ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి…

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. కేజీ నుంచి పీజీ వరకు సమస్యలతో సతమతమవుతున్నది. ఇదే సందర్భంలో ప్రయివేటు, కార్పోరేట్‌ విద్యాసంస్థలు మాత్రం బలోపేతమవుతున్నవి. సరైన నాణ్యతా ప్రమాణాలు లేకున్నా ఇష్టానురీతిలో ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నవి. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రయివేటు పాఠశాలలో నర్సరీకి రూ.40వేల నుంచి మొదలుకుంటే స్కూల్‌ను బట్టి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ దీన్ని పర్యవేక్షించే నాథుడు లేడు. ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని విద్యార్థి సంఘాలు ఎన్నో రోజులుగా డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేట్‌ వర్గాలకు కొమ్ముకాస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం పాఠశాలల పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌లోనూ దేశంలో మన రాష్ట్రం 31స్థానంలో ఉంది. విద్యలో నాణ్యతా ప్రమాణలు పాటించడంలో వెనుకబడింది. విద్యా రంగానికి ప్రభుత్వం కేటాయించే నిధులు అరకొరగా ఉండగా కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చుపెట్టిన పరిస్థితి. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉంది.
రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 26లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగతా 40లక్షల విద్యార్థులు ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. కేసీఅర్‌ ప్రభుత్వ మొదటి దఫా పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని కారణం చూపి సుమారు నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. దీంతో పేదవర్గాలకు ప్రాథమిక విద్య భారమైంది. మరిన్ని పాఠశాలలను మూసివేయాలనే ధోరణి ప్రభుత్వంలో కనపడుతోంది. మొత్తంగా ఈ ఎనిమిదేండ్ల పాలన చూసినట్టయితే పాఠశాల విద్యకు కేటాయించింది అరకొర బడ్జెట్‌యే. ఆ నిధులు కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. అందుకే పాఠశాలల్లో చాలావరకు శిథిలావస్థకు చేరాయి. అలాగే కనీస వసతులులేవు. విద్యార్థులు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్‌, టాయిలెట్స్‌, మంచినీటి వసతులు మృగ్యమనే చెప్పాలి. ఈ విద్యాసంవత్సరం స్వచ్ఛ కార్మికులు లేకపోవడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే తరగతి గదులను ఊడ్చుకుంటున్న పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తయిన యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు పూర్తిగా విద్యార్థులకందనేలేదు. ‘మన ఊరు మనబడి’ పథకం కింద ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించగా, దీంతో పాఠశాలల రూపురేఖలు మారుతాయని అనుకుంటే నిధుల విడుదలలో జాప్యం కనబడుతోంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభమైనా సగంపనులే జరిగాయి. రాష్ట్రంలో సుమారుగా 26వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాలు ఖాళీలున్నాయి. కనీసం బడులను పర్యవేక్షించే డీఈఓలు, ఎంఈఓలు కూడా లేరంటే మన విద్యారంగం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ విద్య పూర్తిగా ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థల్లో బంధీ అయింది. ఉద్యమ కాలంలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు తెలంగాణలో ఉండవని మాట్లాడిన పాలకులు నేడు వాటిని అన్ని జిల్లాల్లో విస్తరించడానికి అనుమతులిస్తున్నారు. రకరకాల పేర్ల మీద లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడుతూ, కనీస ప్రమాణాలు లేకుండా విద్యాసంస్థలు నడుపుతున్నా యాజమాన్యలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేస్తున్నా అధికారుల పట్టింపు లేదు. ప్రభుత్వం గొప్పగా చెపుతున్న గురుకులాలకు కూడా సొంత భవనాలు లేవు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎండకు ఎండి, వానకు తడిసి చలికి వణికే పరిస్థితి ఉంది. పౌష్టికాహారమైతే అందని ద్రాక్షగా మారింది.
ఉన్నతవిద్యకు కేంద్రాలైన విశ్వవిద్యాలయాలు నేడు సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయనేది వాస్తవం. అన్ని విశ్వవిద్యాలయాల్లో సుమారు రెండు వేల ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో విభాగాలు మూతపడే పరిస్థితి దాపురించింది. కొన్ని డిపార్ట్‌మెంట్స్‌ కాంట్రాక్ట్‌ పార్ట్‌ టైం లెక్చరర్లతో నడుస్తున్నాయి. పీజీ సెంటర్స్‌, డిగ్రీ కళాశాలలో కూడా ఆధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం కళాశాలలో ఒకరిద్దరు పూర్తి కాలం అధ్యాపకులున్నారు. మిగతా అంతా కాంట్రాక్ట్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీతోనే కళాశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉన్నత విద్యకు కేటాయించే నిధులు కేవలం అధ్యాపకులకు జీతాలివ్వడానికి సరిపో తున్నాయి. సరిపడా నిధులు లేకపోగా వివిధ కోర్స్‌ ఫీజులు భారీగా పెంచారు. దీంతో పేద సామాన్య విద్యార్థులు చదువుకోవడం గగనమవుతున్నది. గత నాలుగేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.5,117 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు పూర్తిగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు నేడు పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌ఛార్జీలు పెంచలేదు. రీసెర్చ్‌ చేసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫెలోషిప్‌ సహకారం లేదు. ఘనమైన చరిత్ర కలిగిన ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు కూడా నేడు సమస్యలతో బోసిపోతున్నాయి. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో అట్టడుగు పేద వర్గాలకు ప్రభుత్వ విద్య రోజురోజుకూ దూరమవుతున్నదనేది స్పష్టమవుతున్నది. ప్రయివేటు, కార్పొరేట్‌ వర్గాలు విద్య పేరుతో తల్లిదండ్రులను దోచుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఓవైపు, ప్రయివేటు ఫీజుల దోపిడీ మరోవైపు విద్యారంగ అభివృద్ధిని అడ్డుకుంటున్నది. అందుకే విద్యారంగాన్ని పరిరక్షించాలని, పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లు, లెక్చరర్ల పోస్టుల ఖాళీలను భర్తీచేయాలని నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించతలపెట్టడం జరిగింది. దీనికి అన్నివర్గాల ప్రజలు, విద్యార్థులు సంపూర్ణ మద్దతు ప్రకటించి జయప్రదం చేయాలి.
ఆర్‌.ఎల్‌.మూర్తి
8257672658

Spread the love