విద్యావనంలో విరబూసిన కుసుమం

పచ్చని విద్యావనంలో విచ్చుకున్న నిండు కమలం ఎలా ఉంటుంది..? తన దరికి చేరేవారందరినీ ఆప్యాయతతో ఆహ్వానిస్తున్నట్లు, మమకారంతో ఆదరిస్తున్నట్లుగా ఉంటుంది. అలాగే ఆమెను చూడగానే ఇలాంటి భావనే కలుగుతుంది. ఉన్నత ఆశయం కోసం ముందుకెళుతున్న విద్యాలయంలో చదువుల తల్లి కొలువు తీరిందా అనిపిస్తుంది. సందిగ్ధావస్తల్లో సరైన సమాధానం కోసం వెతుకున్నప్పుడు సమాధానమే మన దరికి చేరిందా అనే భావన కలుగుతుంది. ఆమె మరెవరో కాదు. ఓయూ విద్యావనంలో ఉస్మానియా విశ్యవిద్యాలయ పరీక్షల విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ హోదాలో విధులు నిర్వహిస్తున్న ప్రొ.వర్ధని.
తన, పర తారతమ్యం చూపరు. చిన్నా పెద్దా అనే హోదాకు పోరు. విద్యార్థులందరూ తనవాళ్లే, ప్రతిఒక్కరూ తన పిల్లలే అనుకుంటారు. ఎంతో ఓర్పు, మరెంతో నేర్పూ రెండింటినీ మిళితం చేసుకుని అవిరళ సేవా ధృక్పథాన్ని చాటడం ప్రొ.వర్ధినిలోని ప్రత్యేకం. అనేకమైన అర్హతలు, అపారమైన అనుభవాలను తన జీవన గమనంతో పాటు ఒంటబట్టించుకున్నారు. రాబోయే తరాలకు ఓ నారీ కిరణంలా ముందుకు దూసుకుపోతున్నారు. మేటి మహిళా అధ్యాపకురాలిగా అందరి మన్ననలు చూరగొంటున్న విద్యార్థుల శ్రేయోభిలాషి ఆమె.
అధ్యాపకురాలిగా…
ఎందరో సామాన్యులను అసమాన్యులుగా, మరెందరో వ్యక్తులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఉస్మానియా యూనివర్సిటీ గాలి తాకితే చాలు అని భావించే వారు ఎంతో మంది. అలాంటిది ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం కొనసాగించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను పూర్తి చేసుకుని.. ఇదే యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా జీవితాన్ని ప్రారంభించిన ప్రొఫెసర్‌ వర్ధని, నేడు రీసెర్చ్‌ వింగ్‌ అయిన కాన్ఫిడెన్సియల్‌ విభాగం పరీక్షల విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషమనే చెప్పాలి.
నిత్యం విద్యార్థులతో…
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1995లో పీహెచ్‌డీ పట్టా అందుకోకముందు నుంచే బోధనా రంగంలోకి ప్రవేశించారు వర్థని. 1990 నుంచి 2007 వరకు ఏఎమ్మెస్‌ మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. తర్వాత కోటి మహిళా కళాశాలలో 2007 నుంచి 2015 వరకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, 2015 నుంచి 2019 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. 2019 నుంచి ఓయూ ఫిజిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ పీహెడీ కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో అదనపు పరీక్షల పర్య వేక్షణా అధికారిగా… వేలాది మంది విద్యార్థులు తమ రీసెర్చ్‌ పూర్తి చేసుకుని, పీహెచ్‌డీ పట్టా అందుకోవడంలో ఎనలేని తోడ్పాటునందిస్తున్నారు. నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వేల మంది విద్యార్థులు తమ పీహెచ్‌డీలను పూర్తి చేసుకునేందుకు కావాలసిన సహాయ సహకారాలను అందిస్తున్నారంటే.. విద్యార్థుల పట్ల ఆమెకున్న అంకిత భావం, చిత్తశుద్ధిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ సెమినార్లలో…
ఇప్పటి వరకు దాదాపు పది మందికి పైగా విద్యార్థులు ప్రొ.వర్ధని ఆధ్వర్యంలో తమ రీసెర్చ్‌ అధ్యయనాన్ని పూర్తిచేశారు. అమెరికా, చైనా, జపాన్‌, నేదర్లాండ్స్‌ వంటి వివిధ దేశాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌ల్లో పాల్గొన్న ఆమె అనేక ప్రజెంటేషన్స్‌తో తన పరిశోధనా ఫలాలను, తన విజ్ఞానాన్ని విద్యార్థి లోకం కోసం విశ్వవ్యాప్తం చేశారు.
ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌గా…
పరహితార్ధ సేవే పరమార్థం అని దృఢంగా విశ్వసించే ప్రొ.వర్ధని అటు సేవారంగంలోనూ తన వంతు కృషి చేస్తూ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌గా 2005లోనే ఇందిరాగాంధీ జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. అంతేకాదు ఈ దేశంలోనే ఈ అవార్డును గెలుచుకున్న ఏకైక మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2015లో వాసవి క్లబ్‌ వారి ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు, 2015లో ఎన్‌ఆర్‌సీ ఇండియా ఐఐటీ చెన్నై వారి అవార్డు ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, అలాగే 2017లో ఎన్‌ఆర్‌సీ ఇండియా ఐఐటీ ముంబై వారి అవార్డు ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆమె వృత్తికి మరింత వన్నె తెచ్చాయని.
కీలక పాత్రను పోషిస్తూ…
ఏపీఏఎస్‌ అసోషియేట్‌ ఫెల్లోగా, అమెరికాలోని ఐఈఈఈ పొటానిక్స్‌ సొసైటీ సభ్యురాలిగా, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, కొల్‌కత్తా సభ్యురాలిగా, ఎస్సార్సీ గవర్నింగ్‌ బాడీ సభ్యురాలిగా ఇలా ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ సైన్స్‌ కమిటీల్లో, ఆయా విభాగాల్లో కీలక పాత్రను పోషిస్తూ విశ్వమానవ విపణిపై తన విజ్ఞాన సుగంధాలను వెదజల్లుతూనే ఉన్నారు. కాలంతో పాటు పరుగెడుతూ.. విధులు, బాధ్యతలను నెరవేరుస్తూ.. నిత్యం తన వద్దకు వచ్చే విద్యార్థులకు ఎంతో ఓపిగ్గా సమాధానం చెబుతూనే… అనేక మంది విద్యార్థుల పరిశోధన పత్రాలకు సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేస్తూనే ఉన్నారు. ఎంతో సహనంతో.. మరెంతో సుమధుర మందహాసంతో… అలుపెరుగని వదనంలో అనునిత్యం విరబూసే చిరునవ్వు చాలదా…ఆమె ఓ ఫ్రెండ్లీ ప్రొఫెసర్‌ అని చెప్పడానికి.
– కుంట సురేష్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌
అతిపెద్ద ప్రాజెక్టుతో…
నానో మెటీరియల్స్‌ పొటానిక్స్‌, నానోపొటానిక్స్‌ అంశంపై పరిశోధన పూర్తి చేసిన ప్రొ.వర్థని ఓయూలోనే 59 లక్షల రూపాయల అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టిన మొట్టమొదటి అధ్యాపకురాలు కావడం మరో విశేషం. దీంతో పాటు పొటానిక్స్‌ రీసెర్చ్‌ కోసం డీఆర్‌డీవో నుంచి 50 లక్షల రూపాయలను అందుకున్న ఏకైన మహిళ కావడం నిజంగా విశ్వవిద్యాలయానికే కాదు దేశానికే గర్వకారణం. 2017 నుంచి 2022 వరకు సైన్స్‌ కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారిణిగా పనిచేసిన ఆమె దేశంలోనే జాతీయ అవార్డును పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

Spread the love