‘దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుంది’ అన్నారు ప్రముఖ విద్యావేత్త కోఠారి. అయితే ఇక్కడ తరగతి గది అంటే నాలుగ్గోడలు కాదు. ఆ గదిలో కూర్చునే విద్యార్థులు, పాఠ్యపుస్తకాలు, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు. ఇవన్నీ సరిగా ఉంటేనే విద్యార్థులు విద్యను అభ్యసించగలరు. భవిష్యత్తూ నిర్మితమవుతుంది. నాణ్యమైన విద్య అందినప్పుడే యువతలో సామాజిక విలువలు, చైతన్యం, ఆర్థికవృద్ధి సాధ్యమవుతుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా విద్యాభివృద్ధి మిగిలిన అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడువారాలు గడిచిపోయింది. కానీ విద్యాసంస్థల్లోని సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. విద్యారంగం పట్ల మన ఏలికల నిబద్ధతకు ఇదో ఉదాహరణ.
ఏడాదికేడాది విద్యారంగానికి బడ్జెట్‌లో కోతలు విధిస్తున్నారు. మన రాష్ట్రంలో అయితే కేవలం 6.57శాతం మాత్రమే విద్యారంగానికి కేటాయిస్తున్నారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో 1200 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య రాష్ట్రంలో 21శాతంగా ఉంది. వీటిలో 95శాతం ప్రాథమిక పాఠశాలలే. దేశ వ్యాప్తంగా కూడా సింగిల్ టీచర్ పాఠశాలలు పెరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సంక్షేమశాఖల పరిధిలోని గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 30,723 ఉండగా వీటిలో 6,392 బడులు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయి. టీచర్ల కొరత ఇంతగా ఉంటే ఇక విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది!
సగం పాఠశాలలకు సరిపడా తరగతి గదులు, మంచినీటి సౌకర్యాలు లేవు. ఇక మరుగుదొడ్ల సౌకర్యం లేక అమ్మాయిలు మంచినీళ్ళు తాగడమే మానేశామని చెప్పడం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. ఆటస్థలంలేని పాఠశాలలు 12వేల వరకు ఉన్నాయి. ఇక మధ్యాహ్న భోజన పరిస్థితి దారుణంగా ఉంది. నాణ్యతలేని తిండితో పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తా మన్నారు. దీనికోసమే గురుకుల విద్యాసంస్థలను కూడా ప్రారంభించారు. అవి మాత్రమే నేటి విద్యావసరాలను తీర్చగలవా? అవి కూడా కొంత మేరకే పని చేస్తున్నాయి. అక్కడా సౌకర్యాల కొరత కొనసాగుతూనే ఉంది.
ఇక విద్యాశాఖలో ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఏండ్ల తరబడి ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి. 607 మండలాలలకు 17మంది ఎంఈఓలు మాత్రమే ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓల వంటి ప్రధాన పోస్టులు ఎక్కువ శాతం ఇన్‌చార్జ్జీలతోనే నడుస్తున్నాయి. దాంతో విద్యా బోధన పర్యవేక్షణ కష్టంగా మారిందని సంబంధిత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షకు పైగా ఉపాధ్యాయులు, సుమారు 26లక్షలకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల విద్యా విభాగంలో కనీస పర్యవేక్షణ కరువైంది.
కాలేజీలు ప్రారంభమై నెల పూర్తి కావస్తున్నది. అయినా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. ఇంటర్‌బోర్డ్ అధికారులు ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చినా తెలుగు అకాడమీ సకాలంలో స్పందించలేదు. దాంతో పుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా చదవాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కేజీబీవీ, ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో సుమారు లక్షమంది వరకు ఇంటర్ చదువుతున్నారు. కాలేజీ ప్రారంభమైన రోజే పుస్తకాలు ఇస్తామంటూ గొప్పలు చెప్పారు. కానీ 25రోజులు గడిచినా ఇప్పటికీ అందించలేకపోయారు.
రాష్ట్రంలో యూనివర్సిటీల్లోనూ బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఒక్కో వర్సిటీలో సగటున ఖాళీలు 73శాతం ఉన్నాయి. గత సెప్టెంబర్ నుండి నియామకాల మండలి బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. చివరకు బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఇలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పట్ల వివక్ష చూపుతుంది. ఫలితంగా విద్యార్థుల బంగారు భవిత ప్రశ్నార్థకంగా మారింది.
మొత్తంగా విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మరోపక్క ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై రాష్ట్రాలను పక్కనపెట్టి కేంద్రం పెత్తనం చేస్తున్నది. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు శాస్త్రీయ విద్యను దూరం చేస్తున్నది. విద్యా విధానం ఇలా ఉంటే దేశ భవిష్యత్ ఎలా ఉంటుందో పౌరసమాజం ఆలోచించాలి. ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలను పరిశీలించి, సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.