ఆదివారం కోసం ఎదురుచూస్తాం…

ఉద్యోగం చేసే వారు ఎవరైనా వారంతరం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆ రోజైనా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని. ఇక యువత గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరదాగా షికార్లకు ప్లాన్‌ చేసుకుంటారు. అలాగే పావని కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటుంది. కానీ విశ్రాంతి కోసమే, షికార్ల కోసమో కాదు… అనాథల ఆకలి తీర్చడం కోసం. ఇంత చిన్న వయసులోనే ఆకాశమంత మనసున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో…
హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది పావని. స్కూల్‌, కాలేజీ విద్య నగరంలోనే పూర్తి చేసిన ఆమెకు ఓ అన్న కూడా ఉన్నాడు. తండ్రి కుటుంబాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. దాంతో తల్లి ఒక్కటే బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తూ పిల్లలిద్దరినీ చూసుకునేది. పావనికి చిన్నతనం నుండి డాక్టర్‌ కావాలని కోరిక కానీ ఆర్థిక సమస్యలతో ఎంబీబీఎస్‌ చేయలేక సంగారెడ్డి కాలేజీలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. చిన్నతనం నుండి తల్లి తమ కోసం పడ్డ కష్టాలను చూస్తూ పెరిగింది. పూట గడవటానికి ఇబ్బండి పడిన రోజులను కూడా అనుభవించింది. కష్టం విలువ తెలిసిన ఆమెకు అనాథలకు, పేదలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియదు.
ఫౌండేషన్‌కు పునాది
తనలాగే చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి కడుపు నింపుకునేందుకు తిండి కూడా లేక ఇబ్బందులు పడ్డ సంజీవ్‌కుమార్‌ కుటుంబ మిత్రునిగా పరిచయమయ్యారు. ఇద్దరి ఆలోచనలు కలవడంతో పావనీ తల్లి కూడా ప్రోత్సహించడంతో తమ ఇంట్లోనే స్కై ఫౌండేషన్‌కు పునాది పడింది. కనీసం పది మందికైనా కడుపు నిండా తిండి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 2012లో ఆ ఫౌండేషన్‌ పారంభించారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పావనీ తన జీతం నుండి 30శాతం సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది.
స్వయంగా వండి
ఫౌండేషన్‌ ప్రారంభించిన మొదటి రోజు పావని వాళ్ళ ఇంట్లోనే పది మందికి సరిపడా అన్నం, పప్పు వండుకొని పొట్లాలు కట్టి రోడ్డుపక్కన ఉన్న వారికి ఇచ్చింది. తిండి కోసం వారు పడుతున్న బాధ, పొట్లం అందుకుని తినేటప్పుడు వారి కండ్ల నుండి వస్తున్న ఆనంద భాష్పాలను కండ్లారా చూసి చలించిపోయింది. తన ప్రయాణం ఎప్పటికీ ఆపకూడదని నిర్ణయించుకుంది. 2012 నుండి ప్రతి నెల రెండు, నాలుగవ ఆదివారాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 220 వారాలు ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంది. పది మందితో ప్రారంభమైన ఈ అన్నదానం ప్రస్తుతం ప్రతి వారం 250 మంది కడుపు నింపుతుంది. ఇప్పటికీ స్వయంగా వారే వంటలు చేసి వాలంటీర్స్‌ సహాయంతో ప్యాకింగ్‌ చేసి పంచుతున్నారు.
వైద్యం కూడా…
స్కై ఫౌండేషన్‌ ఆఫీస్‌ ముషీరాబాద్‌లో ఉంటుంది. అన్నం పొట్లాలతో అక్కడి నుండి ప్రారంభమైన వ్యాన్‌ సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, బేగంపేట్‌, అమీర్‌పేట్‌ చూసుకుని మళ్ళీ తిరిగి ట్యాంక్‌బడ్‌ మీదుగా ఆర్‌టీఎసీ క్రాస్‌ రోడ్‌ వరకు పంచుకుంటూ వస్తారు. కేవలం అన్నం పెట్టి ఊరుకోవడం లేదు. వారికి అవసరమైనపుడు వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అలాగే చలికాలంలో ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీన ఫుడ్‌పాత్‌పై ఉండేవారికి రగ్గులు కూడా పంచుతున్నారు.
ఆశా వర్కర్లకు సన్మానం
