‘ప్రాథమికం’… అత్యంత ఆవశ్యకం…

ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌ అనేది ఆంగ్లంలో ఉన్న ఒక నానుడి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే అది రాకుండా తీసుకోవాల్సిన నివారణా చర్యలు ముఖ్యమనేది దాని సారాంశం. వైద్యానికి సంబంధించిన ఈ నానుడిని అన్ని విషయలకూ పోల్చుకోవచ్చు. ప్రజారోగ్యానికి సంబంధించి ఈ పోలిక ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఆరంభమైంది కాబట్టి.. సీజనల్‌ వ్యాధుల దాడి ఆరంభమైంది కాబట్టి. ‘బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి తర్వాత సీజనల్‌ వ్యాధులు తగ్గాయి. మిషన్‌ భగీరథ వల్ల నీటి సంబంధిత వ్యాధులూ తగ్గుముఖం పట్టాయి…’ అంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తాజాగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని పెద్దాసుపత్రులకు బయటి నుంచి వచ్చే రోగుల (ఓపీ) సంఖ్య కూడా తగ్గిందంటూ ఆయన నొక్కి వక్కాణించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని సీజనల్‌ వ్యాధులు తగ్గుముఖం పట్టాయా..? లేక పెరిగాయా..? అన్నది ఇక్కడ మనం నిశితంగా పరిశీలించి, పరిష్కరించాల్సిన అంశం.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం… పెద్దాసుపత్రుల నిర్మాణం, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుపై దృష్టి సారించిన విషయం వాస్తవమే. ఇందులో భాగంగానే నిమ్స్‌లో దశాబ్ది బ్లాక్‌, వరంగల్‌ ఎంజీఎంలో 28 అంతస్తులతో నూతన భవనం, హైదరాబాద్‌ చుట్టూ నిమ్స్‌ తరహలో నాలుగు వైపుల నాలుగు పెద్దాసుపత్రుల ఏర్పాటుకు సర్కారు చర్యలు చేపట్టిన సంగతి విదితమే. అయితే ఇవి రాజధాని నగరానికి, జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన నగరాలు, పట్టణాలకు పరిమితమైనవి. ఇక్కడి నుంచి కిందికి తొంగిచూస్తే గానీ మనకు అసలు విషయం బోధపడదు. ముఖ్యంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో అసలు సిసలు పరిస్థితి మనకు కనబడుతుంది. కనీసం సూది మందుకు కూడా దిక్కులేని గూడేల్లో టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, చికెన్‌గున్యాకు చికిత్సను ఊహించగలమా..? చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. ప్రసవ వేదన పడుతున్న గర్భిణీలను డోలీల్లో మోసుకెళుతున్న దృశ్యాలు ఇప్పటికీ మన ఆదిలాబాద్‌, ఏటూరు నాగారం, భద్రాచలం, ములుగు, ఆమ్రాబాద్‌ ఏజెన్సీ ఏరియాల్లో కనబడుతూనే ఉంటాయి..మనతో అవి కంటతడి పెట్టిస్తూనే ఉంటాయి. అంబులెన్సు వెళ్లటానికి కూడా సరైన దారి లేక ‘వైద్యమో చంద్రశేఖరా…’ అంటూ జనం అరిగోస పడుతున్న సందర్భాలు ఇప్పటికీ అనేకం.
ఈ గోసలకు, ప్రజల ఆరోగ్య బాధలకు ప్రధాన కారణం విధానపరమైన లోపమేనని చెప్పక తప్పదు. వామపక్ష పాలనలోని కేరళలో కొన్ని దశాబ్దాలుగా ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసేందుకు నిరిష్ట చర్యలు తీసుకున్నారు. ఫలితంగా అక్కడ గ్రామీణ స్థాయిలోనే, ప్రాథమిక దశలోనే జబ్బును గుర్తించి, దాని నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారు. దీంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమేగాక.. వారి ఆయుర్దాయం కూడా పెరిగిందని తేలింది. అందుకే ప్రజారోగ్యంలో కేరళ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పుడు తెలంగాణకు కూడా ఆ మోడల్‌ అత్యంత అవసరం. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రికి జ్వర పీడితులు క్యూ కడుతున్నారనేది గణాంకాలు చెబుతున్న వాస్తవం. విశ్వ నగరంలోనే ఇలా జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో ఇక మండల, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి చెప్పలేం. ఈ క్రమంలో కేవలం ద్వితీయ (జిల్లా కేంద్ర ఆస్పత్రులు), తృతీయ స్థాయి (రాష్ట్ర స్థాయి ఆస్పత్రులు, వైద్య కళాశాలలు) వైద్యం మీదే కాకుండా ప్రాథమిక స్థాయి వైద్యంపై కూడా సర్కారు ఎక్కువగా దృష్టి సారించాలన్నది నిపుణుల సూచన. పీహెచ్‌సీలు, సామూహిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో కావాల్సిన వైద్య పరికరాలు, మందులను అందుబాటులో ఉంచటం అన్నది ఇక్కడ కీలకం. వైరల్‌ ఫీవర్లు ఎక్కువైనప్పుడు వాటి నిర్దారించేందుకు వీలుగా సంబంధిత కిట్లను కూడా కిందిస్థాయికి సరఫరా చేయాలి. దీంతోపాటు రోగుల సంఖ్యకు సరిపడా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, ఇతర సిబ్బందిని నియమించటం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని సత్వరమే అందించే వీలు కలుగుతుంది. ఆ దిశగా ఏలికలు ఆలోచించి, నిర్ణయాలు తీసుకున్నప్పుడే ‘ఆరోగ్య తెలంగాణ…’ సాధ్యం.

Spread the love