రాసేస్తే హాయిగా ఉంటది

రమాదేవి కులకర్ణి… కలం ఆమె నేస్తం.. కవిత్వం ఆమె ఆరాటం.. పుస్తకం ఆమె బంధువు… మనసుని కదిలించిన సంఘటనలను అక్షరాలుగా మార్చి కాగితంపై పెడితే ఆమె మనసుకు ఎంతో ప్రశాంతం. పిల్లలతో గడపడం ఆమెకు ఓ అపురూపం. ఓ ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపల్‌గా విద్యారంగంలో మార్పులను బలంగా కోరుకుంటున్నారు. దాని కోసమే ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
ఎప్పుడూ నిరాశ పడలేదు
టీటీసీ పోవడంతో బీఎడ్‌ ఎంట్రెన్స్‌ రాశాను. వంద ర్యాంక్‌ వచ్చింది. కానీ కాలేజీలో చేరే పరిస్థితి లేదు. అప్పటికే పెండ్లి అయ్యింది. ఆ తర్వాత హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ ఎంట్రన్స్‌ రాసాను. స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. అప్పుడు కూడా కాలేజీకి వెళ్ళలేకపోయాను. కానీ నా మీద నాకు నమ్మకం వుంది. అందుకే ఎక్కడా నిరాశ పడలేదు, వెనుకంజ వేయలేదు. తర్వాత అలహాబాద్‌ యూనివర్సిటీ వారి కరస్పాండెన్స్‌ కోర్స్‌ ట్రైనింగ్‌లో జాయిన్‌ అయ్యాను.
మార్పు రావాలి
పిల్లలు జాతి సంపద, విద్యా విధానంలో మార్పులు రావాలి. లేదంటే యువత ఇంకా ఇంకా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. తల్లి దండ్రులలో మార్పు రావాలి. అందుకే ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌గా పని చేస్తూ పిల్లలకు, యువతకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నైతిక విలువలు పసితనం నుంచే నేర్పాలి. అప్పుడే సమాజం బాగుపడుతుందనే గట్టి నమ్మకం నాకు. బోధన నాకు చాలా ఇష్టం. విద్యార్థులతో గడపడం ఒక అపురూపం. నా భర్త, పిల్లల సహకారంతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నా. పేద పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నాం. కరోనా కాలంలో ఎంతో మంది ఆకలి తీర్చగలిగాను.
నా బాల్యమంతా మెదక్‌లో గడిచింది. అమ్మ గిరిజమ్మ, నాన్న శంకర్‌రావు. పదవతరగతి పూర్తయ్యే సరికి నాన్న రిటైరయ్యారు. టెన్త్‌లో మంచి మార్కులతో పాసయ్యాను కానీ ఆర్థిక సమస్యలతో కాలేజీలో చేరలేకపోయాను. 15 ఏండ్ల వయసులో ఓ స్కూల్లో టీచర్‌గా చేరాను. నూట నలభై రూపాయల జీతం. కాలేజీలో పేరు ఉండేది కానీ నేను ఉండేదాన్ని కాదు. నా స్నేహితులంతా కాలేజీకి వెళ్తుంటే నేను స్కూలుకు వెళ్లి చిన్న పిల్లలకు చదువు చెప్పేదాన్ని. కాలేజీకి వెళ్లాలని ఉన్నా ఉద్యోగ రీత్యా కుదిరేది కాదు.
తెలుగంటే అమితమైన ప్రేమ 
పాత పుస్తకాలు తెచ్చుకుని నాకు నేనుగా చదువుకొని ఇంటర్మీడియట్‌ పూర్తి చేశా. అదేం విచిత్రమో మా ఇంట్లో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేం చాలా ఆనందంగా ఉండే వాళ్ళం. అమ్మా నాన్న ఎలా చేసే వాళ్ళో ఏమో… మాకు అర్థమయ్యేది కాదు. కాలేజీకి వెళ్ళకుండానే డిగ్రీ కూడా పూర్తిచేశా. దాంతోపాటు హిందీ పరీక్షలు కూడా రాస్తూ వచ్చాను. నా సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ. అయితే తెలుగంటే ప్రేమ, విపరీతమైన అభిమానం. నా ఆలోచనలన్నీ దొరికిన పేపర్స్‌ మీద రాస్తుండేదాన్ని. మా కాలేజీ ఫ్రెండ్స్‌ నందిని సిద్ధారెడ్డిసార్‌ గురించి చెప్తూ ఉంటే చాలా గొప్పగా ఉండేది. సార్‌ పాఠం వినాలని చాలా తపనగా ఉండేది. అప్పుడప్పుడు దొంగతనంగా వెళ్లి ఆయన క్లాసులు వినేదాన్ని. మా స్నేహితులతో పాటు నేనూ డిగ్రీ పూర్తి చేశాను. టీటీసీ ఎంట్రెన్స్‌ రాస్తే సీట్‌ రాలేదు. కాస్త బాధపడ్డాను.
