తొలగని వలసదోపిడీ

Unrelenting colonialismగతంలో సామ్రాజ్యవాదుల పీడనలో ఉండిన దేశాలు ఆ వలస పాలన అంతమయ్యాక తమ తమ దేశాల్లో వలస దోపిడీకి ముగింపు పలికేందుకు వీలుగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను, సహజ వనరులను ప్రభుత్వ నియంత్రణలో నిర్వహించే విధానాలను అనుసరించారు. ఆ క్రమంలో సామ్రాజ్యవాద దేశాలు తమ ఖనిజ సంపదను, ఇతర సహజవనరులను కొల్లగొట్టే వీలులేకుండా చేశారు. స్వదేశాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి వీలుగా బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని నియంత్రించే రక్షణ విధానాలను అనుసరించారు. ఇప్పుడు నయా ఉదారవాద విధానాలను తీసుకువచ్చి మళ్ళీ తమ ఆర్థిక, పారిశ్రామిక ఆధిపత్యాన్ని ఆ పాత వలసదేశాల మీద నెలకొల్పడానికి సామ్రాజ్యవాద దేశాలు పూనుకుంటున్నాయి.
అయితే వలస పాలన నుండి విముక్తి పొందినప్పటికీ, సామ్రాజ్యవాద దోపిడీనుండి పూర్తిగా విముక్తి సాధించలేకపోయిన దేశాలు కొన్ని ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికా ఖండంలో ఫ్రెంచి సామ్రాజ్యవాదుల ఆధిపత్యం కింద వలసలుగా ఉండిన దేశాలు ఈ కోవకి చెందుతాయి. ఆ దేశాలలో పాలకుల స్థానంలోకి స్థానికులతో ఏర్పడిన ప్రభుత్వాలు వచ్చినా, ఆ కొత్త పాలకులు తమ తమ ఆర్థిక వ్యవస్థలపై ఫ్రెంచి ఆధిపత్యాన్ని తొలగించలేక పోయాయి. దాని ఫలితంగా కనీసం తాత్కాలికంగానైనా ఫ్రెంచి సామ్రాజ్యవాద దోపిడీని నిలవరించలేకపోయాయి.
ఆ దేశాలలో ఫ్రెంచి సైన్యాలు తమ స్థావరాలను యధాతధంగా కొనసాగిస్తూ వచ్చాయి. ఆ దేశాలు ఫ్రెంచి కరెన్సీ వ్యవస్థ తోనే ముడిపడివున్నాయి. ప్రత్యేకంగా వలసదేశాలమీద పెత్తనం కొనసాగించడానికి 1945లో సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌ అనే కరెన్సీని ఫ్రాన్స్‌ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఫ్రెంచి కరెన్సీ యూరోతో అనుసంధానం అయిన తర్వాత ఈ దేశాల ఆర్థిక నిర్వహణ కూడా యూరోతో ముడిపడిపోయింది. ఈ సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌ మారకపు విలువను వాస్తవానికన్నా ఎక్కువగా నిర్థారించారు. ఆ విధంగా నిర్ణయించడం ఫలితంగా ఆ పశ్చిమ ఆఫ్రికా ప్రాంత దేశాలలో ఉన్న పరిశ్రమలు కొనసాగలేక మూతబడిపోయాయి. ఫలితంగా నిరుద్యోగం ప్రబలింది. (తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీతో విలీనం అయినప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. తూర్పు జర్మనీలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి.) ఇలా ఎందుకు జరిగింది? ఆ దేశంలో ఉత్పత్తి అయిన సరుకును కొనడానికి ఎక్కువ ధరను చెల్లించాల్సివచ్చింది. అదే సరుకును ఫ్రాన్స్‌ నుండి దిగుమతి చేసుకుంటే చవకగా లభించింది. దాంతో స్థానిక పరిశ్రమలు నిలదొక్కుకోలేకపోయాయి. అదే సమయంలో ఆ దేశాలలో లభించే ముడిసరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేటప్పుడు ఆ మార్కెట్‌లో ఉండే పోటీకి అనుగుణంగా తమ సరుకుల ధరలను సవరించుకోవలసివచ్చింది. అందువలన తమ దేశాల్లో కూలీలకు ఇచ్చే వేతనాలను కుదించవలసివచ్చింది. ఆ విధంగా దేశీయ మార్కెట్‌లో విదేశీ సరుకుల పోటీని తట్టుకుని నిలదొక్కుకోలేని పరిస్థితి ఒక పక్క, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ ఫలితంగా తమ దేశాల శ్రామికుల వేతనాలను తగ్గించవలసిన పరిస్థితి ఇంకోపక్క ఏర్పడ్డాయి. అందువలన ఈ దేశాలు అభివృద్ధికి నోచుకోకుండా, నిరుపేదరికంలో కూరుకుపోయాయి. అంతే కాదు. ఈ దేశాలు తమ విదేశీ మారకపు నిల్వలలో అత్యధిక భాగాన్ని (కనీసం 50శాతాన్ని) ఫ్రాన్స్‌లో దాచుకున్నాయి. దాని ఫలితంగా ఫ్రాన్స్‌ దేశపు విదేశీమారకపు నిల్వలు అపారంగా పెరిగాయి. ఆ నిల్వల విలువలు తగ్గిపోకుండా ఉండాలంటే ఈ దేశాల కరెన్సీలు ఫ్రెంచి కరెన్సీతో మారకం ఒక స్థిరమైన రేటులో కొనసాగించాలి. అలా కొనసాగాలంటే ఆ దేశాల ద్రవ్య విధానాలు ఫ్రెంచి దేశపు ద్రవ్య విధానంతో ముడిపడివుండాలి. దాని ఫలితంగా తమ దేశాలలోఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే విధానాలను అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో పశ్చిమ ఆఫ్రికా దేశాలు పడిపోయాయి.
