మొగలుల పాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ… తదుపరి బ్రిటిష్ పాలనలో బానిసత్వం… దేశంలో అనేక మంది ప్రాణ త్యాగం… ఫలితమే దేశానికి స్వాతంత్య్రం. అది ఏడున్నర దశాబ్దాలు దాటి దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి నిన్న అడుగుపెట్టింది. అయితే తెల్లదొరల నుంచి పోరాడి సాధించుకున్న దేశంలో మన స్వాతంత్య్ర సమర యోధుల ఆశయాలు, స్వాతంత్య్ర లక్ష్యాలు నెరవేరాయా…! అందరికీ రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయా…! దేశం దేదీప్యమానంగా వెలుగొందిపోతుందనే కేంద్ర పాలకులు చెబుతున్న మాటలు వాస్తవమేనా…! దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఊకదంపుడు ఉపన్యాసాల నిజ స్వరూపం ఏమిటి..!? ఇవన్నీ దేశ ప్రజలు ఇప్పుడు చర్చించాల్సిన అంశాలే.
తాజాగా 2022-23 సంవత్సర కాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలు అనేక అంశాలపై అధ్యయనం చేసి, ర్యాంకులు ప్రకటించారు. ‘ఆకలి సూచీ’లో 107వ స్థానంలో భారత్ నిలుచుట బాధాకరమైన విషయం. మూడు పూటలా తిండిలేని వారు దేశంలో కోకొల్లలు. నేటి కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో పౌరహక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ”ఆమ్నెస్టీ” వంటి అంతర్జాతీయ సంస్థలు తరచూ పేర్కొంటున్నాయి. ‘పౌర స్వేచ్ఛ సూచీ’లో నేడు 150వ స్థానంలో ఉండటం గమనార్హం. కనీసం భారత రాజ్యాంగం ప్రకారం మన హక్కులను, సాధక బాధకాలు ప్రభుత్వాలకు చెప్పుకునే ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా నేటి ప్రభుత్వాలు ఉండటం శోచనీయం ‘లింగ సమానత్వం సూచీ’లో 135వ స్థానంలో, ‘ఆరోగ్యం, మనుగడ’ సూచీలో 146వ స్థానంలో ఉన్నాం. ఇక ప్రపంచంలో సుమారు ఐదు కోట్ల మంది బానిసత్వంలో మగ్గిపోతున్నారు అని సర్వేలు చెబుతుండగా, వీరిలో సుమారు 1.1కోట్లమంది భారతదేశంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి అంటే కంటికి కనపడే నాలుగు విమానాశ్రయాలు, ఆరు జాతీయ రహదారులు, వందేభారత్ రైళ్లు కాదని, ప్రతీ ఒక్కరికీ ‘కూడు, గుడ్డ, నివాసం’ అందించుటయే అని ఇకనైనా పాలకులు గ్రహించాలి. నేటికీ కనీసం తాగేందుకు మంచినీరులేని ఆవాసాలెన్నో ఉన్నాయి. అవి మన దారిద్య్రాన్ని పదేపదే గుర్తుచేస్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే వారధిగా ఉన్న పత్రికలు కూడా నేడు సమాజంలో స్వేచ్ఛగా లేవు. ‘పత్రికా స్వేచ్ఛ’ సూచీలో 161వ స్థానంలో దేశం నిలిచింది.
విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తామని అధికారంలోకి వచ్చిన నేటి కేంద్ర పాలకులు, ఆ దిశగా ఏ చర్యలు తీసుకున్నారో దేశానికి తెలపాలి. అవినీతిని నిర్మూలించి స్వచ్ఛ పాలన అందిస్తామని చెప్పి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చు కుంటున్నారు. ఎదురు ప్రశ్నించేవారిని, ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై తమ ఆధీనంలో ఉన్న ఈడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయడం జరుగుతుంది. అందుచేతనే ‘అవినీతి సూచీ’లో దేశం 85వ స్థానం, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ‘దయనీయ సూచీ’లో 103వ స్థానంలో ఉండుట గమనార్హం. సైన్యానికి కేటాయించే నిధుల్లోనూ కోత విధిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగ స్థానంలో కాంట్రాక్టు (ఫిక్స్ టైం) ఉద్యోగ నియామకాలు ‘అగ్నివీర్’ ప్రవేశపెట్టారు. సైన్యానికి అవసరమైన బూట్లు, వస్త్రాలు కూడా అందరికీ అందటం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుచేతనే 33వ స్థానంలో నిలిచింది. దేశం అభివృద్ధి చెందాలంటే ఎగుమతులు పెరగాలి. పరిశ్రమలు స్థాపించాలి. దీనికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను దశల వారీగా మూసేస్తూ, కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయటం యధేచ్ఛగా కొనసాగుతోంది.
మానవ వికాసం, నైపుణ్యాలు అంశాలు ఆధారంగా ఇచ్చే ‘మానవ అభివృద్ధి సూచిక(హెచ్‌డిఐ)’లో 132వ స్థానంలో మన భారత్ నిలిచింది. ఇదే అంశంలో దాదాపు మన దేశ జనాభా కలిగిన చైనా 79వ స్థానంలో ఉండటం గమనార్హం. పనిచేయగల సామర్థ్యం, ఉత్సాహం ఉన్న మన యువతికి, తగినన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల, ప్రస్తుతం 8.11నిరుద్యోగ రేటుతో ‘ప్రపంచ నిరుద్యోగిత’ సూచీలో 117వ స్థానంలో నిలిచింది. అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఈ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో ఎంత మందికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారో పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వాస్తవాలు తెలియజేస్తే మంచిదే కదా! భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద 3 లేదా 4వ ఆర్థిక వ్యవస్థగా, 500 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందుతుందని నోరూరించే మాటలు ఎంత వరకూ సాధ్యమో వేచి చూడాలి…!? ‘ఎక్స్‌పోర్ట్ సూచీ’లో ఎగుమతులు కూడా బలహీనంగా ఉండటం వల్ల భారత్ 15వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశ జీడీపీ 277లక్షల కోట్ల రూపాయలని అంచనా. అయినా తలసరి జీడీపీ రూ.6లక్షలు దాటకపోవడంతో ‘తలసరి జీడీపీ సూచీ’లో భారత్ 127వ స్థానంలో నిలిచింది.
142 కోట్ల పైబడి జనాభా ఉన్న నేటి భారతదేశంలో సుమారు 40కోట్ల మంది ప్రజలు పేదరికంలో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వాలు ఓట్లు దండుకునే క్రమంలో అనేక హామీలు గుప్పిస్తున్నారు తప్పా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడే విధానాలకు పునాదులు వేయడం లేదు. అందరికీ విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వాల కృషి నామమాత్రంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే పాలకులు ఆలోచించాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. లేనట్లయితే ఇప్పుడు భారత్ పేదరికం సూచిలో 79వ స్థానంలో ఉన్న విధంగానే మళ్లీ ఉంటుంది. మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపు కుంటున్నట్టుగానే 78లోకి అడుగుపెడతాం. మార్పు ఏమీ ఉండదు.
– ఐ.ప్రసాదరావు, సెల్:6305682733