కేరళ ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్న రాష్ట్రం. హిందూ, ముస్లిం, క్రైస్తవుల సంఖ్య దాదాపు సమాన నిష్పత్తిలో ఉన్నారు. అయినా మతపరమైన విద్వేషాలకు తావులేని రాష్ట్రం. ప్రకృతి అందాలకు నెలవు, మానవాభివృద్ధి సూచీలలో దేశంలోనే అగ్రస్థానం. ప్రపంచీకరణ విధానాలకు, దేశ రాజ్యాంగ పరిమితులలోనే అయినా ఒక ప్రత్యామ్నాయ నమూనా. కోవిడ్ నుంచి ప్రజలను రక్షించటంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఆనాటి కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శైలజా టీచర్‌ను సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి గౌరవించింది. వలస కార్మికులను అతిథులుగా పరిగణించి ఆదుకున్న ఏకైక రాష్ట్రం అది. కుల, మత, లింగ వివక్షల వంటి సామాజిక రుగ్మతల నుంచి భద్రత కల్పించటంలో ముందున్నది. వామపక్షాలు ప్రజలలో బలమైన స్థానం కలిగి ఉండటం, ప్రస్తుతం అక్కడ వామపక్ష ప్రభుత్వమే ఉండటమే కేరళ మీద మతోన్మాదులు ‘కేరళ స్టోరీ’ పేరుతో దుష్ప్రచారం చేయడానికి కారణం.
‘కేరళ స్టోరీ’ పేరుతో అనేక భాషల్లో సినిమా విడుదలైంది. పైగా వాస్తవ ఘటనల ఆధారంగా తీసినట్టు చెప్పుకుంటున్నారు. అది నిజమా? టాకీసులు నిండక పోయినా… ప్రేక్షకులు పెద్దగా లేకపోయినా, సినిమా మాత్రం ప్రదర్శిస్తూనే ఉన్నారు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే వెన్నాడుతాయి. ఇది వ్యాపారం కోసం నిర్మించిన చిత్రమా? లేక కళాత్మక విలువల కోసమా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మించారా? కేరళ గురించి తెలిసిన వారికీ, సినిమా చూసినవారికీ ఎవరికైనా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. దర్శక నిర్మాతల ధోరణి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నది.
నిజానికి ‘కేరళ స్టోరీ’ సినిమాలో కేరళ గురించి ఏమీలేదు. కేరళ చరిత్రగానీ, ఆర్థిక వ్యవస్థ గురించి గానీ, కేరళ నమూనా గురించిగానీ, కేరళ సాంస్కృతిక విలువల గురించిగానీ… కనీసం కేరళ ప్రకృతి సౌందర్యం, అందచందాల గురించి కూడా అణుమాత్రం లేదు. కానీ దానికి ‘కేరళ స్టోరీ’ అని పేరు పెట్టి ప్రజల మీదకు వదిలారు. సాధారణ ప్రజల మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు సినీ మాధ్యమాన్ని సాధనంగా చేసుకున్నారు. ప్రజల మీద… ముఖ్యంగా యువత మీద సినిమా ప్రభావం ఎక్కువ కదా! దాన్ని సొమ్ము చేసుకుని రాజకీయ ప్రయోజనం పొందే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం. కేంద్ర పాలకుల విధానాలను నిర్దేశిస్తున్న మతోన్మాదుల అబద్ధాల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన సరుకే ఇది! అన్ని రంగాలలో ఉన్నట్టే సినీ రంగంలో కూడా భిన్నాభిప్రాయా లుండవచ్చు. సినిమా కథమీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. అది ‘కథ’ అన్న వాస్తవాన్ని చెప్పితే ఎవరినీ ఆక్షేపించనవసరం లేదు. ప్రజల మీద కథ ప్రభావం గురించీ, సామాజిక బాధ్యత గురించీ, కళాత్మక విషయాలు, నటన వంటి అనేక విషయాల మీద చర్చ చేయవచ్చు. వాస్తవ ఘటనలు కూడా తెరకెక్కించవచ్చు. అలా వచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ… అబద్ధాలు నిజాలుగా చిత్రీకరించటం, అవాస్తవాలను వాస్తవాలుగా నమ్మించ చూడటమే ఇక్కడ సమస్య. ఇది కళాహృదయ లక్షణం కాదు… వ్యాపారం మాత్రమే కూడా కాదు. ఇది రాజకీయ ప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమే!
