కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెండ్లంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. ప్రతి భార్యా తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటుంది. భర్త కూడా అంతే. అయితే నేడు వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. దీని వల్ల ఎన్నో జంటలు విడిపోవల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమస్యతోనే దీపిక ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది.
కుమార్ మీరు తాత్కాలిక సంతృప్తి కోసం మీ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. అనవసరంగా సమస్యలు పెంచుకుంటున్నారు. రేపు ఆమె భర్త వస్తే ఏం చేస్తారు. అప్పుడు సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
బిజినెస్‌లో నష్టం వచ్చినప్పుడు నేనే కాదు మా కుటుంబం మొత్తం ఆయనకు సహాయం చేసింది.
ఆయన ఉద్యోగం చేసి సంపాదించింది ఆయన అప్పులకే సరిపోతుంది. నాకు వచ్చిన జీతంతోనే పిల్లల్ని చదివించుకుంటున్నాను. నేను ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవడం చాలా కష్టం. అందుకే చేస్తున్నాను. నేను వేరే ప్రాంతాలకు వెళ్ళడం కుమార్‌కి ఇష్టం లేకపోతే మానేస్తానని ముందే చెప్పాను. జాబ్ చేసేందుకు ఆయనే ఒప్పుకున్నాడు.
ఇప్పుడు నాకు టైం ఇవ్వడం లేదని అంటున్నాడు.
చాలా మంది ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోలుస్తూ ఉంటారు. భాగస్వామి తాను ఆశించినట్లుగా లేకపోతే అసంతృప్తితో ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు. రహస్యంగా ఉన్నంత వరకు ఎలాంటి సమస్యా ఉండదు. అవి బయట పడ్డప్పుడు కాపురాలు కూలిపోతున్నాయి. అలా దీపిక కూడా తన భర్త నుండి విడాకులు కావాలని ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
దీపిక, కుమార్‌లది ప్రేమ వివాహం. కుమార్ వాళ్ళ ఇంట్లో ఒప్పించి దీపికను పెండ్లి చేసుకున్నాడు. దీపిక ఇంట్లో వాళ్ళు పెండ్లయిన మూడేండ్లకు ఒప్పుకున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. వారికి ఇద్దరు పిల్లలు. పెండ్లయి 20 ఏండ్లు గడిచిపోయింది. దీపిక చేసే ఉద్యోగరీత్యా నెలలో వారం రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. కుమార్‌కు నైట్ షిఫ్ట్ ఉంటుంది. తన ఆఫీసులో పని చేసే ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. మొదట కేవలం ఆఫీసులో మాత్రమే మాట్లాడుకునే వారు. తర్వాత ఫోన్‌లో చాట్ చేయడం మొదలు పెట్టాడు. మరి కొన్ని రోజులకు నైట్ డ్యూటీ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఆమెను తీసుకుని బయట కూడా తిరిగేవాడు. దీపిక లేనప్పుడు పిల్లలతో ఉండకుండా ఆమె దగ్గరకే వెళ్ళడం మొదలుపెట్టాడు.
పిల్లలకు తోడుగా దీపిక తల్లిని ఇంట్లో పెట్టి వెళ్ళిపోయేవాడు. ఆమె లేకపోతే వాళ్ళను ఇంట్లోనే పెట్టి బయట తాళం వేసి వెళ్ళేవాడు. గత ఐదేండ్ల నుండి ఇలానే జరుగుతుంది. ఇదంతా గమనించిన దీపిక తోటి కోడలు ‘నీవు వేరే ఉద్యోగం చూసుకో. కుమార్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది’ అని దీపికను హెచ్చరించింది. కానీ అప్పట్లో ఆ మాటలు ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఒక రోజు కుమార్ ఆమెతో ఫోన్ మాట్లాడుతుంటే దీపిక విన్నది. భరించలేక పోయింది. భర్త ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తట్టుకోలేకపోయింది. దాంతో తోటి కోడలిని వెంటబెట్టుకొని భర్త నుండి విడాకులు ఇప్పించమంటూ ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది.
విషయం మొత్తం తెలుసుకున్న లీగల్ సెల్ సభ్యులు కుమార్‌ని పిలిపించి మాట్లాడితే ‘నాకు ఎవరితో సంబంధం లేదు. నేను దీపికను ప్రేమించి పెండ్లి చేసుకున్నాను. నాపై అనవసరంగా నిందలు వేస్తున్నారు’ అన్నాడు.
