ఓ మారుమూల పల్లెటూరు.. నిరుపేద కుటుంబం.. సరైన మైదానమే లేదు.. ఆటలో ఓనమాలు నేర్పేవాళ్లు లేరు. ఇలాంటి చోట నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత జట్టుకు ఎంపిక అవుతుందని ఎవరూ ఊహించరు. అయితే బారెడ్డి మల్లి అనూషకు ఇది సాధ్యమయింది. బంగ్లాదేశ్ పర్యటించే భారత సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. ఆశలే లేని చోట అసలు క్రికెటర్ ఎలా పుట్టిందో తెలుసుకుందాం…
అనంతపురం జిల్లా, నార్పల మండలం, బండ్లపల్లి గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పుట్టింది అనూష. పేదరికం వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అసలు ఆటల్లో వచ్చే పరిస్థితి కాదామెది. క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా.. ఎలా నోర్చుకోవాలో.. ఎక్కడ నేర్చుకోవాలో కూడా తెలీదు. అయితే ఆమె చదువుకున్న పాఠశాలలో పీఈటీ రవీంద్ర ప్రోత్సాహంతో క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. మొదట పేస్ బౌలింగ్ చేసేది. బ్యాటింగ్ లోనూ మంచి పట్టు సాధించింది. అన్నిటికిమించి ఫీల్డింగ్‌లో అదరగొట్టేది. తోటి అమ్మాయిలు ఫీల్డింగ్ చేయడానికి భయపడుతుంటే బెదురులేకుండా డైవ్‌లు కొట్టి క్యాచ్‌లు అందుకునేది. క్రికెట్లో రాణిస్తూనే ఆర్థికంగా ఇబ్బందులతో రోజువారీ కూలీగా పని చేసేది.
కెరీర్‌లో కీలక మలుపు
2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీ నిర్వహించిన టోర్నీలో బండ్లపల్లి పాఠశాల తరఫున తన సత్తా చాటుకుంది అనూష. ఆ అకాడమీలో ఆడే అవకాశాన్ని పొందింది. ఇదే ఆమె కెరీర్‌లో కీలక మలుపు. ఇక్కడ చేరిన తర్వాత బౌలింగ్‌పైనే ఆమె దృష్టి పెట్టింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు మంచి అవకాశాలు ఉండడంతో పేస్ నుంచి స్పిన్‌కు మారింది. ఆంధ్ర అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. 2018 చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ టోర్నీతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనూష మ్యాచ్ మ్యాచ్‌కు పురోగతి సాధిస్తూనే వుంది. 2019లో ఎన్‌సీఏ శిబిరానికి ఎంపిక కావడంతో అనూషకు మరింత మంచి సౌకర్యాలు, కోచింగ్ లభించాయి. 2021లో బీసీసీఐ సీనియర్ వన్డే టోర్నీలోనూ ఈ స్పిన్నర్ తన ముద్ర వేసింది. రాజస్థాన్, బెంగాల్, హైదరాబాద్, జట్లపై మెరుగైన ఆట ఆడింది.
అసలు ఊహించలేదు
”భారత జట్టుతో కలిసి ఆడతానని అసలు ఊహించలేదు. ఒకప్పుడు పేదరికంతో కూలికి వెళ్లిన నేను దేశం తరఫున ఆడుతున్నానంటే నమ్మలేకపోతున్నా. ఆర్డీటీ అకాడమీ, ఆంధ్ర క్రికెట్ సంఘం అండ వల్లే ఈ స్థితిలో ఉన్నా. ఎస్‌సీఏ శిక్షణ వల్ల ఎంతో మెరుగయ్యా. బంగ్లాదేశ్ పర్యటనలో సత్తా చాటుతాననే నమ్మకంతో ఉన్నా. బౌలింగ్, బ్యాటింగే కాదు ఫీల్డింగ్ అంటే ఎంతో ఇష్టం” అంటుంది అనూష.
రవీంద్ర జాడేజాలా…
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో సౌత్‌జోన్‌కు ఆడుతూ ఈస్ట్‌జోన్‌పై అనూష గొప్ప ఆట ఆడింది. బరోడాలో జరిగిన మ్యాచ్‌లో త్రిపురపై 10 పరుగులకే 5 వికెట్లు పడగొట్టింది. హాంకాంగ్‌లో జరిగిన మహిళల వర్ధమాన క్రికెటర్ల కప్‌లో భారత్-ఏకు ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. అదే జోరుతో సీనియర్ జట్టులోనూ స్థానాన్ని సంపాదించింది. క్యాచ్‌లు పట్టడమే కాదు మెరుపు రనౌట్‌లు చేసే అనూష రవీంద్ర జడేజా అభిమాని. అతడిలాగే ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాలని కోరుకుంటోంది.