యాధృచ్ఛికంగానే అయినా, మరో పరిణామం కూడా జరిగింది. ‘కేరళ స్టోరీ’ పేరుతో దేశ ప్రజలందరికీ వీరు అబద్ధాలు చూపించాలనుకుంటే… ప్రజలు మాత్రం కర్నాటక స్టోరీ చూపించారు. ‘కేరళ స్టోరీ’ పేరుతో దేశ ప్రధాని స్థాయిలో చేసిన ప్రచారాలు కూడా కర్నాటక ప్రజల విజ్ఞత ముందు తేలిపోయాయి. ఆశ్చర్యకరంగా మరోవైపు కొందరు ఈ చిత్రానికీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఏమీ సంబంధం లేదని చెప్పేందుకు యాతన పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు వీరికి ఆయాసాన్నే మిగిల్చారు. మీడియా సమావేశంలో ‘రజాకార్ ఫైల్స్’ కూడా రాబోతున్నదని ప్రకటించారు. చట్టబద్ధమైన రాజకీయ అవినీతితో పొగైన వనరులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కదా! ఎన్ని సినిమాలైనా తీయవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. ఏ ప్రయోజనం కోసం తీస్తున్నారన్నదే ప్రశ్న.
ఇంతకూ ఆ సినిమాలో ఏమున్నది? కేరళలో 32 వేల మంది మహిళలు తప్పిపోయారట! బలవంతంగా మతం మార్పించి దేశం వెలుపలకు వారందరినీ పంపించారట! ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఒక పథకం ప్రకారం హిందూ, క్రైస్తవ మహిళలను లోబరుచుకుని దేశం దాటిస్తున్నదని చిత్రీకరించారు. దేశంలో ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయనటంలో సందేహం లేదు. హిందూ, ముస్లిం… మరే మతానికి చెందిన ఉగ్రవాదులైనా కావచ్చు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదులున్నా సహించకూడదు. వదలకూడదు. దానికి మించి, ఉగ్రవాదానికి అవకాశమిస్తున్న పరిస్థితులను సరిదిద్ది, మూలాలను నిర్మూలించాలి. అది కాశ్మీరైనా, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, కేరళ… ఏ రాష్ట్రమైతేనేమి? భారతదేశంలో భాగమే కదా! ఈ దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండవల్సిందే. పాలకులు బాధ్యతగా వ్యవహరించవల్సిందే. 32వేల మంది మహిళలు ఒక చిన్న కేరళ రాష్ట్రంలో అక్రమ రవాణాకు గురైతే ఎనిమిదేండ్లుగా పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీగానీ, కేంద్ర హౌంమంత్రి అయిన తర్వాతనైనా అమిత్‌షా గానీ ఎందుకు మాట్లాడలేదు? కనీసం ఎన్నికల సందర్భంలో కూడా, కేరళలో కూడా ఎందుకు ప్రచారం చేయలేదు? గత కేరళ శాసనసభలో ఒక బీజేపీ శాసనసభ్యుడు కూడా ఉన్నాడు. ఐదేండ్లు శాసనసభ్యుడుగా ఉన్న వ్యక్తి ఒక్కసారి కూడా శాసనసభలో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రికార్డులలో ఎక్కడైనా ఆధారాలున్నాయా? అంతే కాదు, కేరళలో రెవెన్యూ గ్రామాలు 1674 ఉన్నాయి. 32వేల మంది మహిళలు కనిపంచకుండా పోవటమంటే సగటున ప్రతి గ్రామంలో పంతొమ్మిది మంది పోయి ఉండాలి. ఇదే నిజమైతే కేరళ అల్లకల్లోలమై ఉండాలి. కేరళ మాత్రమేనా? దేశమంతా అట్టుడికి పోయి ఉండాలి. ఒక్క ‘నిర్భయ’ కేసు దేశాన్ని, కోట్లాది ప్రజలను కదిలించింది కదా! ఊరికి పందొమ్మిది మంది చొప్పున 32వేల మంది పోతే ఆ కుటుంబాలు ఎందుకు మాట్లాడలేదో, మీడియా ఎందుకు మౌనంగా ఉన్నదో సమాధానం చెప్పాలి కదా! రాళ్ళు వేయటమే తప్ప బాధ్యత వహించడానికి సిద్ధంగా లేరు. మీడియా దృష్టికి రాకుండా పోవడానికి అది ఆదివాసీ ప్రాంతం కాదు. అభివృద్ధి చెందిన రాష్ట్రం. దేశంలోనే నూటికి నూరుశాతం ప్రజలు చదువుకున్న రాష్ట్రం. రాజకీయ చైతన్యంతో ప్రజలు స్పందిస్తున్న రాష్ట్రం. పాలకులను ప్రశ్నించే దిక్కులేని గుజరాత్ లాంటి రాష్ట్రం కాదు అది. 32వేల మంది మహిళల సమస్య ‘కేరళస్టోరీ’ నిర్మాతకు, దర్శకునికే తప్ప వీరెవరికీ ఎందుకు దొరకలేదు? అది నిజమైతే కదా దొరకడానికి! సినిమాలో పాత్రతో 32వేలు అని చెప్పించిన వీరు, తర్వాత ఆధారాలు చూపలేక, అబద్ధాలని ఒప్పుకోలేక ముగ్గురని ప్రచారంలో పెట్టారు. ఆ ముగ్గురెవరో చెప్పలేక, వేలాది మంది అనటం మొదలు పెట్టారు. ముగ్గురి వివరాలే చెప్పలేనివారు వేలాది మంది వివరాలు ఎక్కడ తేగలరు. అందుకే, చర్చకు ముఖం చాటేసారు. ఈ చర్చ నడుస్తుండగానే, 2016 నుంచి 2020 వరకు, గుజరాత్‌లో 41,621 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఈ నెల 7న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాలు ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారయుత సమాచారం. గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం. దీనికి ఏమి సమాధానం చెబుతారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకమని కూడా ఈ సినిమాలో చెప్పించే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు నాటి జమ్మూ-కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయటపెట్టిన విషయాలతో స్పష్టంగా అర్థమవు తున్నాయి. విధ్వంసక దాడి కేసులో ముద్దాయిగా ఉన్న ప్రజ్ఞాసింగ్‌ను బీజేపీ ఎంపీగానే గెలిపించుకున్నారు. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అమెరికాతో అంటకాగుతున్నారు.