బాధ నుంచి ఆలోచన 
బీఎడ్‌ తర్వాత డీఎస్సీ కోసం జనరల్‌ నాలెడ్జ్‌ నా కొడుక్కు చెప్తూ నేనూ గుర్తుంచుకునేదాన్ని. వాడే నా కంబైన్డ్‌ స్టడీమేట్‌. బాగా చదివి రాశాను. మంచి నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నాను. 1998 డీఎస్సీలో మంచి మార్కులు కూడా వచ్చాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. నేను కోర్సు చేసిన అలహాబాద్‌ యూనివర్సిటీ సర్టిఫికెట్‌ ఫేక్‌ అన్నారు. ఉద్యోగం రాలేదు, బాధపడ్డాను. కానీ ఆ బాధ నుంచి ఓ ఆలోచన వచ్చింది. నా సత్తా ఏంటో చూపించాలనుకున్నాను. ఇంగ్లీష్‌ నేర్చుకున్నాను. ఆ క్రమంలో చాలా అవమానాలు కూడా పడ్డాను. అయినా పట్టుదలగా నేర్చుకున్నాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే ఇంగ్లీష్‌ చేసాను. డిగ్రీ, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆంగ్లం పాఠాలు చెప్పాను. వందల మందికి స్పోకెన్‌ ఇంగ్లీష్‌ బేసిస్‌ తీసుకున్నాను.
సాహితీ ప్రస్థానం… 
నా సాహితీ ప్రస్థానం అనుకోకుండగా జరిగింది. చిన్నప్పటి నుంచి రాసేదాన్ని. ఏ చిన్న చిత్తుకాగితాలు దొరికినా, ఏ పుస్తకం దొరికినా దీక్షగా చదివేదాన్ని. ఎవరు మాట్లాడుతున్నా చక్కగా వినేదాన్ని. నా కవితలు పత్రికల్లో వచ్చేసి. 2014లో నాలోని అక్షరానికి గుర్తింపు లభించింది. నా పిల్లలు ఇద్దరూ నన్ను ‘నువ్వు ఇంత బాగా రాస్తావు కదా అమ్మా! నువ్వు ముందుకెళ్లు’ అని ఊతమిచ్చారు. ఫేస్బుక్‌ వచ్చిన తర్వాత అన్నీ అందులో పెట్టేదాన్ని. దీని ద్వారానే నాకు ఐడెంటిటీ వచ్చింది. సంటి అనిల్‌ కుమార్‌ ద్వారా సాహితీ సవ్వడి గ్రూపులో చేరాను. ఆట, గురజాడ ఫౌండేషన్‌ ద్వారా మొదటి బహుమతి అందుకున్నాను.
సాహిత్యం పట్ల ఆసక్తితో…
చాలా మంది ప్రముఖుల పరిచయాలు అయినంపుడి శ్రీలక్ష్మి ద్వారా కలిగింది. అక్షరయాన్‌ ప్రారంభంలో రంగారెడ్డి జిల్లా బాధ్యతలు చూశాను. కోవిడ్‌లో వీడియో కవితలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగలిగాను. కవితలు రాయడం ఎంత ఇష్టమో, వ్యాసాలు రాయడం కూడా అంతే ఇష్టం. సాహిత్యంపై ఉన్న అసక్తితో ‘కణిక’ను ప్రారంభించాను. ఇది సాహిత్య, సామాజిక, సేవ, విద్యారంగ వాట్సాప్‌ వేదిక. దీని ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. కణికకు బాసటగా ఎందరో సాహితీ వేత్తలు ఉన్నారు.
నేర్చుకోవల్సింది చాలా ఉంది
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ కవితా పురస్కారాలు అందుకున్నాను. గురజాడ ఫౌండేషన్‌ వారి జాతీయ స్థాయి పురస్కారం, 2017 ముంబైలో గురజాడ ఫౌండేషన్‌ వారిచే రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం, ఉగాది, సంక్రాంతి కవితా పురస్కారం, గజల్‌ లోగిలి, కాళోజి పురస్కారం ఇలా ఎన్నో అందుకున్నాను. నా ముద్రితాలు ‘రెప్పచాటుమౌనం’ కవిత సంకలనం, ‘అన్ని తెలిసిన అయ్యకు వందనం’. అముద్రితాలు ఒక్కసారి ఆలోచిద్దాము, రామ కథ (బాల గేయాలు), బాల సాహిత్యం, జానపద పాటలు, 2000పైగా కవితలు, గజళ్ళు… ఇంకా చాలా ఉన్నాయి. చాలా రాయించింది జీవితం. ఇంకా చదవాల్సింది, నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది. ఎంతటి బాధనై, ఆనందమైనా రాయాలనిపిస్తది. రాసేస్తే హాయిగా ఉంటది. ప్రసవం తర్వాత ఉండే హాయి అంతగా..!
– సలీమ 

Spread the love