‘గృహలక్ష్మి’లో వికలాంగుల విస్మరణ

గృహలక్ష్మిలో-వికలాంగుల
గృహలక్ష్మిలో-వికలాంగుల

స్వంత స్థలం కలిగి, ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంటిని నిర్మించు కోవడానికి ఆర్థిక సహాయం చేయడానికి గృహలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి మార్గదర్శకాలను రోడ్డు, రవాణా, భవన నిర్మాణశాఖ జూన్‌ 21న జీఓ నెం.25ను విడుదల చేసింది. జీఓలో ఎస్సీ 20శాతం, ఎస్టీ 10శాతం, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్స్‌ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్స్‌ అమలు చేయడాన్ని విస్మరించింది. ఈ పథకం ద్వారా స్వంత స్థలం కలిగిన అర్హులైన నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం 3లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. వికలాంగులకు ఇచ్చే సాధారణ లబ్దిలో 2016 ఆర్‌పిడి చట్టం సెక్షన్‌ 24ప్రకారం వికలాంగులకు 25శాతం అదనంగా చెల్లించాలి. అంటే గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రూ.3.75లక్షలు ఆర్థిక సహాయం చేయాలి. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకంలో వికలాంగులకు 25శాతం అదనంగా చెల్లిస్తున్నది. గృహలక్ష్మి పథకం అమలు కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో వికలాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలలో 5శాతం రిజర్వేషన్స్‌ అమలు చేయాలని 2018 జనవరి 1న విడుదల చేసిన జీఓ నెం.1 ఆదేశాలను విస్మరించారు. అధికారుల అలసత్వం వలన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్‌ అమలు కానటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48లక్షల మంది వికలాంగులున్నారు. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ డిసెబుల్డ్‌ స్టడీ ఆఫ్‌ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం 43.02లక్షల మంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12.2శాతం మంది వికలాంగులు ఉన్నారు. దేశ సగటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది వికలాంగులు మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు 5,16,890 మందికి పంపిణీ చేస్తుంది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలో వికలాంగులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో 5శాతం రిజర్వేషన్స్‌ వికలాంగులకు అమలు చేయాలని 2016 ఆర్‌పిడి చట్టం సెక్షన్‌ 37(బి) సూచిస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 25లో కులాల వారిగా రిజర్వేషన్స్‌ అమలు చేయాలని పేర్కొన్నారు. కానీ వికలాంగులకు అమలు చేయాల్సిన రిజర్వేషన్స్‌ పై జీఓలో లేదు. జీఓ 1, 2016 ఆర్‌పిడి చట్టానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వికలాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చట్ట ప్రకారం వికలాంగులకు దక్కాల్సిన రిజర్వేషన్స్‌ అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు జీఓలు విడుదల చేస్తున్నప్పుడు వికలాంగులకు 5శాతం కేటాయించే విధంగా వికలాంగుల సంక్షేమశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో అధికారులు తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వికలాంగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో ఏముందో లేదో తెలియనటువంటి స్థితిలో వికలాంగుల సంక్షేమశాఖ ఉంది. వివిధ శాఖల అధికారులు 2016 ఆర్‌పిడి చట్టానికి తూట్లు పొడుస్తుంటే పర్యవేక్షించాల్సిన కమిషనర్‌ ఏమి పట్టనట్లుగా ఉండటం బాధాకారం. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం చాలా మంది వికలాంగులకు అన్యాయం జరుగుతోంది. ఆహార భద్రత కార్డ్‌తో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రభుత్వం ఇచ్చే 3లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవు. వికలాంగులకు ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. జీఓ నెం.25ను సవరించి వికలాంగులకు రిజర్వేషన్స్‌ అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్‌ అమలు చేయించుకోవడానికి ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎం. అడివయ్య
9490098713

Spread the love