ఇద్దరు నీచులు!

దేన్నీ ధిక్కారించ లేని
ఓ అభాగ్యుడు దారెంటా
చేతులు జోడించి కూర్చున్నాడు
గజ్జి కుక్క కంటే హీనమైన వాడొకడు
నిర్లజ్జగా కాలెత్తిండు!
ఇంత దుర్మార్గం
కళ్ళెదుటే ఇంత జరుగుతున్నా
సూర్యుడు కళ్ళు మూసుకో లేదు
గాలి ముక్కు మూసుకో లేదు
దారెంటా ప్రయాణాలు ఆగిపోలేదు
ఊగిపోతూ నాలో నేనే
భూనభోంతరాలు దద్దరిల్లేటట్లు
ఏదిరా నీ దేవుడని అరిచా!
‘ దేవుడు నీలా తొందర పడడ’ని
ఓ అశరీరవాణి నిశ్శబ్ద సమాధానం!
నిజానిజాలు తేల్చుకోలేని నేను
రాయి పట్టుకున్న చేతిని
నా వెనకే దాచుకున్న!
వాడి ఇల్లు కూల్చేసినందుకు
ప్రతీకార ఆనందమో
వాడి పాదాలు మరొకడు కడిగి
నెత్తిన చల్లుకున్నందుకు
అంతు లేని విజయ గర్వమో
నా ఆవేశాన్ని చల్లబరచ లేదు!
ఇద్దరు నీచులు
ఇంత పెద్ద దేశాన్నీ
అంతు లేని మానవ సమూహాన్నీ
అధికార మదంతో అవమానించినందుకు
ఆ ఇద్దరు ఎక్కడ కనిపించినా
నాలాగా దాచుకున్న రాళ్ళకు పని చెప్పండి!!

– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
సెల్‌:9440233261

Spread the love