ప్రభుత్వ పాఠశాలల్లో అంతరాలు లేని విద్య

– వాటి బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
ప్రభుత్వ పాఠశాలల్లోనే అంతరాలు లేని విద్య అందుతుందని, ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ జాతీయ నేత, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మాజీ కన్వీనర్‌ దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతి సభ గురువారం యాదాద్రి- భువనగిరి జిల్లా యాదాద్రి క్షేత్ర విల్లా ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలన్నారు. విద్య ద్వారా విద్యార్థులకు సంపూర్ణ వికాసం కలగాలని, సామాజిక, మానసిక, శారీరక అభివృద్ధి జరగాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సమాజానికి అవసరమైన అంతరాలు లేని విద్య అందుతోందని, ప్రజాస్వామ్యయుత వాతావరణం కల్పించబడుతుందని చెప్పారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచుకునే అవకాశం కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి ఉపాధ్యాయులు ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి కనీసం 18 మంది విద్యార్థులు ఉండే విధంగా కృషి చేయాలని, పాఠశాలల రీఆర్గనైజేషన్‌ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యమాన్ని జాతీయస్థాయికి విస్తరించి విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పూర్వ అధ్యక్షులు దాచూరి రామిరెడ్డి స్ఫూర్తి ఉద్యమానికి ఎంతో అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ డీఏ వెంటనే ప్రకటించాలని కోరారు. ప్రమోషన్ల కోసం తప్పనిసరి చేసిన టెట్‌ నిర్వహణపై సర్వీస్‌లో ఉన్న టీచర్ల ఆందోళనపై వివరణ ఇచ్చి సందేహాలను తొలగించాలన్నారు. టెట్‌ నుంచి సర్వీస్‌ టీచర్లను మినహాయించాలని,సాధ్యాసాధ్యాలు చూడాలని కోరుతూ ఎమ్మెల్సీ నేతృత్వంలో ఎన్‌సీటిఈకి ప్రాతి నిధ్యం చేయడానికి ఢిల్లీ వెళుతున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఎప్పటికప్పుడూ రిలీజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.టీఎస్‌ యూటీఎఫ్‌ నిర్వహిస్తున్న కుటుంబ సంక్షేమ నిధి ఉపాధ్యాయ కుటుంబాలకు ఎంతో సహకారిగా ఉన్నదని, ఇప్పటివరకు 21 మందికి ఆరు లక్షల చొప్పున బెనిఫిట్స్‌ అందించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు, సిహెచ్‌ దుర్గ భవాని, వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌ పత్రిక సంపాదకులు పి మాణిక్‌ రెడ్డి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వెంకట్‌, నాగమణి, రాజశేఖర్‌ రెడ్డి, ఈ.గాలయ్య, డి.సత్యానంద్‌, కె.సోమశేఖర్‌, శాంతి కుమారి, ఆర్‌.రంజిత్‌ కుమార్‌, వై.జ్ఞాన మంజరి, కె.రవికుమార్‌, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.

Spread the love