ఇకనైనా ఇండ్ల సమస్య పరిష్కరిస్తారా?

రాష్ట్రంలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య ముందుకొచ్చింది. ఈ సమస్య గురించి స్పందించకుండా ప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేసే అవకాశం లేదు. సమస్య ప్రాధాన్యత రీత్యా గానీ, రాష్ట్ర వ్యాపిత పోరాటాల రీత్యాగానీ ఇది అనివార్యం. తెలంగాణ ప్రజా సంఘాల పోరాటవేదిక ఒకవైపు, సీపీఐ(ఎం), మరికొన్ని వామపక్షాలు మరోవైపూ ఎవరి పోరాటాలు వారు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 30లక్షల మందికి సొంత ఇండ్లు లేవు. మరోవైపు ఖాళీ స్థలాలన్నీ బడా బాబులు, రియలెస్టేట్‌ వ్యాపారులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నారు. భూమి విలువ పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇవ్వాలంటే అధికారులకూ, పాలకులకూ మనసొప్పటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పుడు రాకపోతే ఇంక ఎప్పుడూ రావన్న భయంతో పేదలున్నారు. అందుకే తెగించి పోరాడుతున్నారు. ఇది వారికి జీవన్మరణ పోరాటంగా మారింది. ముఖ్యంగా పట్టణీకరణ జరుగుతున్నందున, భూమికీ, ఇంటి సౌకర్యానికీ ప్రాధాన్యత పెరిగింది. అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద, కౌలు రైతులు, ఛిద్రమైన వృత్తిదారుల కుటుంబాలు తలదాచుకోడానికి ఇల్లులేక విలవిలలాడు తున్నారు. పెరిగిన నిత్యజీవితావసర సరుకుల ధరలు, విద్యా, వైద్యం ఖర్చులకు తోడు తమ ఆదాయంలో గణనీయ మైన భాగం ఇంటి కిరాయికే పోతున్నది. లేదంటే మురికివాడల్లో, రోడ్లపక్కన తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని జీవించవల్సి వస్తున్నది. అందుకే ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని లక్షలాది పేదలు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టు కున్నారు. ఏండ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం తేల్చకుండా నానబెడుతున్నది.
ప్రభుత్వం చేసిన వాగ్దానాల వల్ల ఇప్పటిదాకా పేదలు, న్యాయం జరుగు తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రానేవచ్చింది. ఇక తమగురించి పట్టించుకునే వారు లేరన్న ఆందోళనలో పడ్డారు జనం. అందుకే ఈ కదలిక. ఇండ్లులేని పేదలకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏండ్లు గడిచింది. ఐదులక్షల అరవైవేల ఇండ్లు ఇస్తామన్న ప్రభుత్వం, హైదరాబాద్‌ మహానగరంలోనే ఏడాదిలో లక్ష ఇండ్లు వాగ్దానం చేసింది. మాట నిలబెట్టుకోలేదు. వాగ్దానం చేసిన ఆరు సంవత్సరాల తర్వాత కూడా నిర్మాణం మొదలైంది 2,92,000 డబల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు మాత్రమే. ఇందులో పూర్తయినవి లక్షా ముప్పైవేలు మాత్రమే! పంపిణీ చేసింది కేవలం 36వేల ఇండ్లు. ఇది ‘మంచం కోళ్ళు, పంచపాండవుల’ సామెతను గుర్తుకు తెస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ పేరుతో ఊరించడమే తప్ప ఇచ్చిందేమిటన్నది ప్రశ్నార్థకమే. 