”కారే రాజుల్, ఏలరే రాజ్యముల్, వారేరీ, సిరి మూట గట్టుకుని పోవం జాలిరే!” అన్నారు పోతన. అందుకే అధికారమే ప్రధానంగా భావించే ప్రధానిగా కాక, ప్రాణముంటే చాలనుకునే సగటు మనిషిగా ఆలోచించండి! ధనమా? ప్రాణమా? దేన్ని కోరుకుంటారు? బడా కార్పొరేట్ల ధనరాసుల కోసం, వందలాది గిరిజనుల ప్రాణాలను హరింపజేయటం మానవత్వమా మోడీజీ!
ప్రధానిగా మీరు తీసుకుంటున్న వేతనం, లక్షల విలువైన మీ సూట్లు, విదేశాల నుండి కూడా తెప్పించు కుంటున్న ఖరీదైన పౌష్టికాహారం, నివసించే ఇంద్రభవనం, విహరించే ప్రత్యేక విమానం వగైరాలన్నీ ప్రజా ధనమే గదా. కోట్లాది బడుగు జీవుల ఓట్లతో ప్రధాని వైనందునే కదా మీరింతటి విలాస జీవనం ప్రాప్తించింది! ఈ వాస్తవాన్ని విస్మరించటం కన్నా, కృతఘ్నత ఇంకేముంటుంది మోడీజీ! చారు వాలాను, బీసీనంటూ ప్రధానియైన మీరు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టి రిజర్వేషన్లు లేకుండా చేసి, కోట్లాది బీసీల పొట్ట గొట్టటం మానవీయతా మోడీజీ!
వాళ్ళ సంపద గుట్టల్ని పెంచగలిగినంత వరకే మీ అవసరం. అది మీ వల్ల కాదనుకున్న మరుక్షణం, వాడేసిన టూత్‌పేస్ట్‌లా మిమ్మల్ని విసిరేస్తారు కార్పొరేట్లు! కానీ కష్టజీవులకు సంపదతో పనిలేదు, వాళ్ళ కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యాలకు భరోసా కల్పిస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని తమ గుండె గుడిలో ప్రతిష్టించుకుంటారు! చరిత్ర చెబుతున్న సత్యమిదే మోడీజీ! ఇక ప్రస్తుత విషయానికొద్దాం!
”ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అమెరికా చేతికి రక్తమంటుతుంది!” ఇది ప్రపంచ నానుడి! ”దేశంలో ఎక్కడ మత ఘర్షణలు చెలరేగినా బీజేపీ, ఆరెస్సెస్ చేతికి రక్తమంటుతుంది!” ఇది భారతీయుల అనుభవం!
ఆయిల్ నిక్షేపాల కోసం అరబ్ దేశాలపై దాడులను ప్రోత్సహిస్తుంటుంది అమెరికా! అందుకే ‘ఈ ఆయిల్ నిక్షేపాలు, మాకు వరమో? అమెరికా వల్ల, అవి మాకు శాపమో తెలియటం లేదంటూ, వాపోతుంటారు అరబ్ ప్రజలు! ”ఖనిజాలున్నవని తెలిస్తేచాలు, మా నివాస ప్రాంతాలపై దాడులను ప్రోత్సహిస్తున్నది బీజేపీ ప్రభుత్వం! అందుకే ఈ అడవులు, కొండలు, ప్రకృతి మాకు ప్రసాదించిన వరమో, బీజేపీ వల్ల శాపమో అర్థం కావటం లేదంటూ బావురుమంటున్నారు భారతీయ గిరిజనులు! అమెరికాలోని ఆయుధ, ఆయిల్ వ్యాపారుల దురాశను తీర్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతి ఎదురవుతున్నా సరే యుద్ధాలకు వెనకాడని అమెరికా ప్రభుత్వం లాగే – బడా కార్పొరేట్ల దురాశను, తీర్చేందుకు జాతీయంగా, అంతర్జాతీయంగా అపఖ్యాతి చుట్టుముడుతున్నా సరే గిరిజనులపై దాడులను ప్రోత్సహిస్తూనే ఉంటుంది బీజేపీ ప్రభుత్వం! అనుకుంటున్నారు ప్రజలు! ”మా పాలనలో దేశం భద్రంగా ఉంటుంది! నేను కాపలాదారును! ఈశాన్య భారతాన శాంతిని నెలకొల్పుతాను’ అంటూ ప్రధాని అయ్యారు! మీ హయాంలో మీ డబులింజన్ సర్కారు పాలనలో మృగాలు కూడా సిగ్గుపడేలా స్త్రీమూర్తులను నగంగా ఊరేగించారు. పైశాచికంగా అత్యాచారం చేసి, కూకీలను రాక్షసంగా హతమార్చారు. మిమ్మల్ని సిగ్గు, అవమాన, అసమర్థ, న్యూనతా భావాలు ఉక్కిరి, బిక్కిరి చేయటం లేదా మోడీజీ?
