పేదల కోసమే నిరంతరం పోరాడుతాం

– సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
– బీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి సీపీఐ(ఎం) ప్రజాసంఘాల్లోకి.. భారీగా చేరిక : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-హన్మకొండ
హన్మకొండ నగరంలో పేదల కాలనీల అభివృద్ధి, పట్టాలు వచ్చేంత వరకు సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు మంద మల్లేశం ఆధ్వర్యంలో హన్మకొండలోని భగత్‌ సింగ్‌ కాలనీకి చెందిన సుమారు 200 కుటుంబాలు గురువారం రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల్లోకి చేరాయి. వారికి ఆ పార్టీ కండువా కప్పి సీపీఐ(ఎం)లోకి జిల్లా కార్యదర్శి, కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి, సారంపల్లి వాసుదేవరెడ్డి, ఎం.చుక్కయ్య, టి.ఉప్పలయ్య ఆహ్వానించారు. ఈ సందర్భంగా సారంపల్లి వాసుదేవ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో చక్రపాణి మాట్లాడారు. ఎనిమిదేండ్ల కిందట బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పేదలకు అనేక భ్రమలు కల్పించి వారిని పార్టీలో చేర్పించుకున్నారని, వారంతా ఇప్పుడు తిరిగి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా.. పేదలపై భారాలు మోపడంతో పాటు నిరుద్యోగం, పేదరికం, ధరలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ పేరుతో పేదలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులపై పన్నులు వేసిందని, బడాబాబులు ఉపయోగించే విలాస వస్తువుల ధరలు తగ్గించిందని విమర్శించారు. దేశభక్తి ముసుగులో ప్రభుత్వ సంస్థలని కార్పొరేట్‌ వ్యక్తులకు అమ్మేస్తున్నారని అన్నారు. వీటిపై ప్రజల దృష్టిని మరల్చడం కోసం కులం, మతం పేరుతో వైషమ్యాలు సృష్టిస్తున్నారని తెలిపారు. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా ప్రకటించారని, అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం మంటగలుస్తుందని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోత్‌ వీరన్న, గొడుగు వెంకట్‌, మంద సంపత్‌ నార్త్‌ ఏరియా కార్యదర్శి గాదె రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love