యుసిసి-వికలాంగులపై ప్రభావం

ఒకే దేశం, ఒకే చట్టం పేరుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏకరూప పౌరస్మృతిని (యుసిసి) తీసుకురావాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యుసిసి పరిధిలోకి ఈ కింది అంశాలు వస్తున్నాయి. వివాహ వ్యవస్థ – నిబంధనలు (భార్య, పిల్లలు), దత్తత, సంరక్షణ, వారసత్వం వ్యవస్థ, ఆస్తి హక్కు, ట్రస్ట్‌/ బహుమతులు/ఎండోమెంట్స్‌, గిరిజన ప్రజలకు సంబంధిత ఆస్తులు, స్థానిక పంచాయతీల నిర్వహణలో ఉన్నటువంటి అటవీ భూములు, పోరంబోకు భూములు, కమ్యూనిటీ ఆస్తులు వంటివి సామూహికంగా ప్రజల అవసరాల కోసం వినియోగించడం జరుగుతుంది. వీటిని వికలాంగులతో సహా ప్రజలందరూ వినియోగించు కుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం యుసిసి అమలు చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చట్టాలను మార్చినట్లయితే వికలాంగులు, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా ప్రభావితం అవుతారు. ఎందుకంటే వికలాంగులు, పిల్లలు, భార్యాభర్తలు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, తాతముత్తాతలు, మేనమామలు, కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. సమాజంలో సభ్యులుగా ఉన్నప్పటికీ వీరు భిన్నమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తమ జీవిత కాలంలో వయస్సు, లింగం, కుల, మతపరమైన గుర్తింపులకు నోచుకోరు. ఈ నేపథ్యంలో సమాజంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు తీరే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి.
హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ మతాలకు అనుగుణంగా అనేక చట్టాలున్నాయి. ముస్లిం, క్రిస్టియన్లు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వ అస్తి, దత్తత వంటి అంశాల్లో చట్టాలు ఒకేలా లేవు. హిందూ మతంలో భార్య లేదా భర్త చనిపోతే రెండో వివాహం చేసుకునేందుకు గోవా పౌరస్మృతి అనుమతిస్తుంది. ఇతర మతాల్లో ఇలాంటి అవకాశం లేదు. సమాజ, కుటుంబ, సామాజిక రంగాలలో అనేక రకాలుగా వికలాంగులు అవమానాలు, అన్యాయాలు, వివక్షత, దోపిడీలకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు తలిదండ్రుల నుండి వికలాంగులకు వారసత్వంగా వస్తున్న ఆస్తిలో వారి వాటాను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమాజంలో నేడు వికలాంగులకు కుటుంబ సభ్యులు కనీస రక్షణ కల్పించే పరిస్థితి లేదు. వికలాంగులకు భద్రత కల్పించాలనే కనీస ఆలోచన లేకపోవడం వలన వారసత్వంగా వచ్చే ఆస్తిని సైతం పొందలేకపోతున్నారు. కుటుంబం నుండే అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నేడు సమాజంలో ఉంది. ఇప్పటికే దేశంలో అమలులో ఉన్న చట్టాలు వికలాంగులకు కొన్ని అంశాల్లో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. కానీ కుటుంబంలోని ఇతర సభ్యులతో సమాన అవకాశాలు పొందడం ఉండాలి. ఉదాహరణకు, ముస్లిం చట్టం ప్రకారం కూడా వికలాంగులు పుట్టుక, వివాహం, రక్తసంబంధం ద్వారా వారసత్వంగా పొందుతారు. వారి వాటా ఇతర వారసులతో సమానంగా ఉండాలి. వికలాంగుల హక్కుల చట్టం-2016, మానసిక ఆరోగ్య చట్టం-2017 ఆమోదించి అందిం చిన విధంగా, విక లాంగుల జీవితాలకు సంబంధించిన చట్టపర మైన అంశాలను పరిష్కరించేం దుకు అవసరమైన చర్యలు తీసు కోవాలి. వికలాంగులకు సంబంధించి వ్యక్తిగత చట్టాలతో పాటు, ఇతర పౌర చట్టాలు, పథకాల అమలుపై యుసిసి ప్రభావం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం 2007లో ఆమోదించింది. దీనికి అనుగుణంగానే 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌-2017 చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాలు వికలాంగులకు సంబంధించి ఇల్లు, కుటుంబం, ఆస్తిపై హక్కును పునరుద్ఘాటి స్తున్నాయి. నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ది వెల్ఫేర్‌ ఆఫ్‌ పర్సన్స్‌ ఆఫ్‌ ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ, మెంటల్‌ రిటార్డేషన్‌, మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ యాక్ట్‌ 2000… వంటి చట్టాలు కూడా వికలాంగులకు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. వికలాంగులతో సహా అందరూ సమాజంలో ఇవ్వబడిన హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత న్యాయ విధానాలు వికలాంగులకు కొన్ని రక్షణలను అందిస్తున్నాయి. ఆచార, వ్యక్తిగత చట్టాలలోని ఈ రక్షణలు మరింత పటిష్టంగా ఉంటే, వికలాంగులతో పాటు ప్రజలందరూ న్యాయం పొందడం సులభం అవుతుంది. గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కషి చేసినప్పటికీ అది పోవడానికి దాదాపు ఒక శతాబ్దం పట్టింది. బాల్య వివాహాలు ఇప్పటికీ కొనసాగు తున్నాయి. అటువంటి సందర్భంలో వికలాంగులైన మైనరులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటే న్యాయం పొందడం చాలా కష్టం. హిందూ చట్టానికి 2005లో సవరణ చేసి కుమార్తెలకు కోపర్సనరీ హక్కులను కల్పించింది. ఇది మహిళలు తమ హక్కులను పొందేందుకు ఒక మార్గాన్ని అందించింది.
వ్యక్తిగత చట్టాలను సంస్కరించాలనుకున్నప్పుడు, దాని కోసం ఏదైనా చట్టం చేయాలనుకున్నప్పుడు ప్రజలతో విస్తృత సంప్రదింపులు జరపాలి. యుఎన్‌సిఆర్‌పిడి నిబంధనలకు అనుగుణంగా దేశంలోని చట్టాలను మార్చాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 15(1), 15(2), 15(4), 16(2)లను వికలాంగుల పట్ల వివక్షను నిషేధించే విధంగా సవరణ చేయాలి. వికలాంగుల పట్ల వివక్షను నిషేధిస్తున్న ఆర్‌పిడబ్ల్యుడి చట్టం-2016 లోని సెక్షన్‌ 3(3)ని అమలు చేయాలి. వికలాంగులు ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించే చట్టాలను (మున్సిపల్‌, పంచాయతి, సహకార సంఘాలు) రద్దు లేదా సవరణ చేయాలి. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, కుటుంబ చట్టాలకు మధ్య ఉన్న ఘర్షణను తొలగించకుండా ఏకరూప పౌరస్మృతిని తీసుకువచ్చి అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదు.
యం. అడివయ్య
9490099713

Spread the love