కరోనా సమయంలో ఆశా వర్కర్లు, నర్సులు, డాక్టర్లు సమాజానికి ఎన్నో సేవలు అందించారు. అలాంటి వారిలో సుమారు వంద మందిని పిలిచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సన్మానాలు చేశారు. కరోనా సమయంలో ఆధార్‌ కార్డు ఉన్నవారికే వాక్సిన్‌ ఇచ్చేవారు. మరి ఎలాంటి ఆధారం లేకుండా రోడ్డు పక్కన ఉన్నవారికి ఆధార్‌ ఎక్కడ ఉంటుంది. వాళ్ళకు వ్యాక్సిన్‌ ఎలా..? అనే ఆలోచన స్కై ఫౌండేషన్‌కి వచ్చింది. వెంటనే వారికి కూడా వ్యాక్సిన్‌ ఇప్పించాలని పావని బృందం ప్రధానికి ట్విట్‌ చేశారు. ఎలాంటి స్పందన రాలేదు. దాంతో స్థానిక వైద్య అధికారులు, డీఎంహెచ్‌ఓ అధికారులను పదే పదే కలిసి వినతిపత్రాలు సమర్పించారు. చివరకు 200 మందికి వ్యాక్సిన్లు స్వయంగా ఇప్పించారు. అలాగే లాక్‌డౌన్‌ ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అన్నదానం చేశారు.
300 మంది స్వచ్ఛంద కార్యకర్తలు
మొదట ఇద్దరితో ప్రారంభమైన ఈ ఫౌండేషన్‌ ప్రస్తుతం 300 నుండి 350 మంది కార్యకర్తలను తయారు చేసుకుంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ ఎప్సీ కాలేజీ నుండి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ఎక్కువగా వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పావనికి తోడుగా సుమారు 40 మంది అమ్మాయిల బృందం తోడయింది. అలాగే వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో చూసి కొందరు స్వచ్ఛంధంగా వచ్చి పాల్గొంటున్నారు. చూసి కొంత మంది వచ్చి వర్క్‌ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జులై నెలలో ఓ ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకుని ఆ నెలలో పుట్టిన ఆ స్కూల్‌ పిల్లలతో కేక్‌ కటింగ్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఆ నెలల సంజీవ్‌కుమార్‌ పుట్టిన రోజు. అలాగే బాలల దినోత్సవం నాడు అనాథ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తున్నారు. రాఖీ పండుగ నాడు రోడ్లపై నివసించే వారికి రాఖీలు కడుతున్నారు. స్కై ఫౌండేషన్‌ కార్యక్రమాలు కేవలం హైదారాబాద్‌కే పరిమితం కాదు జనగాం, భువనగిరిలో కూడా జరుగుతున్నాయి.
అనాథలకు ఆశ్రమం కల్పించాలి
రోడ్డుపై ఏ ఆధారం లేకుండా బతికే వారికి ఒక ఆశ్రమం కల్పించాలి. వారికి కావల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఏదైనా ఉపాధి చూపించాలని ఉంది. నేను ప్రస్తుతం ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాను. గవర్నమెంట్‌ జాబ్‌ కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం వస్తే నా భవిష్యత్‌కు మంచిది. అలాగే సేవా కార్యక్రమాలు కూడా బాగా చేయవచ్చు. ప్రస్తుతం మాకు బయట నుండి వచ్చే ఫండ్స్‌ చాలా తక్కువ. సంజీవ్‌కుమార్‌ గారు వారికి వచ్చే సంపాదనలో ఎక్కువ శాతం ఫౌండేషన్‌ కార్యక్రమాలకే ఖర్చుపెడతారు. నేను మాత్రం నా జీతంలో 30శాతం ఖర్చుపెడుతున్నాను. బయటి ఫండ్స్‌ వస్తే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయవచ్చు. ప్రపంచానికి మా పేర్లు తెలియకపోయినా స్కై ఫౌండేషన్‌ అంటే చాలా అందరికీ తెలుసు. మంచి క్వాలిటీ ఫుడ్‌ పెడతారు అనే పేరు ఉంది. ప్రతి నెల రెండు, నాలుగవ ఆదివారం అన్నదానం ఉంటుంది. మిగిలిన రెండు ఆదివారాలు బట్టలను సేకరించి నిరాశ్రయులకు ఇస్తుంటాం. మరీ పాత బడినవి ఇస్తే తీసుకోము. కనీసం వాళ్ళు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే తీసుకుంటాం. ఇలా సేవా కార్యక్రమాలు చేయడం, నలుగురి కడుపు నింపిడం చాలా సంతోషంగా ఉంది. మా ఫౌండేషన్‌లో వాలంటీర్స్‌గా చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. వారి వీలును బట్టి ప్రతి వారం 10 నుండి 20 మంది వరకు వస్తుంటారు. మేమందరం ఆదివారం కోసం ఎదురుచూస్తుంటాం.
– పావని

– సలీమ

Spread the love