2022 నాటికే దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఇండ్లులేని పేదలు ఉండరన్నారు ప్రధాని. ఈ ఎనిమిదేండ్లలో 3కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు ప్రధాని మోడీ. 2022 నాటికే దేశంలో ఇండ్ల సమస్య పరిష్కారం అయిపోతుందన్న ప్రధాని, తెలంగాణలో ఇండ్లులేని 30లక్షల మంది విషయంలో నోరుమెదపటం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ పథకాన్ని 2024 వరకు పొడిగిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదని విమర్శిస్తూ, రాజకీయ లబ్దిపొందే ప్రయత్నమే తప్ప, కేంద్రంలో తమ ప్రభుత్వం విఫలమైన విషయం గురించి మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌ సమావేశాలలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల ఊసెత్తలేదు. ఓట్ల కోసమైనా… ఎన్నికలు దగ్గరపడ్డ తర్వాత ఇస్తారని ఎదురుచూసిన పేదల ఆశలు అడియాసలయ్యాయి. పోడుభూముల అప్లికేషన్లు కూడా అత్యధికం తిరస్కరణకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వాల ధోరణి అర్థం చేసుకున్న పేదలు పోరాటాన్ని విస్తరిస్తున్నారు. ఉధృతం చేస్తున్నారు. 9నెలల కింద, వరంగల్‌ మహానగరంలో జక్కలొద్ది ప్రాంతంలో మొదలైన పోరాటం ఇప్పుడు 23జిల్లాలకు, 47 కేంద్రాలకు విస్తరించింది. సుమారు 28వేల కుటుంబాలు ఇండ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. మరో 78 కేంద్రాలలో భూమిలేని పేదలు సుమారు 11వేల ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. ఇండ్ల స్థలాల కోసం ఈ పోరాట కేంద్రాలు ఇంకా విస్తరిస్తున్నాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభంకాగానే ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రికి నిర్దిష్ట కోర్కెలతో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు వంద మున్సిపల్‌ పట్టణాలలో ఇండ్లులేని పేదల గురించి సర్వే చేసారు. మరో యాభై మండల కేంద్రాల్లో కూడా ఈ సర్వే జరిగింది. ఈ నెల 3వ తేదీన వేలాది మంది పేదలు 150 తహసీల్‌దార్‌ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి, దరఖాస్తులు అందజేశారు. ఇక్కడ మహిళల కదలిక ప్రత్యేకంగా గమనించాలి. తడికచాటు అవసరం ఆడబిడ్డల అవసరం కదా! ఈ మాత్రం సోయి పాలకులకు గానీ, అధికారులకు గానీలేదు. ఇంత జరిగిన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌లో, సొంత స్థలం ఉన్నవారు ఇండ్లు కట్టుకోడానికి మూడులక్షల రూపాయలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 3లక్షలతో ఒక్క గది కూడా నిర్మించటం కష్టం. అందువల్ల దానిని గతంలో ముఖ్య మంత్రి స్వయంగా చేసిన వాగ్దానం మేరకు ఐదులక్షలకు పెంచాలని పోరాట వేదిక డిమాండు చేసింది. ఇదొక భాగం. 47 కేంద్రాలలో గుడిసెలు వేసుకున్న వారి ప్రస్తావన లేదు. ఇండ్లస్థలం లేని పేదల ఊసులేదు.
