ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి. కూరగాయలైతే చెప్పనవసరం లేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట ధర రూ.100 దాటింది. కొద్దిరోజుల్లో ఉల్లి కూడా కన్నీళ్ళు పెట్టించనుందని మార్కెట్ వర్గాల టాక్.. ఇదిలాగే కొనసాగితే రోజువారీ అవసరాలకేమీ కొనలేని పరిస్థితి రావచ్చు. అందుకే ఖర్చులను తగ్గించేందుకు ఇంట్లోనే కొన్ని రకాల మొక్కలను పెంచవచ్చు. ఇందుకు బాల్కనీ, కిటికీలను కూడా వాడొచ్చు. ఇంట్లో కూరగాయలు కట్ చేసిన తర్వాత పడేసే వ్యర్ధాలతోనే ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
అల్లం : చిన్న అల్లం ముక్క ఉంటే, దాన్ని మట్టిలో పెట్టండి. దీనికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండండి. తగినంత సూర్యరశ్మి తగిలేలా కిటికీ దగ్గర ఉంచండి. ఇలా చేస్తే ఒక వారం తర్వాత కొత్త మొలకలు వస్తాయి. మొక్క పెరిగి ఆకులు కాస్త ముదురు రంగులోకి మారుతుంటే అల్లం ఉపయోగించుకునేందుకు తయారైనట్లే..
వెల్లుల్లి : వెల్లుల్లి పెంచడం చాలా సులభం. ఇందుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మట్టిలో నాటాలి. వెల్లుల్లికి సూర్యకాంతి చాలా అవసరం. కాబట్టి దాన్ని రోజంతా ఎండ తగిలేలా ఉంచాలి. కొత్త వెల్లుల్లి రెబ్బల నుంచి మొలకలు వస్తాయి. ఆకుల రంగు మదురుగా మారుతుంటే లోపల వెల్లుల్లి గడ్డలు ఏర్పడినట్లే. జాగ్రత్తగా గమనించుకుని కాడలు కత్తిరించుకుని గడ్డలు తీయాలి.
పుదీనా : మార్కెట్‌కి వెళ్ళినపుడు పుదీనా తెచ్చుకుంటాం కదా.. ఆకులు గిల్లిన తర్వాత గట్టి కాడలను ఎంచుకుని మట్టిలో పాతాలి. కాస్తంత సూర్య రశ్మి తగిలేలా పెట్టాలి. క్రమంగా నీరు పోస్తుంటే వారం పది రోజుల్లోనే కొత్త ఆకులు మొదలవుతాయి.
కొత్తిమీర : ఇంట్లో దనియాలు వాడుతూనే ఉంటాం. మట్టి కాస్త తడిపొడిగా చేసి దనియాలు చల్లి పైన ఒక పొరలాగా మట్టిని చల్లాలి. రోజుకు రెండు సార్లు నీళ్ళు చిలకరించినట్లు తడి అయ్యేలా చల్లుతూ ఉండాలి. పది నుంచి పదిహేను రోజుల్లో కొత్తిమీర మొక్కలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటే మరో నెలలోపే వాడుకునే వీలుగా ఆకులు వస్తాయి