‘మీరు మాకు నిజం చెబితేనే మీ జీవితం, మీ పిల్లల జీవితం బాగుంటుంది. లేకపోతే మీతో పాటు మీ పిల్లల జీవితం కూడా పాడుచేసిన వారవుతారు. పిల్లలు చిన్న వాళ్ళేం కాదు. మీ ప్రవర్తన ఇలా ఉంటే మీ నుండి వాళ్లేం నేర్చుకుంటారు. మీది ఉమ్మడి కుటుంబం. మీ పిల్లలతో పాటు మీ అన్నయ్య, తమ్ముడి పిల్లలు కూడా ఉన్నారు. నిజం చెబితేనే మేము దీపికతో మాట్లాడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆమె మీకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అన్నారు లీగల్ సెల్ సభ్యులు.
దాంతో అతను కంగారు పడి ‘దీపిక ఉద్యోగం చేస్తున్నా నన్ను అర్థం చేసుకోదు. నేను ఉద్యోగంతో పాటుగా బిజినెస్ కూడా చేస్తాను. అందులో
నష్టం వచ్చింది. దాంతో దీపిక, వాళ్ళ అమ్మ కలిసి నన్ను తిట్టారు. ఆ సమయంలో మా ఆఫీసులో ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేసింది. అప్పుడే కాదు నాకెప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆమె నాకు డబ్బులు ఇస్తుంది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. పైగా ఆమె భర్త కూడా ఇక్కడ ఉండడు. వేరే రాష్ట్రంలో ఉంటాడు. ఆమె ఒక్కతే పిల్లలను చూసుకుంటుంది. అలాంటి ఆమెకు నేను తోడుగా ఉన్నాను. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీపిక ఉద్యోగం అంటూ నన్ను, పిల్లలను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళుతుంది. ఆమె లేని లోటు ఈమె తీరుస్తుంది. ఇందులో తప్పేముంది’ అన్నాడు.
దానికి దీపిక ‘అంతా అబద్దం మేడమ్, బిజినెస్‌లో నష్టం వచ్చినప్పుడు నేనే కాదు మా కుటుంబం మొత్తం ఆయనకు సహాయం చేసింది. ఆయన ఉద్యోగం చేసి సంపాదించింది ఆయన అప్పులకే సరిపోతుంది. నాకు వచ్చిన జీతంతోనే పిల్లల్ని చదివించుకుంటున్నాను. నేను ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవడం చాలా కష్టం. అందుకే చేస్తున్నాను. నేను వేరే ప్రాంతాలకు వెళ్ళడం కుమార్‌కి ఇష్టం లేకపోతే మానేస్తానని ముందే చెప్పాను. జాబ్ చేసేందుకు ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు నాకు టైం ఇవ్వడం లేదని అంటున్నాడు’ అంటూ బాధపడింది.
దాంతో లీగల్ సెల్ సభ్యులు ‘కుమార్ మీరు తప్పు చేస్తూ కూడా మీ తప్పేం లేనట్టు మాట్లాడుతున్నారు. తాత్కాలిక సంతృప్తి కోసం మీ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. అనవసరంగా సమస్యలు పెంచుకుంటున్నారు. రేపు ఆమె భర్త వస్తే ఏం చేస్తారు. అప్పుడు సమస్యలు మరింత ఎక్కువవుతాయి. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళంతా బాగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే మీ వదినె విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా విడాకులు తీసుకుంటా నంటున్న దీపికకు నచ్చజెప్పడానికి మా దగ్గరకు తీసుకొచ్చింది. మిమ్మల్ని మార్చి ఇద్దరినీ కలపాలని మీ వదిన కోరుకుంటుంది. ఇలాంటి కుటుంబం ఉండడం మీ అదృష్టం. రేపు ఈ విషయం మీ ఇంట్లో అందరికీ తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి’ అన్నారు.
దీపికతో ‘మీరు వెంటనే వేరే ఉద్యోగం చూసుకోండి. కుటుంబం కోసం కష్టపడుతున్నారు. కానీ సంతోషంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఆలోచించి మీరిద్దరూ ఓ మంచి నిర్ణయం తీసుకోండి. మీ భర్తకు కొంచెం సమయం ఇవ్వండి. అయినా ఆయనలో మార్పు రాకపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచించండి’ అని చెప్పి ఇద్దరినీ పంపించారు.
నెల తర్వాత దీపిక లీగల్‌సెల్‌కు వచ్చి ‘కుమార్‌లో చాలా మార్పు వచ్చింది. ఆమెతో మాట్లాడటం మానేశాడు. మా బావగారు ఆమెను వేరే ప్రాంతానికి బదిలి చేయించారు. నేను కూడా వేరే ఉద్యోగం చూసుకున్నాను. ఇప్పుడు మేము మా పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నాం. మీరు చెప్పకపోతే ఆవేశంలో నిర్ణయం తీసుకునేదాన్ని. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకునేదాన్ని’ అని చెప్పి సంతోషంగా వెళ్ళింది.
– వై. వరలక్ష్మి, 9948794051