ప్రేమతో ఏదైనా జయించవచ్చు

సేవ చేయాలనే తపన గొప్పది. అందులోనూ జీవితాన్నే త్యాగం చేసి సేవకే అంకితం కావాలనే సంకల్పం మరింత గొప్పది. స్వార్థంతో నిండిపోయిన సమాజంలో మంచి మాటకై, ఒక ప్రేమ పూరిత పలకరింపుకై తపించి పోతున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తన చిరునవ్వుతో, ప్రేమగా దగ్గరకు వెళ్లి వారి సాధక బాధలు తెలుసుకుని మాటలతో ధైర్యాన్ని నింపి, కొత్త జీవితాన్నీ సంతోషంగా స్వాగతించేలా చేస్తున్నారు డా.చిన్మయి తమ్మారెడ్డి. ఆమె గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో…
మనిషికి జీవితంలో ప్రధానంగా కావాల్సింది మానసిక స్థైర్యం. అది కొరవడిన నాడు ఎన్నో చెడు ఆలోచనలు మెదడులోకి దూరతాయి. వాటి ద్వారా జీవితం అంటే భయపడి పోయి, ఆత్మవిశ్వాసం కోల్పోవడం సహజం. చివరకి చావే శరణ్యం అనుకున్న వారిని మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఇటు వంటి సంఘటనలు చూసి చిన్మయి చలించిపోయేవారు. వారి జీవితాలను నిలబెట్టాలని తపించేవారు. వారికి జీవితంపై ఆశ కలిగించాలి అనే ఆలోచన వచ్చిందే తడవుగా ప్రభుత్వ పాఠశాలలు, చుట్టూ ప్రక్కల గ్రామాలకు వెళ్లి కౌన్సెలింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు.
సామాజిక సేవాభావాలున్నందున ప్యాషన్‌ డిజైనింగ్‌ పట్ల అభిరుచి ఉన్నప్పటికీ తనకు తగిన చదువు అది కాదనుకున్నారు. సేవతోనే ఎదుటివారి జీవితాలలో వెలుగును నింపవచ్చనే ఆలోచనతో బీఏ సైకాలజీ చదివారు. ఇంకా విద్యా ర్హాతలు పెంచుకోవాలని, దాని వల్ల మనుషుల మానసిక స్థితిగతులు బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అని అమెరికా విశ్వవిద్యాలయల నుండి ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, లైఫ్‌ కోచింగ్‌ డిప్లొమాలు పూర్తి చేశారు.
సేవకే అంకితం
చిన్నతనం నుండి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకునే మనస్తత్వం ఆమెది. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా, బాధ అనిపించినా వాటిని వదిలేసి సంతోషంగా ఉండే జోన్‌లోకి వెళ్తుంటారు. ఈ లక్షణాలు స్వతహాగా వచ్చినవే అవడం వలన వీటితో ఎదుటి వారి జీవితాలు సరిదిద్దడం కోసమే ఆమె పుట్టి ఉండవచ్చు. తన మాటలు, చిరునవ్వుతో ఎన్నో వేల కుటుంబాలను నిలబెట్టారు. తన సేవలకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో చివరకు వివాహం కూడా చేసుకోలేదు. మోటివేషన్‌ కోసం కౌన్సెలింగ్‌ అవసరం ఎందరికో ఉండవచ్చు. కానీ ఆర్ధిక పరిస్థితుల రీత్యా వారు కౌన్సెలింగ్‌కి వెళ్లలేక పోతున్నారు. అటు వంటి వారికి ఉచితంగా సేవలు అందిస్తారు. గ్రూప్‌ మోటివేషనల్‌ క్లాస్సెస్‌ చేపడుతూ ఉంటారు. షీ టీమ్స్‌, భరోసా వారి కోసం ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌ చేస్తూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలకు మోటివేషనల్‌ క్లాస్సెస్‌ చెప్తూ ఉంటారు. నేటి సమాజంలో పిల్లలు తల్లి తండ్రుల మాటలను వినకుండా, వివిధ ఆకర్షణలకులోనై అనేక సమస్యలు కొని తెచ్చు కుంటున్నారు. అటువంటి వారికి పరిస్థితులను బట్టి జీవితాన్ని ఎలా మలుచుకోవలో, మనం చేసే పనులు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, స్వీయ నియంత్రణ ఎలా సాధించవచ్చు అనే వాటి గురించి వివరించి చెప్తారు.
అనేక మానసిక రుగ్మతలతో…
ప్రతి మనిషి ముందుగా తనని తాను ప్రేమించు కోవాలి. అలాగే పిల్లలను ప్రేమగా పెంచాలి. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. ఈ మధ్య కాలంలో విపరీత ధోరణులతో వ్యక్తులు జీవిస్తున్నారు. బలాత్కారాలు, హత్యలు, ప్రేమ పేరుతో వంచననలకు గురిచేయడం, యాసిడ్‌ దాడులకు ఒడిగట్టుతున్నారు. ఇలా అనేక రకాల మానసిక రుగ్మతలు కలిగిన వారి గురించి మనం వింటున్నాము. కొందరిని చూస్తున్నాము. సమాజం ఎటు పోతోంది.? ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు.? ఇటువంటి దుర్ఘటనలు కొనసాగకుండా ఉండలంటే ముందుగా యువతలో మార్పు తీసుకురావాలని ప్రేమతో చెప్తే ఎవరైనా సరే ఈరోజు కాకపోయిన ఏదో ఒకరోజు తప్పక వింటారనే విశ్వాసంతో యువతకు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.
బాధ్యత తీసుకోవాలి
పిల్లలను ఎప్పుడు ఒక కంట కనిపెట్టి ఉండాలని, చదువు ఒక్కటే కాదు వారికి ఇష్టమైన వ్యాపకాలలో కూడా ప్రోత్సాహం అందించాలని ఆమె అంటున్నారు. ఎప్పుడు మొబైల్‌ ఫోన్లు చూడటం, కంప్యూటర్ల ముందు కూర్చోవడం సరైనది కాదని ఆమె గట్టిగా చెబుతున్నారు. వారిని ఇష్టమైన వ్యాపకాలలో బిజీగా ఉండేలా చూసే బాధ్యత తల్లి తండ్రులదే అని అంటున్న చిన్మయి సినీ ప్రముఖులు మనీషా కోయిరాలా, జగపతిబాబు, ఈషా డియోల్‌, సురేఖ వంటి వారికి కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Spread the love