కల్లుగీత కార్మికులకిచ్చిన హామీల అమలేది?

తరాలు మారుతున్నా గీతన్నల తలరాతలు మాత్రం మారడం లేదు. వారి వృత్తికి సరైన గ్యారంటీ, జీవితానికి భద్రత లేక కుటుంబాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం పొందే కార్యక్రమాలే తీసుకుంటున్నాయి. ఇవి గీతవృత్తిని నమ్ముకున్న కుటుంబాలకు శాశ్వత పరిష్కారం దిశగా ఫలితాలనివ్వడం లేదు. అందుకే కల్లుగీత కార్మికసంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టింది. ఆ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలునిచ్చింది. అయితే అంతకన్నా ముందు రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ అవసరం. రాష్ట్రంలో 5లక్షల కుటుంబాలు నేటికి కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. కుటుంబ పోషణ కోసం ప్రమాదకరమైన వృత్తి అయినప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ వృత్తిలో ప్రతి ఏడాది సుమారు 550మందికి పైగా ప్రమాదానికి గురవుతున్నారు. వీరిలో సుమారు 180మంది చనిపోతున్నారు మిగతా వారి కాళ్లు, చేతులు విరగడం, నడుము పడిపోవడం జరుగుతూనే ఉన్నాయి. సగటున నెలకు 47మంది పడిపోగా రెండురోజులకు ఒకరు చనిపోతున్నారంటే ఇంతటి మరణాలు ఎందులోను లేవు. ఇది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం. చిన్న యాక్సిడెంట్‌లు జరిగితేనే మీడియాలో గగ్గోలు పెట్టి ఎక్స్‌గ్రేషియో డిమాండ్‌ చేసేవారు గీత కార్మికులకు ఇన్ని ప్రమాదాలు జరిగినా గుర్తించకపోవడం బాధాకరం.
2021 డిసెంబర్‌ 10న హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో కల్లుగీత కార్మిక సంఘం అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సెమినార్‌లో బీసీి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బుర్రా వెంకటేశం(ఐఎయస్‌) పాల్గొన్నారు. గీత కార్మికుల మరణాలు, సమస్యల్ని సంఘం ఆధ్వర్యంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా చాలా లేటు అవుతున్నందున కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం చేయాలని, ప్రమాదాలు నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించాం. ఇది జరిగిన వారం రోజుల్లోనే సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లిలో గీత కార్మికుడు చెట్టుపై నుండి పడి మరణించాడు. ఈ విషయం ఆయన దృష్టికి తీసుకపోగా కల్లుగీత కార్పొరేషన్‌ నుండి దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.25వేలు ఆ కుటుంబానికి ఇచ్చారు. నేను, సెక్షన్‌ ఆఫీసర్‌ రవీందర్‌ గౌడ్‌ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి చెక్కు ఇచ్చి వచ్చాం. అప్పటి నుండి వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయిన వారి కుటుంబాలకు దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.25వేలు, దెబ్బలు తగిలిన వారికి మెడికల్‌ ఖర్బులకు రూ.15వేలు కార్పొరేషన్‌ నుండి ఇస్తున్నారు. ఇది సంఘం చేసిన కృషిలో ముఖ్యమైనది. ఈ 18నెలల కాలంలో సుమారు 840కుటుంబాలకు రూ.1.50కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. 270మంది చనిపోగా 570మందికి తీవ్రంగా డెబ్బలు తగిలాయి. ఈ ప్రమాదాల నివారణకు కృషిలో భాగంగా యాదగిరిగుట్టలో జరిగిన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా 2022 అక్టోబర్‌ 21న సేఫ్టి మోకు డెమో ప్రాక్టికల్‌గా ఇప్పించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన గీత కార్మికులు దీనితో చెట్లు ఎక్కి చూశారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారితే కింద పడకుండా లాక్‌ అవుతుంది. దీనిలో కొన్ని మార్పులు చేయాలని సూచనలు చేశాం. త్వరలో అందుబాటులోకి తెచ్చి ఈ ప్రమాదాలు నివారిస్తామని చెప్పారు.
