రుణ భార(త)o

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదంటూ మన ప్రధాని అవకాశం దొరికన ప్రతిచోట ఊదరగొడుతున్నాడు. అదే సమయంలో దేశం అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేస్తున్నది. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రం చేసిన అప్పులు 150శాతం పెరిగాయని అప్పుల చిట్టాను బయటపెట్టింది. ఇక రాష్ట్రాల అప్పు ఏకంగా 200శాతం పెరిగిందని తేలింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! దీన్ని బట్టి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ప్రగతి సాధించిన రంగం ఏదైనా ఉంది అంటే అది ‘రుణ రంగం’ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ అప్పుల వల్ల దేశం మౌలిక వనరుల పరంగానో, అభివృద్ధి పరంగానో ఏమైనా సాధించిందా అంటే అదీ లేదు.
ఈ అప్పుల వెనుక ఉన్న అసలు కారణాలు పరిశీలించాలి. 2016 నవంబర్‌లో అకస్మాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. మరుసటి ఏడాది జులైలో హడావుడిగా తీసుకొచ్చిన జీఎస్టీ మరింత దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. దీన్నుండి బయటపడేందుకు అప్పుల మీద అప్పులు చేయాల్సి వచ్చింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 62శాతం అప్పులున్నాయని కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించింది. ఇది 152లక్షల కోట్లకు సమానం. ఈ రుణ భారం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతున్నదా అంటే అదీ లేదు. 2019-20లో ఏకంగా నాలుగు శాతానికి పతనమైంది.
అయితే ఆర్థిక సంక్షోభానికి కారణం కరోనా అని ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. నిజమే… కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వాల సామర్థ్యానికి కరోనా ఒక పెద్ద పరీక్ష పెట్టింది. అటువంటి సంక్షోభంలోనూ ప్రజలను సమస్యల నుంచి తప్పించే విధంగా విధానాలను రూపకల్పన చేయటం, ఉపశమన చర్యలను కల్పించటం పాలకుల బాధ్యత. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్నది స్పష్టం. అసలు మన ఆర్థికవ్యవస్థ పతనానికి కరోనానే కారణమా అనే విషయాన్ని పరిశీలించాలి. కొన్ని గణాంకాలు చూస్తే కరోనా కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారటం మొదలైందని స్పష్టమవుతున్నది.
2018 జనవరి నుంచే భారత్‌ వృద్ధి క్రమంగా పడిపోవటం మొదలైంది. యేటా దేశ జీడీపీ వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. గతేడాది ఉన్న వృద్ధి ఈయేడు లేదు. రెండేండ్ల కింద ఉన్నంత గతేడాది లేదు. ఈ అంతరం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని ఐఎంఎఫ్‌ వంటి ఆర్థికసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకపక్క మౌలిక వసతులు, మానవ వనరులు సరిగాలేని బంగ్లాదేశ్‌ వంటి చిన్న దేశం కూడా నైపుణ్యం లేని మానవ వనరులనే పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా ముందంజ వేస్తున్నది. కార్మికులు అవసరమయ్యే వస్త్ర ఉత్పత్తిపై దృష్టిపెట్టి ఎగుమతుల్లో దూసుకుపోతున్నది. వస్త్ర పరిశ్రమలోకి మహిళలు భారీ సంఖ్యలో వచ్చేలా ప్రోత్సహించింది. కానీ మన దేశంలో మహిళలను పారిశ్రామికోత్పత్తిలో భాగస్వాముల్ని చేయడం కన్నా వాళ్లు ఏ మతం వాళ్లను పెండ్లి చేసుకుంటున్నారు? ఎటువంటి దుస్తులు ధరిస్తున్నారు? అన్న విషయాలు ప్రధానమైపోయాయి. అంతర్జాతీయంగా పేరున్న థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ 2018లో విడుదల చేసిన (ప్రపంచంలో మహిళల భద్రతపరంగా అత్యంత ప్రమాదకర దేశాలు) జాబితాలో భారత్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. అంటే మన దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
ఇదే సమయంలో మోడీకి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తల ఆస్తులు ఎంతగా పెరిగిపోయాయో చూస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి. 2020 లెక్కల ప్రకారం ముఖేశ్‌ అంబానీ ఆస్తులు 350శాతం, గౌతమ్‌ అదానీ ఆస్తులు ఏకంగా 700 శాతం ఇవి పెరిగాయి. ఈ మూడేండ్లలో మరింత పెరిగాయి. కరోనా సైతం వీరి వృద్ధిని ఏ మాత్రం అడ్డుకోకపోవటం వైచిత్రి. తెచ్చిన అప్పుల్లో సగానికి పైగా ఇలాంటి కార్పొరేట్ల రాయితీలకే ఖర్చు చేస్తుంటే వాళ్ల ఆస్తులు పెరగవా మరి! ఈ విధంగా దేశాన్ని రుణభారతంగా మార్చింది మోడీ ప్రభుత్వం. లేదంటే దేశంలో మౌలిక సౌకర్యాలను పెంచటానికో, ఏవైనా భారీ ప్రాజెక్టులు ప్రారంభించటానికో ఈ అప్పుల్ని ఉపయోగించారా వీరు? ఈ తొమ్మిదేండ్లలో కొత్తగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లేవు, నెలకొల్పిన భారీ పరిశ్రమల్లేవు. నిరుద్యోగాన్ని తగ్గించింది లేదు. ప్రజల ఆదాయాన్ని పెంచిందీ లేదు. పేదోళ్ళ కడుపు కొట్టి కార్పొరేట్లకు పెట్టడంలో మన పాలకులకు మించినవారు లేరు. సామాన్యుల జీవితాలను మరింత హీనస్థితికి దిగజారుస్తున్నది మోడీ ప్రభుత్వం. ఇప్పటికైనా మతోన్మాద రాజకీయాలను పక్కనపెట్టి సామాన్యుల జీవితాలను మెరుగుపరచాలి. దేశాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అప్పుల ఊబి నుంచి దేశాన్ని కాపాడాలి.

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదంటూ మన ప్రధాని అవకాశం దొరికన ప్రతిచోట ఊదరగొడుతున్నాడు. అదే సమయంలో దేశం అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేస్తున్నది

Spread the love