తులసీ చందు…
ప్రశ్నించడమే ఆమె చేస్తున్న నేరం… నిజాన్ని నిర్భయంగా చెప్పడమే ఆమె చేస్తున్న ఘోరం… ప్రజా సమస్యలపై స్పందించమంటూ పాలకులను కోరడమే ఆమె చేస్తున్న పాపం.. అందుకే దేశద్రోహి అయ్యింది. హిందూ వ్యతిరేకి అయ్యింది. మతతత్వ శక్తుల నుండి వేధింపులు ఎదుర్కొంటున్నది. వారు చంపుతామంటూ బెదిస్తున్నా ‘జర్నలిజం ఎప్పుడూ మౌనంగా వుండదు’ అంటూ ధైర్యంగా నిలబడ్డది. ‘నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తప్పైతే ఆ తప్పు మళ్ళీ చేద్దాం’ అంటూ జర్నలిజానికి అసలైన నిర్వచనంగా నిలిచిన ఆమెకు అండగా నిలబడదాం రండీ…
ఒక్క తులసి మాత్రమే కాదు ఇక్కడ ప్రశ్నించే గొంతులన్నీ దేశద్రోహులే. గత తొమ్మిదేండ్ల నుండి దేశంలో ఇలా ఎన్నో గొంతులు అణిచి వేయబడుతూనే వున్నాయి. మతోన్మాద బీజేపీ పార్టీ అధికారికంగా జీతాలు ఇచ్చి ఓ ముఠాను ఈ ట్రోలింగ్ కోసం ఏర్పాటు చేసుకుంది. వాస్తవాలను బయట పెట్టిందని కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను ఏకంగా హత్య చేసి తమ అక్కసును వెళ్ళగక్కారు. మరీ ముఖ్యంగా మహిళలపై ఈ ముఠా వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు బయటకు వచ్చి ప్రజా సమస్యలపై గొంతు విప్పడాన్ని మదమెక్కిన పురుషహంకారం, పిచ్చెక్కిన మత ఉన్మాదం సహించలేకపోతుంది. జాతీయ మీడియా ప్రతినిధులతో పాటు ఎంతో మంది సామాజిక కార్యకర్తలు ఈ ముఠా దాడులకు గురవుతూనే ఉన్నారు. ఇందులో మన రాష్ట్ర మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు.
టార్గెట్ చేసి మరీ…
కొంత కాలం కిందట సామాజిక సమస్యలపై పని చేస్తున్న ముస్లిం మహిళలను సోషల్ మీడియా సాక్షిగా అత్యంత దారుణంగా వేధించారు. సుల్లీ భారు, బుల్లీ భారు పేరిట వారి ఫొటోలు పెట్టి అసభ్యమైన కామెంట్లు పెట్టారు. అందులో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కార్యకర్త ఖలీదా పర్వీన్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ సామాజిక, మహిళా ఉద్యమ కార్యకర్తలు దేవి, సజయ, సంధ్య ఇలా ఎంతో మంది ఈ ట్రోల్ ముఠా దాడులను నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానిని మన దేశంలో మైనార్టీలపై చూపుతున్న వివక్ష గురించి ప్రశ్నించినందుకు వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ సబ్రీనా సిద్దికీని సైతం పాకిస్తానీ అంటూ వేధిస్తున్నారు.
అసభ్య పదజాలంతో…
ఇప్పుడు తులసీ వంతు…. ఇప్పుడే కాదు గత ఏడాది నుండి ఈమెపై ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆమె తన ఛానల్ ప్రారంభించిన కొత్తలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ‘మతం వస్తుంది మిత్రమా మేలుకో’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇక అప్పటి నుండి ఆమెపై ట్రోలింగ్ ముఠా దాడి మొదలయింది. మానసికంగా వేధించారు. దాంతో వెనక్కు తగ్గుతుందని భ్రమించారు. కానీ తులసి వాటిని ఎదుర్కొంటూ ఓ జర్నలిస్టుగా గొంతులేని వారికి గొంతుగా నిలబడింది. దాంతో ఉన్మాదులు మరింతగా రెచ్చిపోయారు. ”దానికి సన్మానం చేయాలి. సన్మానం అంటే పూలదండలతో కాదు, దాని మర్మావయంలో నాలుగు గునపాలు గుచ్చాలి”… ఇలా బయటకు చెప్పుకోలేని అత్యంత ఘోరమైన పదజాలంతో దూషిస్తున్నారు.
ఉత్తమ ఛానల్‌గా గుర్తింపు
తులసికి తెలుగు మీడియాలో 15 ఏండ్ల అనుభవం ఉంది. ఐదు సార్లు లాడ్లీ మీడియా అవార్డు అందుకుంది. యునిసెఫ్ వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ఆమెకు దక్కాయి. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజాసమస్యలను ప్రపంచానికి చాటిచెబుతున్నది. ఆ యూట్యూబ్ వీడియోలకు అరుణ్ సాగర్ యంగ్ జర్నలిస్ట్ అవార్డు, పుట్ల హేమలత అవార్డును కూడా అందుకున్నది. అకాడెమీ వారి గ్రాఫీ సెలెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఆమె యూట్యూబ్ ఛానెల్ దేశంలో రాబోయే 50 ఉత్తమ ఛానెల్‌లలో ఒకటిగా ఎంపిక చేయబడింది.
