పుట్టగొడుగులను వివిధ రకాల వంటకాల్లో విస్తతంగా ఉపయోగిస్తారు. సూప్, సలాడ్లలలో కూడా వాడతారు. గుడ్లతో సమానంగా వీటిలో పోషకాలు ఉంటాయి. శాండ్‌విచ్‌లలో ఇతర కూరగాయలతో పాటు వీటిని ఉపయోగిస్తారు. పిజ్జాలలోనూ వీటి వినియోగం ఉంటుంది. పుట్టగొడుగుల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92 శాతం నీటిని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని కూరల్లో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటితో చేసే కొన్ని రకాల వంటలు ఈ వారం మీ కోసం…
రోజు తీసుకునే ఆహారంలో పుట్ట గొడుగులను చేర్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ. ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
బఠాణీతో..
కావాల్సిన పదార్థాలు : పచ్చి బఠాణీలు – ఒకటిన్నర కప్పులు, పుట్టగొడుగులు – 200గ్రా||, ఉల్లిగడ్డలు – రెండు, టమాటాలు – నాలుగు, కారం – చెంచా, దనియాలపొడి – చెంచా, పసుపు – చెంచా, గరం మసాలా – చెంచా, జీడిపప్పు ముద్ద – అరకప్పు, యాలకులు – నాలుగు, దాల్చినచెక్క – అంగుళం ముక్క, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాలు, నూనె : నాలుగు చెంచాలు, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం : పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చినచెక్క, ఉల్లి గడ్డ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి ఓ నిమిషం వేయించాలి. టమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తర్వాత కారం, దనియాలపొడి, పసుపు, గర మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. జీడిపప్పు ముద్దని ఓ కప్పు నీళ్లలో కలిపి బాణలిలో పోయాలి. తర్వాత మరో కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో బఠాణీలు, పుట్టగొడుగులు వేసి, ఉడికిన తర్వాత దించాలి.
మసాలా కర్రీ
కావాల్సిన పదార్థాలు : పుట్టగొడుగులు : 200గ్రా||, ఉల్లిగడ్డలు – రెండు, పచ్చిమిర్చి – ఆరు, టమాటాలు – రెండు, లవంగాలు – నాలుగు, దాల్చినచెక్క – అంగుళం ముక్క, కారం – చెంచా, జీలకర్రపొడి – చెంచా, ఉప్పు – సరిపడా, పసుపు – అర చెంచా, వెల్లుల్లి ముద్ద – చెంచా, నూనె – కప్పు, చిన్న మెంతి ఆకులు – చెంచా
తయారుచేసే విధానం : బాణలిలో నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి వేగాక వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్రపొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు చిలకరించి వేయించాలి. మసాలా వేగి నూనె తేలాక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పుట్టగొడుగుల ముక్కలు వేసి సన్ననిమంట మీద మరో పది నిమిషాలు ఉడికించాలి. చివరగా మెంతి ఆకులు వేసి కొద్దిసేపు కలిపి దించాలి.
చిల్లీ
కావాల్సిన పదార్థాలు : బటన్ మష్రూమ్స్ – 200గ్రా||, క్యాప్సికమ్ – రెండు, ఉల్లిగడ్డ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి – ఆరు రెబ్బలు, నూనె – రెండు చెంచాలు, కారం – చెంచా, సోయాసాస్ – రెండు చెంచాలు, కార్న్ ఫ్లోర్ – చెంచా, వెనిగర్ – చెంచా, నీళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా
తయారుచేసే విధానం : పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా, క్యాప్సికమ్ లోపలి గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా మిక్సి పట్టుకోవాలి. తర్వాత కళాయిలో నాలుగు చెంచాల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి. తర్వాత కారం వేసి కలిపి, అరకప్పు నీళ్లుకూడా పోసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, పుట్టగొడుగు ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి. తర్వాత సోయాసాస్, వెనిగర్ వేసి కలపాలి. ఒక గిన్నెలోమ కొన్ని నీళ్ళు తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ వేసి కలిపి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని కూరలో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
ఆంధ్రా స్టైల్
కావాల్సిన పదార్థాలు : పుట్టగొడుగులు – పావుకిలో, ఉల్లి గడ్డ – మూడు, పచ్చిమిర్చి – మూడు, కారం – చెంచా, పసుపు – పావు చెంచా, కొత్తిమీర – కట్ట, నూనె – వేయించడానికి సరిపడా, ఉప్పు – తగినంత, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి – రెండు రెబ్బలు, జీలకర్ర – చెంచా, గసగసాలు – చెంచా, దనియాలు – చెంచా
తయారుచేసే విధానం : పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి ఉంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, దనియాల దినుసులన్నీ మెత్తని పేస్టులా మిక్సి పట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లి గడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కారం, పుట్టగొడుగులు ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇందులో కప్పు నీళ్లు పోసి మధ్యస్తంగా ఉండే మంటమీద రెండు నిమిషాలు ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత మసాలా ముద్ద వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించి కొత్తిమీర చల్లితే సరి.
రాజ్మాతో..
కావాల్సిన పదార్థాలు : రాజ్మా- కప్పు, మష్రూమ్స్ – 200 గ్రా||, ఉల్లిగడ్డ – ఒకటి, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు, కారం- రుచికి తగినంత, పసుపు- చిటికెడు, దనియాల పొడి – అర చెంచా, గరం మసాలా – అర చెంచా, ఆమ్‌చూర్ పొడి – అర చెంచా, జీడిపప్పులు- ఆరు, పంచదార – చెంచా, జీలకర్ర- చెంచా, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- అర చెంచా.
తయారుచేసే విధానం : రాజ్మా గింజల్ని ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు నీళ్లు ఒంపేసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. బాణలిలో అరచెంచా నెయ్యి వేసి కరిగించి ఉల్లిగడ్డ ముక్కలు వేయించాలి. వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయాక దించి, కాస్త చల్లారాక అందులో టమాటా, జీడిపప్పు, ఉప్పు, కారం మిక్సీ జార్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత మరో కడాయిలో అరచెంచా నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, మష్రూమ్స్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ మిశ్రమం వేసి కలపాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. గ్రేవీలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి దించేస్తే సరిపోతుంది.
కుర్మా
కావాల్సిన పదార్థాలు : మష్రూమ్స్- రెండు కప్పులు, ఉల్లిగడ్డలు- రెండు, టమాటాలు- రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, కారం- రెండు చెంచాలు, మిరియాల పొడి- చెంచా, కొబ్బరిపాలు- అరకప్పు, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము – కొద్దిగా, నూనె – వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : మష్రూమ్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు, సగం ఉల్లిగడ్డ ముక్కలు, మిక్సీలో వేసి మెత్తని పేస్టులా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడయ్యాక మిగిలిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం వెల్లులి ముద్ద, కారం, టమాటా ముద్ద వేయాలి. తర్వాత మష్రూమ్ ముక్కలు కూడా వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత అందులో కొబ్బరిపాలు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం గ్రేవీగా తయారవుతుంది. ఇందులో కొత్తిమీర చల్లి ఒక నిమిషం కలిపి దించేస్తే సరిపోతుంది. వేడివేడి మష్రూమ్ కుర్మాను పలావు, రోటీలతో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది.