ఈ గవర్నర్లు… కాషాయ విధేయులు!

నరేంద్ర మోడీ, అమిత్‌షాలకు సంబం ధించినంత వరకు… విధేయులైన పార్టీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌లు, రిటైరైన, తమకు అనుకూలురైన అధికారులు, జనరల్స్‌ సమూహం నుండే గవర్నర్ల ఎంపిక ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలకు నియమించిన గవర్నర్లు అందరూ పాలక పార్టీ ఏజెంట్లుగా లేదా అంతకంటే అధ్వానంగా రాజకీయ అనుచరులుగా వ్యవహరించినవారే. ఇటీవల భారత రాష్ట్రపతి చేపట్టిన ఆరుగురు కొత్త గవర్నర్ల నియామకం… గవర్నర్‌ పదవిని మోడీ ప్రభుత్వం ఎలా చూస్తున్నది? నిస్సిగ్గుగా దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నది? అనే దానికి సంబంధించి అనేక విషయాలను తెలియచేసింది. పని లేకపోయినా ఆర్భాటానికి కొదవలేని గవర్నర్‌గిరీని రెండు మాసాల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు కట్టబెట్టి, ఆంధ్రప్రదేశ్‌కు పంపడం దీనికి ఒక చక్కటి ఉదాహరణ. 2019లో అయోధ్య వివాదం కేసులో ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ నజీర్‌ కూడా ఒకరన్న విషయం మరచిపోరాదు. అందుకే, ఈ నియామకాన్ని ‘క్విడ్‌ ప్రో కో’ (నీకిది-నాకది)గా చూస్తున్నారు. 2014లో కేరళ గవర్నర్‌గా జస్టిస్‌ పి.సదాశివంను మోడీ ప్రభుత్వం నియమించినప్పుడే దాని కపట వైఖరి బయటపడింది. రిటైరైన భారత ప్రధాన న్యాయమూర్తి గవర్నర్‌గా అవతారమెత్తిన తొలి ఉదంతమది. ఈ చర్యను రిటైర్డ్‌ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు తీవ్రంగా ఆక్షేపించారు. న్యాయ స్వాతంత్య్రానికి వాటిల్లిన ముప్పుగా వారు అభివర్ణించారు. ఇప్పుడు నియమితులైన మరో నలుగురు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీకి చెందినవారే. వారిలో ఎక్కువమంది బీజేపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులే. వారికున్న అర్హత అంతా పాలక పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు విధేయంగా ఉండడమే. గవర్నర్‌గా వారి విధులను ఎలా నిర్వర్తిస్తారన్నది పాలక పార్టీ పట్ల వారి ప్రభు భక్తే నిర్ణయిస్తుంది. ఈ నియమితుల్లో ఒకరు పాలక పార్టీ నేతలకు సాగిలపడి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం. తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ ఎంపి సి.పి.రాధాకష్ణన్‌, రాష్ట్రపతికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడమే కాదు, ‘మన ప్రియతమ, అత్యంత గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ, గౌరవనీయులైన హౌం మంత్రి అమిత్‌ షా”లకు కూడా కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు. జార్ఖండ్‌ గవర్నర్‌గా తనను నియమించినందుకు ఆయన ఈ రీతిన కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు. ఇలా సాగిలపడి కృతజ్ఞతలు తెలిపారంటేనే గవర్నర్‌గా ఆయన వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతుంది. నరేంద్ర మోడీ, అమిత్‌షాలకు సంబంధించి నంత వరకు… విధేయులైన పార్టీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌లు, రిటైరైన, తమకు అనుకూలురైన అధికారులు, జనరల్స్‌ సమూహం నుండే గవర్నర్ల ఎంపిక ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలకు నియమించిన గవర్నర్లు అందరూ పాలక పార్టీ ఏజెంట్లుగా లేదా అంతకంటే అధ్వానంగా రాజకీయ అనుచరులుగా వ్యవహరించినవారే. ఈ గవర్నర్లు అందరూ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నానా ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదా పర్యవేక్షించడం అనే కర్తవ్యాలను తమకు తామే నిర్దేశించుకున్నారు. పంజాబ్‌ గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ ముఖ్యమంత్రి భగవత్‌ మాన్‌కు రాసిన లేఖ ఇటువంటి విపరీత వైఖరికి తాజా ఉదాహరణ. విదేశాలకు శిక్షణ కోసం పంపే స్కూళ్ళ ప్రిన్సిపాళ్ళను ఎంపిక చేసే క్రమాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఇతర నిర్ణయాలను గవర్నర్‌ ఆ లేఖలో ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభనుద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగంలో కొన్ని భాగాలను చదవడానికి తిరస్కరించడం దగ్గర నుండి సీనియర్‌ అధికారులను రప్పించుకుని వారికి హుకుంలు జారీ చేయడం, రాష్ట్రాల పాలక పార్టీల రాజకీయ వైఖరులను బహిరంగంగా విమర్శించడం, పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోద ముద్ర వేసేందుకు తిరస్కరించడం వరకు పలు చర్యల ద్వారా బీజేపీ నియమిత గవర్నర్లు అలంకార ప్రాయమైన ఈ పదవిని నిరంతరంగా దుర్వినియోగం చేస్తున్నారు. బీజేపీ యేతర పాలనలోని రాష్ట్ర ప్రభుత్వా లన్నీ గవర్నర్ల రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు స్వస్తి పలకాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తు న్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం గవర్నర్ల చర్య లను సమర్థిస్తూ వారిని మరింతగా ఎగదో స్తు న్నది. ఈ రాష్ట్రాలలో సమాఖ్య సూత్ర పరిరక్ష ణకు, గవర్నర్ల నిరంకుశ చర్యలకు చెక్‌ పెట్టడాని కి ప్రజలను సమీకరించేందుకు ప్రచారోద్యమం చేపట్టాలి.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love