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మతోన్మాదంపై ప్రశ్నలు లేవనెత్తడంతో మతోన్మాదులు కొందరు గత ఏడాది కూడా ఇలాగే ట్రోల్ చేయడంతో 2022, జనవరి 6న సైబర్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్‌లో తులసి ఫిర్యాదు చేసింది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని కూడా చెప్పింది. దీనికి స్పందించిన కేటీఆర్ ”సోషల్ మీడియా సంఘ వ్యతిరేక ప్రవర్తనకు అడ్డాగా మారడం అవమానకరం, అది కూడా గౌరవనీయులైన జర్నలిస్టులకు వ్యతిరేకంగా… ఈ దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని” అంటూ ట్వీట్ కూడా చేశారు. కానీ ఫలితం శూన్యం. మళ్ళీ వాళ్ళు తమ దాడిని మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఏకంగా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
ప్రశ్నించే గొంతులను కాపా డుకోవల్సిన బాధ్యత మనందరిపై వుంది. మంచిని సమాధి చేసి చెడుకు ప్రాణం పోయాలని చూస్తున్న వారిని తరిమికొట్టాలి. తులసిని కాపాడుకోవడం అంటే ఓ వ్యక్తిని కాపాడుకోవడం కాదు. దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం. మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడం అని అందరూ గుర్తెరిగి ఈ సామూహిక ఉద్యమంలో భాగస్వాములు కావాలి. అభ్యుద యవాదులు, ప్రజాస్వామిక వాదులు తులసికి అండగా నిలబడాలి. మతతత్వ శక్తుల చర్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి ఉద్యమించాలి.
– సలీమ
చూస్తూ ఊరుకోలేను
అడిగితే దేశ ద్రోహి, ధర్మ ద్రోహి, హిందూ వ్యతిరేకిని అయ్యాను. వారి మాటలతో నన్ను మెజార్టీ ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు. దేశంలో ఈ రోజు అందరికంటే దయనీయ పరిస్థితి సగటు సామాన్య హిందువులది. గతంలో ప్రభుత్వాలపై కోపమొస్తే గట్టిగా రోడ్లపైకి వచ్చి నిలదీసే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మతోన్మాద పార్టీలను ప్రశ్నిస్తే మీకు చాలా కష్టం కలుగుతోంది. కోట్లాది మంది యువత కండ్ల ముందు మతం మత్తులోకి జారుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకనే నా పరిధిలో నేను చెప్పాల్సినవి చెప్తున్నాను. మత విద్వేషాలు ఏ దేశయువతకైనా అత్యంత ప్రమాదకరం అని నేను చెప్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు. నా ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానివ్వండి. ఏదో ఒక రోజు రాలిపోతాను, బలైపోతాను. నా బిడ్డలకు, భర్తకూ అన్యాయం చేసినదాన్నవుతాను. నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేని నా తల్లికి అన్యాయం చేసినదాన్నవుతాను. కానివ్వండి. అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను, ఏకాకిగొంతును రికార్డు చెయ్యనివ్వండి.
– తులసీ చందు
సామూహికంగా ఎదుర్కొందాం
ట్రోలింగ్ కొత్త కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటూనే వున్నాము. అత్యంత ఘోరమైన పదాలు వాడుతున్నారు. లం… ముం… అనే పదాలను వాడి నీచంగా ట్రోల్ చేస్తున్నారు. నాపైనా ఇలాంటి దాడులు జరుగుతూనే వున్నాయి. గతంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. కేసు పెట్టిన తర్వాత చర్యలు తీసుకోకపోతే వాళ్ళు మరింత రెచ్చిపోతారు. అందుకే ముందు తులసి కూడా కేసు పెట్టడానికి వెనకడుగు వేసింది. అందుకే వీటిని నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బీజేపీ ప్రభుత్వం ట్రోలింగ్ చేసేందుకు ఓ ప్రత్యేక ముఠాను ఏర్పాటు చేసుకుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మనం కూడా దీన్ని ఓ సమూహంగా ఎదుర్కొందాం.
– సి.వనజ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు
ప్రస్తుతం ట్రోలింగ్ చేయడానికి ఓ పెద్ద వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం యువతనే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళను గ్రూపులుగా విభజించి కొందరితో పాజిటివ్ పోస్టులు, కొందరితే నెగిటివ్ పోస్టులు, మరికొందరిని వ్యక్తులను దూషించే పోస్టులు పెట్టడానికి నియమించుకున్నారు. ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏమిటంటే ఇవన్నీ ప్రభుత్వ ధనంతో జరుగుతున్నాయి. చెబుతున్న వాస్తవాల గురించి ఏమీ మాట్లాడలేక వ్యక్తులపై దాడులు చేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థను ఎదుర్కోవాలంటే మనం మరింత ఐక్యంగా ఉండాలి.
– ప్రొ||పద్మజాషా