దేశంలో ప్రజాస్వామ్యం..లౌకికత్వం.. సామాజిక న్యాయం.. ఆర్థిక స్వావలంబనకు విఘాతం ఏర్పడుతోందంటూ మేధావులు, అభ్యుదయవాదులు.. సామాజికవేత్తలు కొన్నేండ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలా రాజ్యాంగంలోని కీలకాంశాలను క్రమక్రమంగా ధ్వంసం చేస్తూ వస్తున్న మోడీ సర్కార్…ఆ క్రమంలో రాష్ట్రాలకు ఆయువుపట్టు లాంటి ఆర్థిక స్వావలంబన మీద పెద్ద దెబ్బే కొట్టింది. 2014 నుంచి ఇప్పటిదాకా నిధులు, గ్రాంట్ల విషయంలో కేంద్రం మొండి వైఖరిని అనుసరిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన అంశాలు.. ఆ సందర్భంగా ‘తెలంగాణకు ఆర్థికంగా చేయూత నివ్వండి…’ అంటూ మన ఆర్థికామాత్యులు తన్నీరు హరీశ్‌రావు వేడుకున్న తీరు ఇదే విషయాన్ని రూఢ చేస్తున్నది. వాస్తవానికి హరీశ్ కంటే ముందే, 2014 నుంచి 2018 వరకూ ఉన్న బీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వం సైతం ఇదే అంశంపై విన్నపాల మీద విన్నపాలు.. విజ్ఞాపనల మీద విజ్ఞాపనలు అందజేసింది. కానీ కేంద్రం కనికరించకపోవటం దాని బాధ్యతా రాహిత్యానికి, రాష్ట్రాల పట్ల అది అనుసరిస్తున్న ధోరణికి ప్రబల తార్కాణం.
నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత… పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది ఎక్కువ, అక్కడి నుంచి పన్ను వాటాల రూపంలో ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద తెలంగాణకు రూ.700 కోట్లు రావాల్సి ఉన్నా దాని గురించి మోడీ సర్కార్ నోరు మెదపకపోవటం అత్యంత శోచనీయం. రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా నిధులిచ్చి సహకరించటమనేది దాని బాధ్యత. బీఆర్‌జీఎఫ్ (బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్స్ ఫండ్) కింద ఆ నిధులను కేంద్రం సమకూర్చాలి. కానీ 2014-15, 2019-20, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఢిల్లీ నుంచి మనకు ఒక్కపైసా రాకపోవటం విస్తుగొలిపే అంశం. ఫలితంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన ములుగు, ఏటూరు నాగారం, మహబూబాబాద్, దేవరకొండ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాచలం తదితర మారుమూల, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మృగ్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో సైతం వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వాలంటూ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టడం గమనార్హం.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్రం రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా తెలంగాణ పట్ల అనుసరిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ ద్వారా అందించాల్సిన సాయాలు, గ్రాంట్లు, నిధులకు మొండిచేయి చూపటం ద్వారా వాటి వెన్నెముకను విరవాలన్నది కేంద్రం ఎత్తుగడ. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం సాధ్యమవుతుందనే రాజ్యాంగ మౌలిక సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. రాష్ట్రాలను తమ ముందు మోకరిల్లేలా.. బిచ్చగాళ్ల మాదిరిగా అడుక్కుతినేలా చేయాలన్న ఆరెస్సెస్ బుర్రలోంచి పుట్టిన దుర్మార్గపు ఆలోచనా విధానానికి అసలు సిసలు స్వరూపమే ఇది. అందుకే మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను కనికరించదు.. అదనంగా ఒక్క పైసా ఇవ్వదు.
ఈ క్రమంలో ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు వీలుగా రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది. వామపక్షాల ఏలుబడిలో ఉన్న కేరళ ప్రభుత్వం ఇందుకోసం గతంలో కొంత ప్రయత్నించింది. అప్పట్లో ఆ రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి థామస్ ఐజాక్… వివిధ రాష్ట్రాల, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. కేంద్రం అనుసరిస్తున్న ధోరణిపై చర్చలు, సమాలోచనలు చేశారు. ఆ క్రమంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు నెరిపారు. మళ్లీ అలాంటి వాతావరణమే ఇప్పుడు రావాలి. తమను ఆర్థికంగా అష్ట దిగ్బంధనం చేస్తున్న మోడీ సర్కారు వైఖరిపై నిరసన గళాలు విప్పాలి. ఈ ఆందోళన, పోరాటాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిన గురుతర బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలి. అప్పుడే కేంద్రం మెడలు వంచటం సాధ్యమవుతుంది. లేదంటే షరా మామూలుగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి.. రాష్ట్రాలు సమర్పించిన విజ్ఞాపనా పత్రాలు బుట్టదాఖలవుతాయి.