మీరలా చేయనందువల్లనే, జాతీయంగా, అంతర్జాతీయంగాను, బీజేపీ డబులింజన్ సర్కారుపై వెల్లువెత్తిన విమర్శలను, మీ అభిమానులు సైతం విశ్వసిస్తున్నారు! ఆ విమర్శలివే… నాడు గుజరాత్‌లో మైనారిటీ ముస్లింలపై మెజారిటీ హిందూ మూకుమ్మడి దాడులకు గేట్లేత్తి – హిందూ ఓటర్ల సమీకరణ ద్వారా మీరు బీజేపీ అధికారాన్ని సుస్థిరాన్ని సుస్థిరం చేసుకున్నట్లే, నేడు మణిపూర్‌లో బీరేన్‌సింగ్ మైనారిటీ కుకీ క్రైస్తవులపై, మోజారిటీ మెయితీ హిందూ మూకదాడులకు గేట్లు తెరిచి, మెయితీల సమీకరణ ద్వారా, బీజేపీ అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్న ఫలితమే ‘మణిపూర్ – మారణ కాండ’ని భారతీయులే కాదు, అంతర్జాతీయ పరిశీలకులూ ప్రకటించారు! రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వమూ బుద్ధి పూర్వకంగా కొనసాగిస్తున్నదే మణిపూర్ దహనకాండ! ఎందుకంటే, రత్నాలు, వజ్రాలతో సహా 42 రకాల విలువైన ఖనిజాలున్న, మణిపూర్ పర్వత, అటవీ ప్రాంతాలపై బడా కార్పొరేట్ల కన్నుబడింది. అక్కడ నుండి కుకీలను భీతావహుల్ని చేసి పారగొట్టేందుకే అలా చేస్తున్నట్లు ప్రపంచం కోడైకూస్తున్నది! అందుకు సాక్ష్యాలు…1. మణిపూర్‌లో మీరు నియమించిన మహిళా కమిషనర్ అన్నమాటలివీ ”నేనెప్పటికప్పుడు మణిపూర్ మంటల వివరాలను, సీఎం ఛాంబరుకు పంపుతూనే ఉన్నాను, వారు స్పందించటం లేదు’ అన్నారు! 2. ”మణిపూర్ సంఘటనలను గంటల ప్రాతిపదికన రాష్ట్ర, కేంద్ర, హౌంశాఖలకు, సీఎం, పీఎం ఛాంబర్లకు పంపుతూనే ఉన్నా”నని మణిపూర్ గవర్నర్ ప్రకటించారని మీడియా సమాచారం! 3.మిమ్మల్ని కలిసేందుకు అపాయిట్‌మెంటు దొరకనందున, మణిపూర్ మారణకాండ వివరాలను పీఎం ఛాంబర్‌లో ఇచ్చామని కొందరు మణిపూర్ ఎమ్మెల్యేలు ప్రకటించారు! 4.మానవ జాతికే అవమానకరమైన వీడియో వైరలైన సందర్భంలో ఇదే కాదు, ఇలాంటివి ఎన్నో జరిగాయని సీఎం బీరేన్‌సింగ్ ప్రకటించాడు! 5.మణిపూర్‌లో నా ఇల్లే తగలబడితే, ఇక సామాన్యుల గతేంటి? అంటూ కేంద్ర బీజేపీ సహాయ మంత్రే వాపోయారు! 6.బీజేపీ సర్కారు మీద ప్రజలు విశ్వాసాన్ని పూర్తిగా కోల్పో యారని బీజేపీ ఎమ్మెల్యేలే ప్రకటించారు. 7.మే నెలలోనే ఆర్టికల్ 355 కింద మణిపూర్‌లో కేంద్ర బలగాలను దించి, రక్షణ బాధ్యతను మీ చేతుల్లోకి తీసుకున్నారు. అయినా సరే వందలాది చర్చీలు ధ్వంసమైనయి! గ్రామాలు తగలబడ్డాయి, 180మందికి పైగా చనిపోయారు, అసంఖ్యాకులు గాయాల పాలయ్యారు. వేలాది మంది సభ్యులు కొండా, కోనల్లో తలదాచుకుంటున్నారు. మీ శిబిరాల్లో తలదాచుకుంటున్న స్త్రీ, బాల, వృద్ధులు చావలేక బతుకుతున్నారు! ఇది బీజేపీ డబులింజన్ సర్కారు ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్న దారుణ మారణకాండనటానికి ఇంతకన్నా నిదర్శనాలేం కావాలి? మోడీగారికి మణిపూర్ మంటల నార్పే చిత్తశుద్ధి ఉంటే 355కు బదులు 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించి ఉండేవారని ఊరూ, వాడా వాపోతున్నారు!