పశ్చిమ ఆఫ్రికా దేశాలపై ఈ విధమైన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం నానా రకాల వికృత చర్యలకూ పూనుకుంది. తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు ఏర్పడడం కోసం కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యం ముసుగులో ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడింది. మరికొన్ని దేశాలలో కుట్రల ద్వారా ప్రభుత్వాలను కూలదోసింది. మరికొన్ని చోట్ల అధినేతలను హత్య చేయించింది. ఈ విధమైన చర్యలలో మనకి కొట్టవచ్చినట్టు కనిపించే ఉదంతం 1983లో బుర్కినా ఫాసోలో జరిగింది. థామస్‌ సంకారా అనే సైన్యాధికారి, మార్క్సిస్ట్‌ విప్లవకారుడు, ఆఫ్రికా దేశాలన్నింటి మధ్యా ఐక్యత నెలకొల్పాలని వాంఛించినవాడు బుర్కినా ఫాసోలో 1983లో అధికారానికి వచ్చాడు. వెంటనే తన దేశం నుండి ఫ్రెంచి సైన్యాలు ఖాళీ చేయాలని ఆదేశించాడు. కాని కొద్ది రోజుల్లోనే అతనిని హత్య చేశారు. థామస్‌ సంకారాకు సన్నిహితులుగా ఉండినవారితోనే అతడిని హత్య చేయించారు. ఆ హత్యకు సూత్రధారిగా ఉండినవాడు ఫ్రెంచి సామ్రాజ్యవాదుల ఏజంట్‌. అతగాడే ఆ తర్వాత దేశాధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత పశ్చిమ ఆఫ్రికా దేశాలమధ్య ఆర్థిక సహకారం కోసం ఎకనామిక్‌ కమ్యూనిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్రికన్‌ స్టేట్స్‌ (ఇకోవాస్‌) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నిజానికి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వ్యవహరించే నాయకులతో ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా అన్ని పశ్చిమ ఆఫ్రికా దేశాలమీదా ఫ్రాన్స్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది. ఈ ఆధిపత్యాన్ని ఎదిరించినందుకే థామస్‌ సంకారా హత్యగావించబడ్డాడు. కాని పశ్చిమ ఆఫ్రికా దేశాల ప్రజలకు అతడు ఆరాధ్యుడుగా నిలిచాడు.
అయితే ఇటీవల ఆ పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కొన్నింటిలో సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు తలెత్తుతున్నాయి. గినీ, మాలి, చాద్‌, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో ఇప్పుడు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు వచ్చాయి. తమ దేశాలనుండి ఫ్రెంచి సైన్యాలు ఖాళీ చేయాని గత రెండు, మూడేండ్లుగా పట్టుబడుతున్నాయి. మాలిలో ఆ సైన్యాలను వెళ్ళగొట్టడంలో జయప్రదం అయారు.
ఈ దేశాల లిస్టులో తాజాగా నైగర్‌ చేరింది. ఈ దేశాలలో ప్రభుత్వాలన్నీ కుట్రల ద్వారా అంతకు ముందున్న సామ్రాజ్యవాద అనుకూల ప్రభుత్వాలను కూలదోసి అధికారానికి వచ్చినవే. నైగర్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా కూలదోసి సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. దీంతో సామ్రాజ్యవాద దేశాలన్నీ తప్పుడు ప్రచారాన్ని మొదలుబెట్టాయి. తమ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి వచ్చిన కొత్త ప్రభుత్వాలన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వాలే అన్న ప్రచారం చేస్తున్నాయి. అదే గతంలో తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఏర్పరచడం కోసం సాగించిన కుట్రల విషయంలో ఏనాడూ నోరు విప్పలేదు.
