అన్నంతో ఇష్టంగా…

స్కూళ్లు మొదలయ్యాయి. చిరుతిళ్ళ విషయంలో పిల్లల మారాం తెలియనిది కాదు. పిల్లల లంచ్‌ బాక్స్‌లు తల్లులకు పెద్ద సవాల్‌. వాళ్ళు ఇష్టపడేలా ఆహారం ఏ విధంగా చేసి పెట్టాలా అని రోజూ సతమతమవుతూనే ఉంటారు. అంతేకాదు, చిరుతిళ్ళకు అలవాటు పడి అన్నం తినడంలో నిరాసక్తత చూపిస్తుంటారు కూడానూ. తినే ఆహారం టేస్టీగా, వెరైటీగా ఉంటేనే ఇష్టపడతారు. లేదంటే తినడమే మానేస్తారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు సరైన ఆహారం అందించేలా… రోజుకో వెరైటీ అన్నాన్ని వారి బాక్స్‌లో సర్దితే ఇష్టంగా తింటారు.. అవి ఎలా చేయాలో చూద్దామా..
ఆలూ రైన్‌
కావల్సినవి పదార్ధాలు : బియ్యం – రెండు కప్పులు, ఆలూ – మూడు (పెద్దవి), పచ్చిమిర్చి – నాలుగు, కొత్తిమీర – మీడియం కట్ట, ఇంగువ – అర చెంచా, ఆవాలు – అర చెంచా, జీలకర్ర – చెంచా, నెయ్యి – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా
మసాలా కోసం : ఎండుమిర్చి – మూడు, ధనియాలు – రెండు చెంచాలు, శెనగపప్పు – రెండు చెంచాలు, మెంతులు- అరచెంచా, నువ్వులు- అరచెంచా
తయారు చేసే విధానం : బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండుకుని పళ్లెంలోకి మార్చి చల్లారనివ్వాలి. ఆలూని ఉడికించి చల్లారాక పొట్టుతీసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చిన్న కడాయిలో ఎండుమిర్చి, ధనియాలు, సెనగపప్పును వేయించి తర్వాత మెంతులు, నువ్వులు కూడా చేర్చి వేయించి దించేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తని పొడి చేసుకోవాలి. తర్వాత మందపాటి గిన్నెలో నాలుగు చెంచాల నెయ్యి వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, ఆలూ ముక్కలు వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. కాసేపయ్యాక అందులో కొత్తిమీర తురుము, తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి మూత పెట్టాలి. ఆరేడు నిమిషాలయ్యాక ఇది కూరలా తయారవుతుంది. ఇందులో చల్లార బెట్టు కున్న అన్నం వేసి కలియ తిప్పితే ఆలూ అన్నం సిద్ధమ యినట్టే. దీన్ని రైతాతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.
గోంగూర అన్నం
కావల్సిన పదార్థాలు : బియ్యం – రెండు కప్పులు, గోంగూర – రెండు కట్టలు (చిన్నవి), ఉల్లిగడ్డలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, ధనియాల పొడి – అరచెంచా, జీలకర్ర – చెంచా, ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా
తయారు చేసే విధానం : ముందుగా అన్నం వండుకొని అందులో ఉప్పు కలిపి పళ్లెంలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. గోంగూర ఆకులు తుంచి కడిగి.. సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేయించాలి. అందులో గోంగూర వేసి మూతపెట్టాలి. గోంగూర మెత్తగా మగ్గాక అన్నం కూడా చేర్చి సన్ననిమంటపై కలపాలి. అన్నం కూడా బాగా వేడయ్యాక దింపేయాలి.

ఫ్రైడ్‌ రైస్‌
కావలసిన పదార్ధాలు : నూనె – రెండు చెంచాలు, బియ్యం – రెండు కప్పులు, సోయా చంక్స్‌ (మీల్‌ మేకర్‌) – అరకప్పు, తరిగిన సోయా బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడలు – రెండు, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసాలా – రెండు చెంచాలు, జీడిపప్పు – పదిహేను
తయారు చేసే విధానం : బియ్యాన్ని కడిగి అన్నం కాస్త పొడిపొడిగా వండుకోవాలి. సోయా చంక్స్‌ను మూడు నాలుగు నిమిషాలు కాస్త గోరు వెచ్చని నీటిలో వేసి నాననివ్వాలి. నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాస్త వేడయ్యాక ఉల్లికాడలు వేసి కొంచెం వేయించాలి. తర్వాత బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు, జీడిపప్పు వేయిస్తూ కాస్త మద్యస్తంగా మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు, సోయా చంక్స్‌ వేసుకుని ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి మొత్తం కలిపి పైన కాస్త మసాలా చల్లి బాగా కలపాలి. వేడివేడి ఫ్రైడ్‌ రైస్‌ రెడీ.
కరివేపాకు రైస్‌
కావలసిన పదార్థాలు : కరివేపాకు – కప్పు, బియ్యం – ఒకటిన్నర కప్పులు, కొబ్బరిపొడి – అరకప్పు, పచ్చిమిర్చి – నాలుగు, ఎండుమిర్చి- రెండు, సొంటి పొడి – అర చెంచా, జీలకర్ర, ఆవాలు- చెంచా చొప్పున, ఉల్లిగడ్డ – ఒకటి (సన్నగా తరిగి ఉంచుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా, జీడిపప్పు – పది, ఉప్పు – తగినంత, నూనె – తగినంత
తయారు చేసే విధానం : బియ్యాన్ని పొడిపొడిగా ఉండేలా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో చెంచా నూనె వేసి జీడిపప్పు, కొబ్బరి తురుము, కరివేపాకును వేర్వేరుగా వేయించుకోవాలి. వెంటనే కరివేపాకును పాడిచేసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో మరికొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, సొంటి పొడి చేర్చాలి. దీనిలో అన్నం, కరివేపాకు పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. అన్నం కొంచెం వేడయ్యాక తగినంత ఉప్పు చేర్చి దింపాలి. అంతే నోరూరించే కరివేపాకు ఫ్రైడ్‌ రైస్‌ తయారవుతుంది.
ఉసిరికాయ రైస్‌
కావల్సిన పదార్థాలు : ఉసిరికాయలు – ఏడు, కొబ్బరి తురుము – అరకప్పు, పచ్చిమిర్చి – నాలుగైదు, ఉప్పు – తగినంత, నూనె – ఒక చెంచా, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర – అర చెంచా చొప్పున, పల్లీలు – అరగుప్పెడు, ఎండుమిర్చి – మూడు, ఇంగువ – కొద్దిగా, కరివేపాకు రెబ్బలు – నాలుగు, పసుపు – పావు చెంచా, అన్నం- రెండున్నర కప్పులు.
తయారు చేసే విధానం : ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా తరగాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, ఇంగువ వేసి వేయించాలి. అందులో కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడాక ముందుగా చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలు, కొబ్బరి మిశ్రమాన్ని చేర్చాలి. పచ్చివాసన పోయే వరకు సన్న మంట మీద కలుపుతూ ఉండాలి. ఇందులో అన్నం వేసి కలిపి, ఉప్పు చూసుకుని దించేస్తే సరి..

Spread the love