అంతర్జాతీయంగా మీరు వల్లించే ఆదర్శాలకు, దేశీయంగా మీ చేతలకూ పొంతన లేకపోవటంతో, భారతీయులే కాదు, ప్రపంచ నేతలు సైతం మీరేంటో తెలియక జుట్టు పీక్కుంటున్నారు మోడీజీ! ఉదాహరణకు ప్రజాస్వామ్యం మారక్తంలోనే ఉంది! ‘భిన్నత్వంలో ఏకత్వమే మా భారతీయ విశిష్టత! ‘వసుదైన కుటుంబమే మాకు ఆదర్శం! అంటూ అంతర్జాతీయ వేదికల మీద విశ్వగురువులా ప్రవచించారు! కానీ భారత్‌లో మాత్రం ఒకే దేశం! ఒకేమతం! అంటూ హిందూ – ముస్లిం, హిందూ – క్రిస్టియన్ విద్వేషాలను జ్వలింపజేస్తున్నారు! ‘ప్రజాస్వామ్యం’ అన్న పాఠ్యాంశాన్నే పాఠ్యగ్రంథాల నుండి తొలగించేసారు! ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అట్ట హాసంగా ఆవిష్కరించి గిరిజనోద్ధారక నేతగా ప్రశంసించారు! మణిపూర్ స్త్రీల అమానవీయ మారణకాండకు ఏమాత్రం చలించని, కనీసం ఒక స్త్రీగానైనా స్పందించని గౌరవనీయ గిరిజన స్త్రీని రాష్ట్రపతిని చేసావు. అలా మీ గిరిజన ప్రేమను ప్రపంచానికి చాటావు! నిశ్శబ్దంగా చర్చకు అవకాశమివ్వకుండా గిరిజన వ్యతిరేక, అటవీ విధ్వంసక చట్టాలను చేసావు మోడీజీ! ఉదాహరణకు మణిపూర్ దారుణాలను కనీసం ప్రపంచం కోసమైనా ఖండించకపోగా, వాటిని గూర్చి నిలదీసిన ప్రతిపక్షాలపై మీరు ప్రదర్శించిన వెటకారాలకు, చప్పట్లు కొడుతున్న మహనీయులను, బల్లలు చరుస్తున్న మహిళా మణులను మంత్రులుగా నియమించుకున్నావు!
మణిపూర్ మంటలనార్పండి మహాప్రభో అంటూ దేశం గగ్గోలు పెడుతుంటే, ప్రజల దృష్టిని మళ్ళిం చేందుకని హర్యానాలో మత విద్వేషపు మంటల్ని రేపి అదిగో అటు చూడమంటున్నావు! నాడు ఈస్టిండియా వారు ప్రజలను విభజించి, దేశాన్ని పాలించారు! నేడు నార్తిండియా పాలకులు కష్టజీవులను విభజించి, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారంటూ సౌతిండియా ప్రజలు వాపోతున్నారు. రామాలయాన్ని కట్టాడు, దేశాన్ని రామ రాజ్యంగా రూపొందిస్తాడు మోడీ అనుకుంటే, రావణకాష్టంగా మార్చాడు అంటూ వాపోతున్నారు ఉత్తర భారతీయులు! బీజేపీ ఉన్నంత కాలం శాంతి మాట దేవుడెరుగు, అశాంతి, హాహాకారాలు చల్లారవుగాక చల్లారవంటూ బావురు మంటున్నారు ఈశాన్య భారతీయులు! దయనీయ ‘ఉత్తమ ప్రధాని’వి కాలేకపోయినా, కనీసం ‘ఉత్తమ మానవునిగా (నరేంద్రునిగా) నైనా జీవించండి మోడీజీ!
సెల్:9849081889
పాతూరి
వెంకటేశ్వరరావు