1991లో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కల్లుగీత పారిశ్రామిక సహకార ఆర్థిక సంస్థ ఏర్పాటైంది. గీత కార్మిలకు రుణాలు ఇవ్వడం, నీరా తాటి ఉత్పత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు, నందనవనంలో ఐదెకరాల భూమి కొనుగోలు తదితర కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వాలు మారడం తగిన శ్రద్ధ చూపకపోవడంతో ఈ కార్పొరేషన్‌ క్రమంగా నీర్విర్యమైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా దీనికి తగిన బడ్జెట్‌ కేటాయింపులు జరగలేదు. దీని ద్వారా ఎలాంటి పథకాలు అమలు కాలేదు. దీని లక్ష్యం గీత కార్మికులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో అధునీకరణ తీసుకరావడం. కానీ అది నేటికీ నెరవేరలేదు. ఇటీవల ఎక్సైజ్‌ శాఖామాత్యులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌ నీరా పాలసి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన చొరవతో హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్‌లో నీరా కేఫ్‌ నిర్మించారు. ఇది మంచి విషయం. అయితే దీనిని రాష్ట్ర వ్యాపితంగా విస్తరింప చేయాల్సిన అవనరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్ల తర్వాత కల్లు గీత కార్పొరేషన్‌ చైర్మెన్‌గా పల్లె రవికుమార్‌ గౌడ్‌ని నియమించారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ఈ కార్పొ రేషన్‌ కృషి చేయాల్సిని అవనరం ఉంది. ప్రతి సంవత్సరం రూ.25 కోట్లు కేటాయి స్తున్నప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.30కోట్లు ప్రకటించి వదిలేశారు. కార్పొరేషన్‌కు సరిపడా నిధులు కేటాయించి, వృత్తిలో ఉపాధి కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ అవసరం.
త్వరలో ‘గీతన్న బీమా’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. రైతులకు మాదిరిగానే గీత కార్మికులకు వర్తింపచేస్తా మన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియో యథావిధిగా కొనసాగిస్తూనే ఇందులో కొన్ని మార్పులు చేయాలని పలుసంఘాలతో కలిసి కోరాం. సహజ మరణాలకు కూడా వర్తింప చేయాలని, వయసు పరిమితి 65సంవత్సరాలు ఉండాలని విన్నవించాం. మునుగోడు ఎన్నికల సందర్బంగా 2022 అక్టోబర్‌ 23న బీఆర్‌యస్‌ నిర్వహించిన గౌడ ఆత్మీయ సమేళనంలో కేసీఆర్‌ గీత కార్మికులకు మోపెడ్‌లు ఇస్తామని, ‘గౌడబంధు’ అమలు చేస్తామని చెప్పారు. వృత్తిలో ప్రమాదాలు నివారిస్తామని, సొసైటీలకే లిక్కర్‌ షాపులు ఇస్తామన్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీనిచ్చినా నేటికి అమలు చేయలేదు. బీసీ కుల వృత్తులు చేసేవారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని జూన్‌ 6న జీఓ నెం.5 విడుదల చేశారు. ఇందులో కల్లుగీత కార్పొరేషన్‌తో పాటు 11 కార్పొరేషన్స్‌, ఫెడరేషన్ప్‌ ఉన్నట్లు ప్రకటించారు. 7న ఇచ్చిన మెమోలో గీత కార్మికుల ప్రస్తావనలేదు. రాష్ట్రంలో ప్రధాన వృత్తిదారులైన గీత కార్మికులను విస్మరించారు. అయినప్పటికీ 13వేల మంది దరఖాస్తు చేసు కున్నారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు అందకపోవడంతో ఇంకా చాలా మంది చేసుకోలేకపోయారు. దీనికి మరొక 15రోజులు అవకాశం కల్పించి సభ్యత్వమున్న అందరికీ లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలి. కల్లుగీత కార్మికుల సంక్షే మానికి ఏర్వడ్డ కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించి దీని ద్వారానే నీరా కేంద్రాలు విస్తరింప చేయాలి. ప్రధానంగా భూమి, కల్లుకు మార్కెట్‌, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే గీతకార్మికుల జీవనోపాది మెరుగు పడటంతో పాటు వృత్తికి తగిన భద్రత ఉంటుంది
ఎం.వి. రమణ .
సెల్‌:9490098485

Spread the love