నైగర్‌ ఉదంతం సామ్రాజ్యవాదుల రెండు నాల్కల ధోరణిని స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ ఎన్నికైన దేశాధ్యక్షుడు బాజౌమ్‌ సామ్రాజ్యవాదానికి పూర్తిగా అనుకూలుడు. ఎంతదాకా పోయాడంటే తన దేశంలో ఉన్న ఫ్రెంచి సైన్యాల సంఖ్యను ఇంకా పెంచాలని కోరాడు! దాంతో అతడికి సెక్యూరిటీగా ఉండిన వారినే ఉపయోగించి నైగర్‌ దేశం సైన్యంలోని ఉన్నతాధికారుల బృందం బాజౌమ్‌ను పదవినుండి తప్పించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా దేశపు దేశాంగ సహాయ మంత్రిగా (డెప్యుటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌) ఉన్న విక్టోరియా న్యూలాండ్‌ సవ్యంగా నైగర్‌ పోయి అక్కడ కుట్రదారులలో ముఖ్యుల్ని కలుసుకుని మళ్ళీ బాజౌమ్‌ను దేశాధ్యక్షుడిగా తీసుకురావాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని (!) కోరారు. ఇదే విక్టోరియా న్యూలాండ్‌ 2014లో ఎన్నికైన విక్టర్‌ యానుకోవిచ్‌ ప్రభుత్వాన్ని అధికారాన్నుంచి తప్పించడానికి పన్నిన కుట్రకు సూత్రధారిగా వ్యవహరించారు. ఆ తర్వాత అక్కడ అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడడం ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి ఏ విధంగా దారితీసిందో మనం చూస్తున్నాం. సామ్రాజ్యవాదులకి ప్రజాస్వామ్యం మీద నిజమైన ప్రేమ లేదు అని, కేవలం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగిస్తారని దీనిని బట్టి చెప్పవచ్చు.
ఏదైనప్పటికీ కుట్రల ద్వారా ప్రభుత్వాలను ఏర్పరచడం అభ్యంతరకరమే కదా! అని వాదించవచ్చు. కాని పశ్చిమ ఆఫ్రికాలోని చాలా మంది ప్రభుత్వ నేతలు ఫ్రెంచి ప్రభుత్వంతో, ఫ్రెంచి పెట్టుబడిదారీ వర్గంతో కుమ్మక్కై, తమ దేశాలలో ఉన్న అపారమైన సహజవనరుల నిల్వలను ఫ్రాన్స్‌ కొల్లగొట్టడానికి సహకరిస్తూ ఆ క్రమంలో స్వంతంగా ఆస్తులను విపరీతంగా పోగేసుకున్నారు. ఆ ప్రాంతంలో యురేనియం నిల్వలు అపారంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో విద్యుత్తు ఎక్కువగా అణువిద్యుత్‌ ప్లాంట్లలో జరుగుతుంది. వాటికి యురేనియం ముడిపదార్థం కావాలి. దానిని కొల్లగొట్టడానికి సహకరించి, ఆక్రమంలో సంపాదించిన అపార ధనాన్ని ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి వెదజల్లి అధికారం తిరిగి సంపాదించుకుంటున్న దేశాధినేతలు వాళ్ళు. ”ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన” ఈ ప్రభుత్వాలకు విస్తృత ప్రజానీకపు మద్దతు ఏమాత్రమూ లేదు. అవినీతి పద్ధతుల్లో అవినీతిపరులైన వ్యక్తులు ఎన్నికలను తారుమారు చేయడం ద్వారా అధికారంలోకి రాగలిగారే తప్ప ప్రజాభిమానం పొందడం ద్వారా కాదు.
మరో పక్క అక్కడి దేశాల సైన్యాలలో విప్లవకర భావాలున్నవారు, దేశభక్తులు గణనీయంగా ఉన్నారు. వారి సారధ్యంలో నైగర్‌లో జరిగిన ”కుట్ర”కు దేశ ప్రజలనుండి విశేషమైన మద్దతు లభించింది. చివరికి పశ్చిమ దేశాల మీడియా నిర్వహించిన సర్వే కూడా నైగర్‌ ప్రజల్లో అత్యధిక శాతం ఫ్రెంచి సైన్యాలను వెళ్ళగొట్టాలనే అభిప్రాయాన్ని బలంగా సమర్థిస్తున్నారని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో మితిమీరిన అవినీతి పద్ధతులకు పాల్పడడం ప్రస్తుతం నైజీరియాలో మనకి కనిపిస్తోంది.