కేరళ ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్న రాష్ట్రం. హిందూ, ముస్లిం, క్రైస్తవుల సంఖ్య దాదాపు సమాన నిష్పత్తిలో ఉన్నారు. అయినా మతపరమైన విద్వేషాలకు తావులేని రాష్ట్రం. ప్రకృతి అందాలకు నెలవు, మానవాభివృద్ధి సూచీలలో దేశంలోనే అగ్రస్థానం. ప్రపంచీకరణ విధానాలకు, దేశ రాజ్యాంగ పరిమితులలోనే అయినా ఒక ప్రత్యామ్నాయ నమూనా. కోవిడ్ నుంచి ప్రజలను రక్షించటంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఆనాటి కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శైలజా టీచర్‌ను సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి గౌరవించింది. వలస కార్మికులను అతిథులుగా పరిగణించి ఆదుకున్న ఏకైక రాష్ట్రం అది. కుల, మత, లింగ వివక్షల వంటి సామాజిక రుగ్మతల నుంచి భద్రత కల్పించటంలో ముందున్నది. వామపక్షాలు ప్రజలలో బలమైన స్థానం కలిగి ఉండటం, ప్రస్తుతం అక్కడ వామపక్ష ప్రభుత్వమే ఉండటమే కేరళ మీద మతోన్మాదులు ‘కేరళ స్టోరీ’ పేరుతో దుష్ప్రచారం చేయడానికి కారణం.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుంచి, నియంతృత్వ పోకడల నుంచి ప్రజల దృష్టి మరలించే ప్రయత్నమిది. ప్రపంచీకరణ పేరుతో అమలు చేస్తున్న తప్పుడు విధానాలకూ, మతపరంగా ప్రజలను విభజించి పబ్బం గడుపుకునే ప్రయత్నా లకు సరైన ప్రత్యామ్నాయం చూపించగల శక్తి మార్క్సిస్టు సిద్ధాంతమే కదా! అందుకే కేరళ మీద, వామపక్ష భావజాలం మీద దాడికి ఈ కట్టుకథలను సృష్టిస్తున్నారు. కేరళ ప్రజలు సహజంగానే వీటిని నమ్మరు. కేరళ వైపు ఇతర రాష్ట్రాల ప్రజలు చూడకుండా ఉండటం కోసం ఈ బురదజల్లే కార్యక్రమం. అంతే కాదు, మత విద్వేషాలు సృష్టించి, హిందూ ఓటుబ్యాంకు సృష్టించుకునే ప్రయత్నమిది. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఒక పథకం ప్రకారం చేస్తున్న కుతంత్రం. అందుకే దేశవ్యాపితంగా అనేక భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అబద్ధాలను ప్రచారంలో పెట్టటంతో ఆగలేదు. ఆధారాలు ఆడగవద్దనీ, భావోద్వేగాలే ప్రధానమనీ ప్రజలను ప్రభావితం చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారీ చిత్రంలో. ఉగ్రవాద సంస్థపేరుతో కథను నడిపినప్పటికీ, ముస్లింలకు వ్యతిరేకంగా, హిందువులు, క్రైస్తవులలో ద్వేషం సృష్టించే విధంగా చిత్రీకరించారు. సినిమా మొదటి నుంచి చివరివరకూ క్రైస్తవులను బుజ్జగించడానికీ, హిందువులను రెచ్చగొట్టి ఓటుబ్యాంకు సృష్టించుకోవడమే లక్ష్యంగా సాగింది. వీరి లక్ష్యం నెరవేరితే ప్రజాస్వామ్యం, లౌకిక విధానం వంటి రాజ్యాంగ విలువలకే ముప్పు ఏర్పడుతుంది. కార్మికులు, ఇతర శ్రామికుల ఐక్యతకు గండికొట్టే ప్రయత్నం ఇది. ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారం కోసం కుల, మత భేదాలకతీతంగా, ఐక్య పోరాటాలతోనే ఈ ఎత్తుగడలు చిత్తుచేయాలి.
– ఎస్. వీరయ్య