెలుసుకొని చిన్న నాటి నుండి వాటిని కాల్చడం ఆపేసింది. ఎదిగిన తర్వాత పర్యావరణ పరిరక్షణకై ”వాప్రా” అనే యంత్ర నిర్మాణానికి పూనుకున్నది.
తల్లి ప్రోత్సాహంతో…
పావని హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. తండ్రి బాబి బిఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తారు. తల్లి లక్ష్మి టైలరింగ్ చేసేవారు. అలాగే పచ్చళ్ళు కూడా తయారు చేసేవారు. ఆడపిల్ల పుట్టాలని ఇష్టపడి ఆమె పావనిని కన్నది. ఆడపిల్లల పట్ల ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిత్వం ఆ తల్లిది. అందుకే పావని ఎదగడానికి అడుగడుగున ప్రోత్సాహాన్ని అందించింది. మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడకూడదని, స్వయంగా తమ కాళ్లపై తామే నిలబడాలని కూతురుకి బోధించేది. పావని అన్నయ్య మణికంఠ సాఫ్టేవేర్ ఉద్యోగి.
చదువుకునే రోజుల్లోనే…
ఇంజనీరింగ్ చదివేటపుడే పావని ఎకో క్లబ్ పేరుతో స్టూడెంట్స్ ఫోరంను ఏర్పాటు చేసుకుంది. తరగతి గదిలో డస్ట్ బిన్స్ వాడాలని యాజమాన్యాన్ని కూడా అప్రమత్తం చేసింది. కాలేజీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరిగి ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్ధాల వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించేది. గ్రామాలలో తన స్నేహితుల సహకారంతో అవగాహన శిబిరాలు కూడా ఏర్పరిచింది. చెత్త బుట్టలు పంపీణీ చేసింది. అయినా ప్రజల్లో చైతన్యం రాలేదు. చెత్త బుట్టల వినియోగం కూడా జరగలేదు.
చెత్తను ఎరువుగా మార్చాలని
అప్పుడు పావనిలో ఆలోచన మొదలైంది. చెత్తను సేకరించడం కన్నా చెత్తని ఎరువుగా మారిస్తే తిరిగి అది ఉపయుక్తమౌతుంది కదా! అన్న ఆలోచన తల్లితో పంచుకుంది. తల్లి ప్రోత్సహించింది. వ్యర్థాలను ఎరువుగా మార్చే యంత్రాలపై అవగాహన పెంచుకుంది. తనే స్వయంగా కంపోస్టు తయారు చేసే యూనిట్లను తయారు చేసి తోట పని చేసే వారికి ఉచితంగా అందించింది. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని తిరిగి మెరుగైన యంత్ర నిర్మాణానికి పూనుకుంది. ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేస్తూనే ”వప్రా”
కంపోస్ట్ ఎరువులు తయారు చేసే యంత్రానికి పురుడు పోసింది. ఇది వారం రోజుల్లోనే ఆహార వ్యర్థాలను కంపోస్ట్‌గా తయారు చేస్తుంది. దీనికి స్నేహితుడు సిద్ధిష్ సహకారం తీసుకుంది. ”ఫ్యూచర్ స్టెప్” ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో కంపెనీని ప్రారంభించింది.
పాఠాలు నేర్చుకుంది
వాప్రా పేరుతో చెత్తని ఎరువుగా మార్చే యంత్రం, ఆర్గానిక్ మైక్రోబియా లిక్విడ్స్, గ్రీన్ మిక్స్ పౌడర్ తయారు చేసి మార్కెటింగ్ చేసింది. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించింది. మెల్లిమెల్లిగా వ్యాపారం ఊపందుకుంది. అయితే అనేక సంక్షోభాలు కూడా ఎదుర్కొంది. వ్యర్థాలకు సరైన జవాబు చూపకపోతే తన చదువు వృధా అనుకున్నది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నది. మరింత ప్రొఫెషనలిజం కోసం వి హబ్‌ను సంప్రదించింది. ఆమె ఆలోచనలు నచ్చి ఇంక్యుబేషన్ కార్యక్రమానికి ఎంపిక చేశారు వారు. వి హబ్ ఒక మెంటల్‌ను కూడా కేటాయించింది. వారి సహకారంతో మార్కెటింగ్, సోషల్ మీడియా తదితర అంశాలపై పట్టు సాధించింది. దాంతో వ్యాపారం 14 రాష్ట్రాలకు విస్తరించింది.
మహిళలే ఎక్కువ
కంపెనీలో అత్యధిక శాతం మహిళలే పనిచేస్తున్నారు. ప్రతి మహిళ ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు కలిగి ఉండి తన కాళ్ళపై నిలబడాలన్నది పావని ఆలోచన. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించాలన్నది ఆమె లక్ష్యం. ప్రతి ఇంటిలోని వ్యర్ధపదార్థాలను రీసైకిలింగ్ చేసి కంపోస్ట్‌గా మార్చాలన్నది ఆమె కల. వాప్రాను ప్లాస్టిక్‌తో రూపొందించాలన్నది వీరి ఆశయం. ప్రతి ఒక్కరూ చెత్త బయట వేయకండి. ఆ చెత్తను రీసైకిల్ చేసి కంపోస్ట్‌గా మార్చడానికి ప్రయత్నించండి. కంపోస్టు సులువుగా చేసే ప్రక్రియ కోసం www.vapra composting.in ని సంప్రదించండని పావని కోరుకుంటుంది.
– డాక్టర్.శారదా హన్మాండ్లు ([email protected])
పర్యావరణానికి మేలు చేసేవే
పావని కంపెనీ ద్వారా ఉత్పత్తి చేయబడే ప్రొడక్ట్స్ అన్ని కూడా పర్యావరణానికి మేలు కలిగించేవే. పంట చేతికొచ్చాక మిగిలిన కర్రను కాల్చకుండా నేరుగా ఎరువుగా మార్చేందుకు వాప్రా బ్రౌన్ లిక్విడ్‌ను ప్రవేశపెట్టింది. వంటింటి చెత్తను వారం రోజుల్లో కంపోస్టుగా మార్చేందుకు వాప్రా హోమ్ కంపోస్టింగ్ కిట్‌ను అందుబాటు లోకి తెచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ కోసం సొసైటీ కంపోస్టు మిషన్, డస్ట్ బిన్‌లోని చెత్తను ఎరువుగా మార్చే గ్రీన్ మిక్స్ పౌడర్, ఆర్గానిక్ వ్యర్థాల నుంచి తయారుచేసిన ప్లాంట్ ఫీట్ కంపోస్ట్‌ను విక్రయిస్తున్నది.