అక్కడ దేశాధ్యక్షుడిగా ఉన్న బోలా టినుబు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, హవాలా లావాదేవీలకు సహకరించి ఆ క్రమంలో విపరీతంగా సంపాదించుకున్నాడు. అతగాడు అమెరికాలో ఉన్న కాలంలో ఆ అక్రమ వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి. నైజీరియాకు తిరిగి వచ్చాక అక్కడి రాజకీయ నాయకులందరిలో తానే అత్యంత సంపన్నుడని తెలుసుకుని, ఎన్నికల్లో దిగి డబ్బుతో ఓట్లు కొని దేశాధ్యక్షుడయాడు. నైజీరియాలోని అమెరికన్‌ దౌత్య కార్యాలయంతో అనునిత్యం సంప్రదింపుల్లో ఉంటాడు. పొరుగుదేశం అయిన నైగర్‌లో కొత్త ప్రభుత్వం (సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే ప్రభుత్వం) ఏర్పడగానే ఏకపక్షంగా ఆ దేశానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించాడు. ఇకోవాస్‌కు ఈ బోలా టినుబు ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నాడు. ఆ పదవిని ఉపయోగించి తక్కిన దేశాలనన్నింటినీ నైగర్‌కు వ్యతిరేకంగా సమీకరించడానికి పూనుకున్నాడు. నైగర్‌లో బాజౌమ్‌ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పరచకుంటే తమ సంస్థ సైనిక చర్యకు సైతం పూనుకుంటుందని హెచ్చరించాడు.
కాని నైజీరియాలోని పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే నైగర్‌లో సైనిక జోక్యం చేసుకోగల స్థితి నైజీరియాకు లేదు. పైగా గినీ, బుర్కినా ఫాసో, మాలి దేశాలు నైగర్‌లో గనుక ఇకోవాస్‌ జోక్యం చేసుకుంటే తమ దేశాల సైన్యాలు నైగర్‌ ప్రభుత్వానికి అండగా నిలబడతాయని హెచ్చరించారు. ఈ పరిస్థితి ప్రస్తుతం పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రభుత్వాలకు అనుకూలంగా తయారైంది.
అయినప్పటికీ, బోలా టినుబు, అతడికి అనుకూలంగా ఉన్న కూటమి నైగర్‌ సరిహద్దుల్లో సైన్యాలను మోహరిస్తున్నాయన్న వార్తలు వినవస్తున్నాయి. అంటే పశ్చిమ ఆఫ్రికాలో యుధ్ధ వాతావరణం ఏర్పడుతోందన్నమాట. ఈ యుద్ధం ఒకవేళ జరిగితే అది సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటించే శక్తులకూ, సామ్రాజ్యవాదానికీ మధ్య యుద్ధంగా ఉంటుంది. ఇందులో సామ్రాజ్యవాద దేశాలు ప్రత్యక్షంగా దిగకపోయినా, తమ తొత్తులద్వారా పాల్గొంటున్నట్టు గుర్తించాలి. ఇది వలస దోపిడీనుండి తమ దేశాలను విముక్తి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సైనిక పరమైన జోక్యంతో సామ్రాజ్యవాద శక్తులు దెబ్బ తీయడానికి చేస్తున్న కుట్ర. తాము స్వయంగా జోక్యం చేసుకోడం కన్నా తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇకోవాస్‌ ద్వారా కార్యం సాధించుకోవాలన్నదే సామ్రాజ్యవాదుల కుట్ర.
ఇక్కడ విశేషం ఏమంటే సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు రష్యా సహకారాన్ని కోరుతున్నాయి. గతంలో సోవియట్‌ యూనియన్‌గా ఉండిన కాలంలో తమ దేశాల్లో జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు ఏ విధమైన సహకారం లభించిందో ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. కాని ఇప్పటి రష్యా వేరు, అప్పటి సోవియట్‌ యూనియన్‌ వేరు. అయినప్పటికీ ప్రస్తుతం రష్యా కూడా అమెరికన్‌ ఆధిపత్యాన్ని ఎదిరించి వ్యవహరి స్తోంది గనుక గత కాలపు పాత్రనే తమ విషయంలో పోషించాలని బుర్కినా ఫాసో, నైగర్‌ వగైరా దేశాలు అభిలషిస్తున్నాయి.
ప్రభాత్‌ పట్నాయక్‌ 

Spread the love