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, మిగులు భూములు, వ్యవసాయం లేని శిఖం భూములున్నాయి. ఈ స్థలాలు తమకు కేటాయించాలని పేదలు కోరుతున్నారు. ఇది పేదల హక్కు. ఈభూమి ఎవరి సొంతం కాదు. పుట్టిన ప్రతి వ్యక్తికి భూమిమీద నివసించే హక్కు ఉన్నది. అందుకే ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని వారందరికీ కనీసం 120 గజాల స్థలం చొప్పున కేటాయించి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయటం ప్రభుత్వాల బాధ్యత. పట్టణీకరణతో వ్యవసాయభూమి ఇతర అవసరాలకు మారిపోతున్నది. చెరువులు పడావు పడుతున్నాయి. ఈ శిఖం భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసి పేదలకు కేటాయించాలి. కానీ పాలకులు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. భూమి కనిపిస్తే చాలు… బడా బాబులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులూ, ప్రజాప్రతినిధులు కబ్జాలు పెడుతున్నారు. ఉన్నతాధికారులు వీరితో కుమ్మక్కై లంచావతారాలుగా మారారు. ఫలితంగా ఇప్పటికే పెద్దయెత్తున భూములు బడాబాబుల కబ్జాలపాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 9న హైదరాబాద్‌లో వేలాది పేదలు మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు అనుమతిస్తూనే, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి ముత్యంరావులతో సహా, సగానికి పైగా జిల్లాలలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, మహిళా తదితర సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసారు. ధర్నాకు బయలుదేరిన పేదలను పోలీసులు అడ్డుకున్నారు. ఇన్ని ఆటంకాలు అధిగమించి, వేలాదిగా పేదలు తరలివచ్చారంటేనే సమస్య తీవ్రతను పాలకులు అర్థం చేసుకోవాలి. అనేక గుడిసెల కేంద్రాలలో పేదల మీద దాడులు చేసిన పోలీసులు, ధర్నా సందర్భంగా కూడా ఆటంకపరిచేందుకు ప్రయత్నించారు. పాలకుల ధోరణిలో వస్తున్న మార్పులకిది సూచిక. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, వైసీపీ లేదా మరొక పార్టీ అన్న తేడాలేదు. ఎర్రజెండా పార్టీలు మినహా, దేశంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా ప్రజల మీద పోలీసుల ప్రయోగం పెరిగింది. ఇది సరళీకృత ఆర్థిక విధానాల ఫలితం. ఈ పార్టీలన్నీ బడాబాబుల ప్రయోజనాలు కాపాడే విధానాలే అమలు చేస్తున్నాయి కదా! దాని ఫలితమే ఇది!
మహా ధర్నా తర్వాతనైనా సమస్య పరిష్కారానికి పాలకులు ముందుకొస్తారని పేదలు ఆశించారు. ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఉన్నది. ధర్నా జరిగిన మరుసటిరోజే కొన్నిచోట్ల పోలీసు అధికారులు బెదిరించటం మొదలైంది. గుడిసెలు పీకేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతుంటే బీజేపీ నాయకుల ధోరణి వింతగా ఉన్నది. పేదల పోరాటాలు వారికేమాత్రం పట్టవు. శాసనసభ ప్రాంగణంలో తాము విశ్రాంతి తీసుకోడానికి గదిలేదని వాపోతున్నారు. రాష్ట్రంలో పేద మహిళలకు తడిక చాటు లేదన్న స్పృహలేదు. ఇలాంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో బలపడేందుకు కుయుక్తులు పన్నుతున్న సమయమిది. ఈ పరిస్థితులలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించటం విచారకరం. పైగా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేయటమంటే చట్టం చేతుల్లోకి తీసుకోవటమే కదా! అని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. బడా బాబులు కబ్జాపెట్టి, కోట్లు సంపాదించుతుంటే ఈ మాత్రం సోయి అప్పుడెందుకులేదు వీరికి? ప్రభుత్వమే సర్వేచేసి, సమస్య పరిష్కరిస్తే ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా! జీఓ నెం.58(5.8.22) ప్రకారం, ఇప్పటికే గుడిసెలు వేసుకున్న వారికి, కుటుంబానికి 120 గజాలు రెగ్యులరైజ్‌ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కుటుంబానికి రూ.పదిలక్షలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఐదులక్షలు ఇవ్వాలి. 15లక్షలతో పేదలు కనీస సౌకర్యాలు గల ఇల్లు నిర్మించు కోగలుగుతారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు తమ బాధ్యతలను విస్మరించజాలరు. పాలకులు బాధ్యతలు గుర్తెరుగనప్పుడు,పేదలకు పోరాటం తప్ప మరో మార్గం లేదు కదా!
– ఎస్‌. వీరయ్య

Spread the love